![Mother-son duo performs at UN climate summit - Sakshi](/styles/webp/s3/article_images/2021/11/26/kala.jpg.webp?itok=0-wFC55S)
‘ఏ గూటి చిలక ఆ గూటి పలుకే పలుకుతుంది’ అనే మాటలో గ్యారెంటీ ఉందో లేదో తెలియదుగానీ చాలా చిన్నవయసులోనే సంగీత, నాట్యాలపై అభిమానాన్ని పెంచుకుంది సోహిని రాయ్ చౌదురి. నాన్న మంచి సంగీతకారుడు. ఇక నానమ్మ బొకుల్‌సేన్ గుప్త సంగీతంలో దిట్ట. కోల్‌కతాలోని ప్రసిద్ధ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ స్థాపకురాలు.
రాగాల గొప్పదనం ఏమిటంటే... నేర్చుకుంటూ పోతే కొత్త లోకాలు ఆవిష్కరించబడతాయి.
నృత్యాల గొప్పదనం ఏమిటంటే... చేస్తూ పోతే కొత్త ప్రపంచాలు చేరువవుతాయి.
సంగీత సాహిత్య నృత్య ప్రపంచాల సంగతి సరే... భౌతిక ప్రపంచం సంగతేమిటి?
పొగలు,సెగలు, కర్బన ఉద్గారాలు... భూమికి గాయాలు చేస్తున్నాయి. ‘ఈరోజు గడిస్తే చాలు’ అనుకునేవాళ్లు తప్ప రేపటి గురించి ఆలోచించేవాళ్లు అరుదైపోయారు. ఈ నేపథ్యంలోనే కళాకారుల బాధ్యత పెరుగుతుంది. నిజమైన కళాకారులు చేసే పని సృజనాత్మక ప్రపంచాన్ని, భౌతిక ప్రపంచంతో సమన్వయం చేయడం. ప్రస్తుతం అదే పని చేస్తుంది సోహిని.
పర్యావరణ సంబంధిత అంశాలను నృత్యరూపకాలుగా మలిచి మన దేశంలోనే కాదు 14 దేశాల్లో ప్రదర్శనలు ఇచ్చింది. తాజాగా కాప్ 26, గ్లాస్గోలో ‘నేచర్ అండ్ అజ్’ పేరుతో ఇచ్చిన నృత్యప్రదర్శన దేశదేశాల ప్రతినిధులను ఆకట్టుకుంది. సాంకేతిక విషయాలతోనే కాదు దేశీయ సాంస్కృతిక మూలాలతో కూడా పర్యావరణ స్పృహ కలిగించవచ్చని నిరూపించింది సోహిని. ఈ నృత్యప్రదర్శనలో ఆమె కుమారుడు రిషిదాస్ గుప్త గిటార్ ప్లే చేయడం విశేషం.
‘కాప్26 కేంద్రసిద్ధాంతాన్ని నృత్యం, సంగీతం, కథనం, వేదపాఠాల ద్వారా ఆవిష్కరించే ప్రయత్నం చేశాను’ అంటుంది సోహినిరాయ్.
ఆమె ప్రయత్నం విజయవంతమైందని చెప్పడానికి ‘నేచర్ అండ్ అజ్’కు ‘కాప్26’లో ప్రపంచ ప్రతినిధుల నుంచి లభించిన ప్రశంసలే గొప్ప నిదర్శనం.
Comments
Please login to add a commentAdd a comment