అసంపూర్ణ చర్యలు ఫలించవు
పారిస్ సదస్సు ప్రపంచాన్ని శాంతి, సుస్థిరత దారిలో నిలపాలి: బాన్
లె బూర్జ్: ‘‘వాతావరణ మహావిపత్తు ముంచుకొస్తోంది.. గడియలు దగ్గరపడుతున్నాయి.. దానిపై పోరాడటం కోసం అసంపూర్ణ చర్యలేవీ ఫలించవు’’ అని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ బాన్ కి-మూన్ స్పష్టంచేశారు. ఫ్రాన్స్ రాజధాని పారిస్ శివార్లలోని లె బూర్జ్ పట్టణంలో జరుగుతున్న ఐరాస వాతావరణ సదస్సులో 195 దేశాల పర్యావరణ మంత్రులు, విధానకర్తలను ఉద్దేశించి బాన్ సోమవారం ప్రసంగించారు. ‘‘అసంపూర్ణ చర్యలు, కొంచెం కొంచెం చూద్దామన్న విధానాలకన్నా మరింత ఎక్కువ చర్యలను ప్రపంచం మీ నుంచి ఆశిస్తోంది. సమూలంగా మార్చివేయగల ఒప్పందం అడుగుతోంది. పారిస్ సదస్సు.. ప్రపంచాన్ని దీర్ఘకాలిక శాంతి, సుస్థిరత, సుసంపన్నతల మార్గంలో నిలపాలి.’’ అని ఆయన పిలుపునిచ్చారు.
8 పర్యావరణ పరిశీలన కేంద్రాలను స్థాపిస్తాం: జవదేకర్
ఇదిలావుంటే.. ఈ సదస్సులో వాతావరణ ఒప్పందం కోసం ప్రపంచ దేశాల చర్చల ప్రతినిధులు తయారు చేసిన 48 పేజీల ముసాయిదాపై సోమవారం నుంచి అన్ని దేశాల మంత్రులూ జరుపుతున్న చర్చల్లో భారత పర్యావరణ మంత్రి ప్రకాశ్‌జవదేకర్ కూడా పాల్గొంటున్నారు. వాతావరణ మార్పు దీర్ఘకాలికంగా చూపబోయే ప్రభావాలను అధ్యయనం చేయటానికి.. భారతదేశంలో హిమాలయాలు, పశ్చిమకనుమలు సహా ఎనిమిది విభిన్న ప్రాంతాల్లో పర్యావరణ పరిశీలన కేంద్రాలను ఏర్పాటు చేస్తామని ఆయన ప్రకటించారు.
దీర్ఘకాలిక పర్యావరణ పరిశీలన కేంద్రాల కార్యక్రమాన్ని జవదేకర్ సోమవారం పారిస్ సదస్సులో ప్రారంభిస్తూ.. ‘‘ప్రపంచ జనాభాలో 17 శాతం, పశు జనాభాలో 17 శాతం మా దేశంలో ఉంది. కానీ.. ప్రపంచ భూవిస్తీర్ణంలో మాకున్నది కేవలం 2.5 శాతమే. అయినప్పటికీ.. ఇండియాలో 8 శాతం జీవవైవిధ్యం ఉంది. హిమాలయాలు, పశ్చిమ కనుమలు, మధ్య భారత్ నుంచి సుందరవనాలు, జమ్మూకశ్మీర్ నుంచి రాజస్థాన్, గుజరాత్‌ల వరకూ పరిశీలన కేంద్రాలను ఏర్పాటు చేస్తాం. మాకు పది సముద్ర తీర రాష్ట్రాలు ఉన్నాయి. పది హిమాలయ రాష్ట్రాలున్నాయి. పది అటవీ ప్రధాన రాష్ట్రాలున్నాయి. 1,300 దీవులున్నాయి’’ అని వివరించారు.