మరో రెండు అవినీతి చేపలు
=ఏసీబీకి చిక్కిన యూఎల్సీ సీనియర్ అసిస్టెంట్, అటెండర్
=యూఎల్సీ సర్టిఫికెట్‌కు రూ.10 వేలు డిమాండ్
=లంచం తీసుకుంటూ పట్టుబడ్డ వైనం
విశాఖపట్నం, స్యూస్లైన్ : కలెక్టరేట్లోని ఓ విభాగంలో సీనియర్ అసిస్టెంట్, అటెండర్ రూ. 8 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ నరసింహారావు తెలిపిన వివరాలివి. అక్కయ్యపాలెం నందగిరినగ ర్కు చెందిన వరిసి శ్రీనివాసరావు కుమారుడి చదువు కోసం తన మూడంతస్తుల భవనంపై బ్యాంకు రుణం కోసం దరఖాస్తు చేశాడు. బ్యాంకు అధికారులు యూఎల్సీ క్లియరెన్స్ సర్టిఫికెట్ తీసుకురావాలని కోరారు. ఈ మేరకు ఆయన ఈ ఏడాది ఆగస్టు 12న ప్రజావాణి కార్యక్రమంలో దరఖాస్తు చేసుకున్నాడు.
వాస్తవానికి ప్రజావాణిలో దరకాస్తులకు నెలరోజుల్లోపు సమాధానం ఇవ్వాలి. ఎప్పటికీ స్పందన లేకపోవడంతో కలెక్టరేట్లోని సంబంధిత భూ గరిష్ట పరిమితి చట్టం ప్రత్యేకాధికారి కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ కె.శ్రీనివాసరావును కలిశాడు. సర్టిఫికెట్ కోసం ఆయన రూ. 10 వేలు డిమాండ్ చేశాడు. ఆ డబ్బులే ఇచ్చుకోగలిగితే బ్యాంకు రుణం కోసం ఎందుకు ప్రయత్నిస్తానని చెప్పాడు. కనీసం రూ. 8 వేలు ఇవ్వాలని కోరాడు. దీంతో శ్రీనివాసరావు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. అధికారుల సూచన మేరకు రూ.8 వేలు తీసుకుని శుక్రవారం మధ్యాహ్నం యూఎల్సీ కార్యాలయానికి వెళ్లాడు.
సీనియర్ అసిస్టెంట్‌కి డబ్బులు ఇవ్వగా.. అటెండర్ వేణుగోపాలరెడ్డిని పిలిచి తీసుకోమని చెప్పాడు. అతడు ఆ మొత్తాన్ని తీసుకుని టీ కప్పు సాసర్ కింద పెట్టాడు. అప్పటికే సిద్ధం చేసిన యూఎల్సీ క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇచ్చారు. అక్కడ మాటువేసి ఉన్న ఏసీబీ డీఎస్పీ నరసింహారావు, ఇన్స్పెక్టర్లు రమణమూర్తి, గణేష్, రామకృష్ణ సొమ్ము స్వాధీనం చేసుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులను శనివారం రిమాండ్‌కు తరలించనున్నట్లు తెలిపారు.