బ్రిటన్ లో టాప్-5 ప్రవాసులు భారతీయులే!
లండన్: బ్రిటన్‌లోని సంపన్న ఆసియా వ్యాపారవేత్తల జాబితాలో హిందూజా సోదరులు వరుసగా నాలుగోసారి అగ్రస్థానం దక్కించుకున్నారు. వారి వ్యక్తిగత సంపద విలువ 16.5 బిలియన్ పౌండ్లుగా ఉంది. బ్రిటన్‌కి చెందిన ఆసియన్ మీడియా అండ్ మార్కెట్ రూపొందించిన ‘ది ఆసియన్ రిచ్ లిస్ట్ 2016’ జాబితా ప్రకారం ప్రవాస భారతీయ సోదరులైన జీపీ హిందుజా, ఎస్పీ హిందుజా సంపద గత ఏడాది కాలంలో బిలియన్ పౌండ్ల మేర పెరిగింది.
జాబితాలో ఉక్కు దిగ్గజం లక్ష్మీ నివాస్ మిట్టల్ 6.4 బిలియన్ పౌండ్ల సంపదతో రెండో స్థానంలో, ఇండోరమా కార్పొరేషన్ చైర్మన్ శ్రీప్రకాశ్ లోహియా 3 బిలియన్ పౌండ్లతో మూడో స్థానంలో ఉన్నారు. 2.1 బిలియన్ పౌండ్లతో ఆరోరా బ్రదర్స్ నాలుగో స్థానంలో, 2 బిలియన్ పౌండ్లతో సైరస్ వంద్రేవాలా 5వ స్థానంలో ఉన్నారు. మిట్టల్ సంపద 3.3 బిలియన్ పౌండ్లు కరిగిపోయింది. ఎన్నారై పారిశ్రామికవేత్త లార్డ్ స్వరాజ్ పాల్ 500 మిలియన్ పౌండ్లతో 15వ సంపన్న ఆసియా వ్యాపారవేత్తగా నిల్చారు.