మోదీకి లేఖ రాసిన గిరిజన బాలుడు
మల్కన్‌గిరి (ఒడిశా): గిరిజన జనాభా ఎక్కువగా ఉండే ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లాకు చెందిన ఉమేష్ మాది అనే పదేళ్ల బాలుడు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశాడు. తమ ప్రాంతంలో మెదడువాపు వ్యాధి విజృంభించి పిల్లలు చనిపోతున్నారనీ, సహాయం చేయాలని మోదీని అర్థించాడు. మల్కన్‌గిరి జిల్లాలో ఇప్పటికి 505 గ్రామాల్లో 73 మంది పిల్లలు మెదడువాపు వ్యాధి సోకి చనిపోయారు.
అధికారులు మాత్రం ఆ సంఖ్య 27 మాత్రమేననీ, మిగతా పిల్లలు వివిధ ఇతర కారణాలతో చనిపోయారని బుకాయిస్తున్నారు. ‘మీరు ప్రపంచం అంతా తిరుగుతున్నారు. ఇక్కడ పిల్లలు ఎలా చస్తున్నారో చూడటానికైనా మా ఊరికి రాలేరా? మీరే మా చివరి ఆశ’ అని మోదీని ఉద్దేశించి ఉమేష్ లేఖలో పేర్కొన్నాడు.