టీడీపీ అధ్యక్షుడి కొడుక్కి..అప్పనంగా సర్కారు భూమి!
కళా కుమారుడి కంపెనీకి అడ్డగోలు కేటాయింపు
నామమాత్ర ధరకే భూమి అప్పగింత
వేగంగా కదిలిన సిఫారసుల ఫైల్
నేడో, రేపో ప్రభుత్వ ఉత్తర్వులు!
ఇప్పటికే కార్యాలయం పేరుతో శ్రీకాకుళం నగరంలో కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని దక్కించుకున్న టీడీపీ ప్రభుత్వం... అదే చేత్తో పార్టీ నాయకులకూ భూసంతర్పణ చేస్తోంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకటరావు కుమారుడి కంపెనీ ఏర్పాటు కోసం అప్పనంగా ఏడున్నర ఎకరాల ప్రభుత్వ భూమి అప్పగించేందుకు ఇప్పటికే సిద్ధమైపోయింది. యథారాజా తథాప్రజా అన్నట్లుగా జిల్లా రెవెన్యూ యంత్రాంగం కూడా వ్యవహరిస్తోంది. ఆ భూమి అనుమతులకు సంబంధించి సిఫారసుల ప్రక్రియను ఆగమేఘాలపై పూర్తి చేసింది. రారాష్ట్ర ప్రభుత్వ ఆమోదముద్ర ఇక లాంఛనప్రాయమే. నేడో రేపో ఉత్తర్వులు వెలువడవచ్చని తెలిసింది.
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:
అధికార పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎచ్చెర్ల ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు కుమారుడు రాంమల్లిక్ పారిశ్రామికవేత్తగా మారారు. తన సప్తగిరి కెమికల్ సాల్వెంట్ పవర్ ప్రాజెక్ట్‌కు భూమి కావాల్సి వచ్చింది. ప్రస్తుతం పారిశ్రామిక ప్రాంతంలో, జాతీయ రహదారికి సమీపంలో భూమి కావాలంటే కనీసం ఎకరానికి రూ.40 లక్షల వరకూ చెల్లించాల్సిందే. అదే ప్రభుత్వ భూమి అయితే కారుచౌకగా కేటాయింపులు చేసేసుకోవచ్చనేది అధికార పార్టీ నేతల ఎత్తుగడ. అదే ఎవ్వరైనా బయటి ఔత్సాహిక పారిశ్రామికవేత్తకు భూమి కావాలంటే సవాలక్ష కొర్రీలు వేసే అధికారులు... అధికార పార్టీ నాయకుల బంధుగణానికి మాత్రం ఆగమేఘాలపై ప్రభుత్వ ఆమోదం కోసం సిఫారసు చేసేశారు. అలా కళా కుమారుడి కంపెనీకి భూకేటాయింపుల ఫైల్ చకాచకా రెవెన్యూ విభాగంలోని సంబంధిత చాంబర్లన్నీ రికార్డు టైమ్‌లో చుట్టివచ్చేసింది.
రూ.3 కోట్లకు పైమాటే..
కళా ప్రాతినిథ్యం వహిస్తోన్న ఎచ్చెర్ల నియోజకవర్గంలోనే పైడిభీమవరం పారిశ్రామికవాడకు సమీపంలో రణస్థలం మండలం నారువ, చిల్లపేట రాజాం గ్రామాల పరిధిలో 7.50 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆయన కుమారుడి కంపెనీకి ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీన్ని ఎకరా రూ. 4.30 లక్షలు చొప్పున నామమాత్ర ధరతో కేటాయింపునకు సర్వం సిద్ధం చేసింది. వాస్తవానికి ఈ ప్రాంతంలో ఎకరా రూ.40 లక్షల పైమాటే. ఈ లెక్కన ఆ భూమి విలువ రూ.3 కోట్లు. కానీ దానికి ప్రభుత్వం నిర్ణయించిన ధర కేవలం రూ.32 లక్షలే. జిల్లాలో మరే ఔత్సాహిక పారిశ్రామికవేత్తకూ ఇంత కారుచౌకగా భూములు కేటాయించిన దాఖలాలు లేవు.
మరో కాలుష్య కుంపటి...
పైడిభీమవరం పారిశ్రామికవాడ కాలుష్యంతో ఇప్పటికే రణస్థలం పరిసర మండలాల ప్రజలు నానారకాల సమస్యలతో సతమతమవుతున్నారు. ఈ దృష్ట్యా కాలుష్యరహిత పరిశ్రమలకు అనుమతులు ఇవ్వాలని వారు ఎప్పటినుంచో మొరపెట్టుకుంటున్నారు. కానీ కళా కుమారుడు ఏర్పాటు చేయనున్న కంపెనీలో కాలుష్య కారక రసాయనాలు వినియోగించే అవకాశం ఉందని ఆ పరిశ్రమ దరఖాస్తు వివరాలను బట్టి తెలుస్తోంది. కానీ మరో కాలుష్య కుంపటిని తమ గుండెలపై పెడుతోన్న కంపెనీకి ప్రభుత్వం భూమి కేటాయించడంపై స్థానికుల నుంచి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.