UN Climate Conference
-
పర్యావరణ ప్యాకేజీ... 300 బిలియన్ డాలర్లు
బకూ (అజర్బైజాన్): వాతావరణ మార్పుల తాలూకు దుష్ప్రభావాలను ఎదుర్కొనేందుకు వీలుగా వర్ధమాన దేశాలకు 300 బిలియన్ డాలర్లు అందించేందుకు ధనిక దేశాలు అంగీకరించాయి. అజర్‌బైజాన్‌లోని బకూ వేదికగా జరుగుతున్న కాప్–29 సదస్సులో ఆదివారం ఈ మేరకు పర్యావరణ ప్యాకేజీపై ఒప్పందం కుదిరింది. వర్ధమాన దేశాలకు 100 బిలియన్ డాలర్లు ఇచ్చేలా 2009లో కాప్ సదస్సులో అంగీకారం కుదరడం తెలిసిందే. దాని స్థానంలో 2035 నాటికి ఆ దేశాలకు 300 బిలియన్ డాలర్లు అందించేలా ప్యాకేజీని సవరించారు. కానీ పర్యావరణ లక్ష్యాల సాధనకు ఈ మొత్తం ఏ మూలకూ చాలదని భారత్ మండిపడింది. పలు వర్ధమాన దేశాలు కూడా అందుకు గొంతు కలిపాయి. పర్యావరణ పరిరక్షణ చర్చల విషయంలో కాప్–29 ప్రెసిడెన్సీ వ్యవహార శైలి సరిగా లేదని ఆగ్రహం వ్యక్తం చేశాయి. పారిస్ ఒప్పంద లక్ష్యాలకు విఘాతం కలిగిస్తూ ధనిక దేశాలు తమ బలాన్ని ఉపయోగించి తమపై బలవంతంగా ఈ ఒప్పందాన్ని రుద్దుతున్నాయమని మండిపడ్డాయి. ఈ ప్యాకేజీని ‘చాలా తక్కువ, చాలా ఆలస్యం’గా ఆఫ్రికన్ గ్రూప్ ప్రతినిధులు అభివర్ణించారు. గత శుక్రవారం దాకా జరగాల్సిన 12 రోజుల కాప్ సదస్సు రెండో రోజులు అదనంగా కొనసాగి దేశాల అభ్యంతరాలు, వాకౌట్ల నడుమ ఆదివారం ముగిసింది.అంగీకరించబోం: భారత్ వాతావరణ మార్పుల వల్ల అభివృద్ధి చెందుతున్న దేశాలే బాగా ప్రభావితమవుతున్నాయని భారత్ గుర్తు చేసింది. ‘‘వాటికి కేవలం 300 బిలియన్ డాలర్ల ప్యాకేజీ చాలా తక్కువ. ఇందుకు అంగీకరించబోం’’ అని స్పష్టం చేసింది. తమ అభ్యంతరాలను తీసుకోకుండా కాప్–29 అధ్యక్షునితో పాటు ఐరాస ఈ ఒప్పందాన్ని దేశాలపై రుద్దాయని ఆరోపించింది. దీన్ని తీవ్ర అన్యాయంగా సదస్సులో పాల్గొన్న భారత్ ఆర్థిక వ్యవహారాల శాఖ సలహాదారు చాందినీ రైనా అభివరి్ణంచారు. ప్యాకేజీని ఆమోదించే ముందు కనీసం తమతో మాట్లాడాలని సూచించినా పట్టించుకోలేదన్నారు. ‘‘అన్నిదేశాల అభ్యంతరాలనూ వినాలి. ఇలా దేశాలను మాట్లాడనీయకుండా చేయడం ఐరాస వాతావరణ మార్పుల ఒప్పందానికి విరుద్ధం. దీన్ని భారత్ పూర్తిగా వ్యతిరేకిస్తోంది’’ అని తెలిపారు.పెద్ద జోక్: నైజీరియా భారత్‌కు నైజీరియా మద్దతు తెలిపింది. 300 బిలియన్ డాలర్లు ప్యాకేజీ పెద్ద జోక్ అని వ్యాఖ్యానించింది. మలావీ, బొలీవియా సైతం భారత్‌తో గొంతు కలిపాయి. ఇది నిరాశాజనక పరిణామమని ‘తక్కువ అభివృద్ధి చెందిన దేశాల’ (ఎల్డీసీ) గ్రూప్ చైర్మన్ ఎవాన్స్ ఎన్జేవా అన్నారు. ఒప్పందం ఏకపక్షంగా జరిగిందని ఆఫ్రికన్ గ్రూప్ ఆఫ్ నెగోషియేటర్స్ (ఏజీఎన్) చైర్మన్ విమర్శించారు. ఇది హాస్యాస్పదమని నైజీరియాకు చెందిన సంధానకర్త ఎన్కిరుకా మదుక్వే అన్నారు. దీనిపై పునరాలోచించుకోవాలి తీసుకోవాలా వద్దా అని నిర్ణయించుకునే హక్కు వర్ధమాన దేశాలకు ఉందని ఆమె అన్నారు. ఎల్డీసీ గ్రూప్, అలయన్స్ ఆఫ్ స్మాల్ ఐలాండ్ స్టేట్స్ (ఏఓఎస్ఐఎస్) ప్రతినిధులు వాకౌట్ చేయడంతో గందరగోళం నెలకొంది. ఐరాస వాతావరణ చర్చలు దాదాపు విఫలమయ్యాయని ఐరాస మానవ హక్కుల మాజీ హైకమిషనర్ మేరీ రాబిన్సన్ అన్నారు.1.3 లక్షల కోట్ల డాలర్లు కావాలి గ్లోబల్ వార్మింగ్‌కు ప్రధాన కారణమైన గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాల కట్టడికి సాయపడేందుకు అల్పాదాయ ఆర్థిక వ్యవస్థలకు సంపన్న దేశాలు ఆర్థిక, సాంకేతిక పరిజ్ఞానం, మద్దతు అందిస్తున్నాయి. ఇందుకోసం 2020 నాటికి 100 బిలియన్ డాలర్లు అందిస్తామని 2009లో హామీ ఇచ్చినా దాన్ని నెరవేర్చిన దాఖలాలు లేవు. ఇప్పుడు ప్రకటించిన 300 బిలియన్ డాలర్లు ఏ మూలకూ చాలవని, కనీసం 1.3 లక్షల కోట్ల డాలర్లు కావాలని వర్ధమాన దేశాలు కోరుతున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
పచ్చటి కళ.. నేచర్ డ్యాన్స్
‘ఏ గూటి చిలక ఆ గూటి పలుకే పలుకుతుంది’ అనే మాటలో గ్యారెంటీ ఉందో లేదో తెలియదుగానీ చాలా చిన్నవయసులోనే సంగీత, నాట్యాలపై అభిమానాన్ని పెంచుకుంది సోహిని రాయ్ చౌదురి. నాన్న మంచి సంగీతకారుడు. ఇక నానమ్మ బొకుల్సేన్ గుప్త సంగీతంలో దిట్ట. కోల్‌కతాలోని ప్రసిద్ధ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ స్థాపకురాలు. రాగాల గొప్పదనం ఏమిటంటే... నేర్చుకుంటూ పోతే కొత్త లోకాలు ఆవిష్కరించబడతాయి. నృత్యాల గొప్పదనం ఏమిటంటే... చేస్తూ పోతే కొత్త ప్రపంచాలు చేరువవుతాయి. సంగీత సాహిత్య నృత్య ప్రపంచాల సంగతి సరే... భౌతిక ప్రపంచం సంగతేమిటి? పొగలు,సెగలు, కర్బన ఉద్గారాలు... భూమికి గాయాలు చేస్తున్నాయి. ‘ఈరోజు గడిస్తే చాలు’ అనుకునేవాళ్లు తప్ప రేపటి గురించి ఆలోచించేవాళ్లు అరుదైపోయారు. ఈ నేపథ్యంలోనే కళాకారుల బాధ్యత పెరుగుతుంది. నిజమైన కళాకారులు చేసే పని సృజనాత్మక ప్రపంచాన్ని, భౌతిక ప్రపంచంతో సమన్వయం చేయడం. ప్రస్తుతం అదే పని చేస్తుంది సోహిని. పర్యావరణ సంబంధిత అంశాలను నృత్యరూపకాలుగా మలిచి మన దేశంలోనే కాదు 14 దేశాల్లో ప్రదర్శనలు ఇచ్చింది. తాజాగా కాప్ 26, గ్లాస్గోలో ‘నేచర్ అండ్ అజ్’ పేరుతో ఇచ్చిన నృత్యప్రదర్శన దేశదేశాల ప్రతినిధులను ఆకట్టుకుంది. సాంకేతిక విషయాలతోనే కాదు దేశీయ సాంస్కృతిక మూలాలతో కూడా పర్యావరణ స్పృహ కలిగించవచ్చని నిరూపించింది సోహిని. ఈ నృత్యప్రదర్శనలో ఆమె కుమారుడు రిషిదాస్ గుప్త గిటార్ ప్లే చేయడం విశేషం. ‘కాప్26 కేంద్రసిద్ధాంతాన్ని నృత్యం, సంగీతం, కథనం, వేదపాఠాల ద్వారా ఆవిష్కరించే ప్రయత్నం చేశాను’ అంటుంది సోహినిరాయ్. ఆమె ప్రయత్నం విజయవంతమైందని చెప్పడానికి ‘నేచర్ అండ్ అజ్’కు ‘కాప్26’లో ప్రపంచ ప్రతినిధుల నుంచి లభించిన ప్రశంసలే గొప్ప నిదర్శనం. -
అసంపూర్ణ చర్యలు ఫలించవు
పారిస్ సదస్సు ప్రపంచాన్ని శాంతి, సుస్థిరత దారిలో నిలపాలి: బాన్ లె బూర్జ్: ‘‘వాతావరణ మహావిపత్తు ముంచుకొస్తోంది.. గడియలు దగ్గరపడుతున్నాయి.. దానిపై పోరాడటం కోసం అసంపూర్ణ చర్యలేవీ ఫలించవు’’ అని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ బాన్ కి-మూన్ స్పష్టంచేశారు. ఫ్రాన్స్ రాజధాని పారిస్ శివార్లలోని లె బూర్జ్ పట్టణంలో జరుగుతున్న ఐరాస వాతావరణ సదస్సులో 195 దేశాల పర్యావరణ మంత్రులు, విధానకర్తలను ఉద్దేశించి బాన్ సోమవారం ప్రసంగించారు. ‘‘అసంపూర్ణ చర్యలు, కొంచెం కొంచెం చూద్దామన్న విధానాలకన్నా మరింత ఎక్కువ చర్యలను ప్రపంచం మీ నుంచి ఆశిస్తోంది. సమూలంగా మార్చివేయగల ఒప్పందం అడుగుతోంది. పారిస్ సదస్సు.. ప్రపంచాన్ని దీర్ఘకాలిక శాంతి, సుస్థిరత, సుసంపన్నతల మార్గంలో నిలపాలి.’’ అని ఆయన పిలుపునిచ్చారు. 8 పర్యావరణ పరిశీలన కేంద్రాలను స్థాపిస్తాం: జవదేకర్ ఇదిలావుంటే.. ఈ సదస్సులో వాతావరణ ఒప్పందం కోసం ప్రపంచ దేశాల చర్చల ప్రతినిధులు తయారు చేసిన 48 పేజీల ముసాయిదాపై సోమవారం నుంచి అన్ని దేశాల మంత్రులూ జరుపుతున్న చర్చల్లో భారత పర్యావరణ మంత్రి ప్రకాశ్‌జవదేకర్ కూడా పాల్గొంటున్నారు. వాతావరణ మార్పు దీర్ఘకాలికంగా చూపబోయే ప్రభావాలను అధ్యయనం చేయటానికి.. భారతదేశంలో హిమాలయాలు, పశ్చిమకనుమలు సహా ఎనిమిది విభిన్న ప్రాంతాల్లో పర్యావరణ పరిశీలన కేంద్రాలను ఏర్పాటు చేస్తామని ఆయన ప్రకటించారు. దీర్ఘకాలిక పర్యావరణ పరిశీలన కేంద్రాల కార్యక్రమాన్ని జవదేకర్ సోమవారం పారిస్ సదస్సులో ప్రారంభిస్తూ.. ‘‘ప్రపంచ జనాభాలో 17 శాతం, పశు జనాభాలో 17 శాతం మా దేశంలో ఉంది. కానీ.. ప్రపంచ భూవిస్తీర్ణంలో మాకున్నది కేవలం 2.5 శాతమే. అయినప్పటికీ.. ఇండియాలో 8 శాతం జీవవైవిధ్యం ఉంది. హిమాలయాలు, పశ్చిమ కనుమలు, మధ్య భారత్ నుంచి సుందరవనాలు, జమ్మూకశ్మీర్ నుంచి రాజస్థాన్, గుజరాత్ల వరకూ పరిశీలన కేంద్రాలను ఏర్పాటు చేస్తాం. మాకు పది సముద్ర తీర రాష్ట్రాలు ఉన్నాయి. పది హిమాలయ రాష్ట్రాలున్నాయి. పది అటవీ ప్రధాన రాష్ట్రాలున్నాయి. 1,300 దీవులున్నాయి’’ అని వివరించారు.