కొత్త సెక్రటరీ జనరల్ కోసం ఐరాస రహస్య ఓటింగ్
ఐక్యరాజ్యసమితి: ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ పదవి కోసం 12 మంది అభ్యర్థులు పోటీపడుతున్న నేపథ్యంలో.. సమితి భద్రతా మండలి బుధవారం తొలి రహస్య ఓటింగ్ నిర్వహించింది. ఈ పోలింగ్లో పోర్చుగల్ మాజీ ప్రధానమంత్రి ఆంటోనియో గుటెరెస్ ఆధిక్యంలో ఉండగా.. స్లొవేనియా మాజీ అధ్యక్షుడు డానిలో టర్క్ రెండో స్థానంలో నిలిచారని సమితి దౌత్యవేత్తలు తెలిపారు. భద్రతామండలి సభ్యులు 15 మంది రహస్యంగా నిర్వహించిన పోలింగ్లో ‘ప్రోత్సహించటం, తిరస్కరించటం, మౌనం’ అనే మూడు అంశాల వారీగా అభ్యర్థులకు ఓట్లు వేయగా..
ఆంటోనియోకు 12, డానిలోకు 11 ప్రోత్సాహం ఓట్లు వచ్చాయని దౌత్యవేత్తలు వివరించారు. ఒక అభ్యర్థిని తిరస్కరిస్తూ 11 ఓట్లు వచ్చినట్లు చెప్పారు. మండలి సభ్యులు మళ్లీ వచ్చే వారం సమావేశమై మరో విడత పోలింగ్ నిర్వహించే అవకాశముంది. ప్రస్తుత సెక్రటరీ జనరల్ బాన్ కి మూన్ పదవీ కాలం ఈ ఏడాది చివరితో ముగియనుంది.