నవ వధువు ఆత్మహత్య
కూడేరు : పుట్టింటికి పంపలేదన్న చిన్న కారణంతో నవ వధువు ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన శనివారం ఉదయం కూడేరులో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు అందించిన వివరాల మేరకు కూడేరుకు చెందిన చట్వోజీరావు రెండవ కుమారుడు రాఘవేంద్రకు కణేకల్ మండలం యర్రగుంటకు చెందిన కటిక జయరామ్ కుమార్తె ఉమాదేవి బాయి (20)తో 2016 ఆగస్టు 4న వివాహం జరిగింది. శుక్రవారం ఉమాదేవి తండ్రి కూతురును చూసేందుకు వచ్చాడు. ఈ సందర్భంగా ఉమాదేవి పుట్టింటికి వస్తానని తండ్రిని కోరింది. తండ్రి, అత్తమామలు ఈ రోజు అమావాస్య వద్దు అని చెప్పుకొచ్చారు. తండ్రి వెళ్ళిపోయాడు. ఉమాదేవికి తలనొప్పి ఉండేది.
పుట్టింటికి పంపలేదని మనస్థాపానికి గురై ఉదయాన్నే ఇంటి ముందు ఉన్న బాత్రూమ్లోకి వెళ్ళి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పు అంటించుకుంది. మంటలకు తాళలేక కేకలు వేసుకుంటూ బయటకు వచ్చేసింది. కుటుంబ సభ్యులు దగ్గరకు వెళ్లి మంటలు ఆర్పిన కొద్దిసేపటికే మృతి చెందింది. విషయం తెలుసుకున్న ఉమాదేవి తల్లిదండ్రులు, బంధువులు సంఘటన స్థలానికి వచ్చి బోరున విలపించారు. పెళ్ళైన మూడు నెలలకే తనువు చాలించావా అంటూ రోదించారు. తలనొప్పిని భరించలేక, ఊరికి పంపలేదన్న చిన్న కారణంతోనే తమ కూతురు ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ రాజు కేసు నమోదు చేసుకొని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనంతపురం సర్వజన ఆస్పత్రికి తరలించారు.