Uma Bonda
-
కోర్టు తీర్పుతో సభకు సంబంధం లేదు
శాసన సభవ్యవహారంలో కోర్టు జోక్యం చేసుకోకూడదు : బొండా ఉమ వ్యాఖ్య అసెంబ్లీ అధికారాలపై హైకోర్టు, సుప్రీంకోర్టులు సలహాలివ్వవు: ఎమ్మెల్యే అనిత హైదరాబాద్: కోర్టు ఇచ్చిన ఆర్డర్‌తో శాసనసభకు సంబంధం లేదని ప్రభుత్వ విప్ బొండా ఉమా మహేశ్వరరావు అన్నారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్లో ఆయన మాట్లాడుతూ.. శాసనసభా వ్యవహారాలు, హక్కులు చాలా పరిమితమైనవని చెప్పారు. శాసనసభ వ్యవహరాల్లో న్యాయస్థానం జోక్యం చేసుకోకూడదని స్పష్టంగా ఉందన్నారు. రోజా సస్పెన్షన్‌పై హైకోర్టు ఇచ్చిన తీర్పునకు, వైఎస్సార్సీపీ సభ్యులు మాట్లాడుతున్న దానికి పొంతన లేదన్నారు. రోజా సస్పెన్షన్ స్పీకర్ తీసుకున్న నిర్ణయం కాదని.. ఇది సభ తీసుకున్న నిర్ణయమని చెప్పారు. కోర్డు ఇచ్చిన ఆర్డర్‌ని పరిశీలించి సభ పవిత్రతను కాపాడతామని స్పష్టం చేశారు. శాసనసభ వ్యవస్థ, న్యాయ వ్యవస్థల మధ్య ఎవరి పరిధులు వాళ్లవని మరో ప్రభుత్వ విప్ కూన రవికుమార్ పేర్కొన్నారు. ప్రతిపక్ష సభ్యులు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే వి.అనిత ఆరోపించారు. అసెంబ్లీకి పూర్తి అధికారాలు ఉంటాయని, ఈ విషయంలో హైకోర్టు, సుప్రీంకోర్టులు సలహాలివ్వవని చెప్పారు. సభలో బలం ఉన్న వాళ్లదే రాజ్యమని ఆమె పేర్కొన్నారు. సభలో స్పీకర్, సీఎం, మంత్రులు, సభ్యులు ఎవర్నీ వదిలిపెట్టకుండా ఎమ్మెల్యే రోజా చేసిన అనుచిత వ్యాఖ్యలను వైఎస్సార్సీపీ మరిచిపోయినా ప్రజలు మరిచిపోలేదన్నారు. తన విషయంలో చేసిన వ్యాఖ్యలకు రోజా బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. -
బొండా జోరు.. ‘తమ్ముళ్ల’ బేజారు
సెంట్రల్ ఎమ్మెల్యే దూకుడుతో పార్టీకి ఓ వర్గం దూరం నష్ట నివారణకు తమ్ముళ్ల ఎత్తుగడ సత్యనారాయణపురం కల్యాణ మండపాన్ని బ్రాహ్మణ సంఘానికి ఇప్పిస్తామని కొత్త వివాదం టీడీపీ ‘చీలిక’ రాజకీయం బీజేపీ సహా విపక్షాలపై ఎదురుదాడికి సిద్ధం విజయవాడ : నగరం నడిబొడ్డున ఉన్న భువనేశ్వరీ పీఠం ఆధీనంలోఉన్న కల్యాణమండపం స్వాధీనం చేయించే వ్యవహారంలో శాసనసభ్యుడు బొండా ఉమా నడిపినట్లుగా ప్రచారం జరుగుతున్న రాజకీయ ఎత్తుగడ ఆ పార్టీ నేతల్లో కంగారు పుట్టించింది. ఎమ్మెల్యే చర్యతో నగరంలో ఒక సామాజిక వర్గానికి పార్టీ దూరమయ్యే ప్రమాదం ఉందనే భయంతో తెలుగు తమ్ముళ్లంతా నష్ట నివారణకు రంగంలోకి దిగారు. కల్యాణమండపాన్ని తామే బ్రాహ్మణ సంఘానికి అప్పగించేలా చర్యలు తీసుకుంటామని ప్రకటించి మరో వివాదానికి వారు బీజం వేశారు. పనిలో పనిగా మిత్రపక్షమైన బీజేపీ సహా మిగిలిన విపక్షాలపై ఎదురుదాడికి సిద్ధమయ్యారు. కల్యాణ మండపాన్ని దేవాదాయశాఖ ఆధీనంలోకి తెచ్చేలాచేసి దానిని తన పార్టీ కార్యాల యంగా మార్చుకోవడానికి ఎమ్మెల్యే రాజ కీయం నడిపారనే ఆరోపణతో బ్రాహ్మణ సంఘాలు రోడ్డెక్కిన సంగతి తెలిసిందే. ఈ ఆందోళనకు మిత్రపక్షం బీజేపీతోపాటు విపక్షాలన్నీ గొంతు కలపడంతో తెలుగుతమ్ముళ్లు కంగుతిన్నారు. ఈ వ్యవహారం సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి వెళ్లినట్లు సమాచారం. యన ఆదేశం మేరకు పార్టీ నగర నేతలంతా నష్ట నివారణకు రాజకీయ వ్యూహం సిద్ధం చేశారు. బీజేపీపై దాడికి దిగుతూనే ఆ పార్టీకి చెందిన దేవాదాయ శాఖమంత్రి మాణిక్యాలరావుతో కల్యాణమండపం సీలు తొలగించాలని సవాలు చేస్తున్నారు. చీలిక రాజకీయం కల్యాణ మండపం స్వాధీనంపై నగరంలోని బ్రాహ్మణ సంఘాలన్నీ తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి. దీంతో అధికార పార్టీ నేతలు మరో వివాదానికి బీజం వేసి తమ పంతం నెగ్గించుకునే రాజకీయ మంత్రాగానికి తెర లేపారు. కల్యాణ మండపాన్ని బ్రాహ్మణసంఘానికి అప్పగించేలా చేసి పరోక్షంగా దాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకునే వ్యూహానికి సిద్ధమయ్యారు. ఈ ప్రతిపాదనతో బ్రాహ్మణ సంఘాల్లో చీలికతెచ్చి తమకు అనుకూలమైన సంఘానికి కట్టబెట్టి పరోక్షంగా దక్కించుకోవాని రాజకీయం నడుపుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా టీడీపీ అర్బన్ అధ్యక్షుడు బుద్దా వెంకన్న, అనుబంధ సంఘాల అధ్యక్షుడు పట్టాభి, సూపర్ బజార్ చైర్మన్ రఘురామరాజు విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి బ్రాహ్మణులకు టీడీపీ వ్యతిరేకంకాదంటూ చెప్పారు. కల్యాణమండపాన్ని వారికి ఇప్పిస్తామన్నారు. మండపానికి వేసిన సీలు తొలగిస్తామని మాత్రం హామీ ఇవ్వకపోవడం గమనార్హం.