డిఎన్ఎతో నిర్దోషికి విముక్తి
చేయని నేరం
కటకటాల వెనుక మూడు దశాబ్దాల కాలం అన్యాయంగా మగ్గిపోయాడు కార్నెలియస్ డుప్రీ. జరిగిన నేరానికీ, అతడికీ ఏ సంబంధమూ లేదు. పోలీసులు ప్రవేశపెట్టిన సాక్ష్యాలను మాత్రమే నమ్మిన కోర్టు అతడికి ఏకంగా 75 ఏళ్ల సుదీర్ఘ కారాగార శిక్ష విధించింది. ఏ పాపం ఎరుగనంటూ అతడు ఎంతగా మొరపెట్టుకున్నా, అదంతా అరణ్యరోదనగానే మిగిలింది. ఎట్టకేలకు డీఎన్ఏ పరీక్షల పుణ్యమా అని నిర్దోషిగా తేలాడు. ఎట్టకేలకు ముదిమి మీద పడ్డ స్థితిలో జైలు గోడలు దాటి బాహ్య ప్రపంచంలోకి అడుగుపెట్టి స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్నాడు.
ఇదీ సంఘటన...
అమెరికాలో టెక్సాస్ రాష్ట్రంలోని డాలాస్ నగరంలో 1979 నవంబర్ 23న సాయంత్రం వేళ ఒక అమ్మాయి తన బాయ్‌ఫ్రెండ్‌తో కలసి మద్యం దుకాణానికి వచ్చింది. వారిద్దరూ కారు పార్క్ చేసి, మద్యం కొనుక్కున్నారు. తిరిగి కారు వద్దకు చేరుకునే సమయంలో ఇద్దరు దుండగులు ఆయుధాలు చూపి దాడి చేశారు. ఆ అమ్మాయి బాయ్‌ఫ్రెండ్‌ను చితక్కొట్టి వదిలేశారు. అమ్మాయిని దగ్గర్లోనే ఉన్న ఒక పార్కులోకి లాక్కు పోయి అత్యాచారానికి ఒడిగట్టారు. ఆమె కోటును తీసుకుని పరారయ్యారు.
బాధితురాలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. రెండు రోజుల తర్వాత దుండగులు ఆ కోటును దగ్గర్లోనే ఉన్న ఒక దుకాణంలో అమ్మేశారు. పోలీసులకు ఈ సమాచారం తెలియడంతో నిందితుల కోసం వేట మొదలుపెట్టారు. నెల్లాళ్ల తర్వాత కార్నెలియస్ డుప్రీని, ఆంథోనీ మాసింగిల్ అనే మరో వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితురాలు చెప్పిన పోలికలతో మాసింగిల్ సరిపోయినా, డుప్రీకి ఆ పోలికలేవీ లేవు. అయినా, పోలీసులు అతడిని కూడా లోపలేసేసి ఓ పనైపోయిందనుకున్నారు.
ఐడెంటిఫికేషన్ పరేడ్‌లో బాధితురాలు డుప్రీని, మాసింగిల్ను చూపింది. పోలీసులు ఇదే అంశాన్ని వారు కోర్టులో ప్రవేశపెట్టారు. బాధితురాలి బాయ్‌ఫ్రెండ్ దుండగుల దాడిలో గాయపడినా, పోలీసులు అతడి వాంగ్మూలాన్ని మాత్రం నమోదు చేసుకోలేదు. ఏడాదికి పైగా వాదోపవాదాలు నడిచాయి. దోపిడీకి, అత్యాచారానికి పాల్పడినట్లు డుప్రీ, మాసింగిల్లపై పోలీసులు అభియోగం మోపారు. పోలీసులు ప్రవేశపెట్టిన సాక్ష్యాధారాలను పరిగణనలోకి తీసుకున్న కోర్టు, దోపిడీ కేసులో డుప్రీని, మాసింగిల్ను దోషులుగా తేల్చి, 75 ఏళ్ల శిక్ష విధించింది. మాసింగిల్ను మరో అత్యాచారం కేసులోనూ కోర్టు దోషిగా తేల్చింది. తాము అమాయకులమంటూ ఇద్దరూ న్యాయ పోరాటం ప్రారంభించారు.
వ్యూహాత్మకమైన ఎర!
నేరగాళ్లకు అందించే మానసిక చికిత్స కార్యక్రమానికి హాజరైతే శిక్ష తగ్గిస్తామంటూ 2004లో పోలీసులు ఎర చూపారు. దానికి హాజరైతే తాను నేరం చేసినట్లుగా అంగీకరించినట్లే అవుతుందని భావించిన డుప్రీ అందుకు నిరాకరించాడు. జైల్లో ఉంటూనే ప్రజా సంఘాలకు విజ్ఞప్తులు పంపుతూ పట్టు వదలకుండా చట్టంతో పోరాటం కొనసాగించాడు. అతడు జైలులో ఉంటున్న కాలంలోనే నేర పరిశోధనలో డీఎన్ఏ పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది.
డీఎన్ఏ పరీక్షల ద్వారా నిజాలను నిగ్గు తేల్చాలంటూ మూడో అప్పీలు దాఖలు చేసుకున్నాడు డుప్రీ. కోర్టు డీఎన్ఏ పరీక్షలకు ఆదేశించింది. 1979 నవంబర్ 23 నాటి సంఘటనలో బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడింది డుప్రీ, మాసింగిల్ కాదని తేలింది. ఫలితంగా డుప్రీ 2010లో జైలు గోడల నుంచి విముక్తుడయ్యాడు. జైలులో గడిపిన ప్రతి ఏడాదికి 80 వేల డాలర్ల చొప్పున దాదాపు 24 లక్షల డాలర్లు డుప్రీకి పరిహారంగా చెల్లించాలని 2011 జనవరి 4న ఇచ్చిన తుది తీర్పులో కోర్టు ఆదేశించింది.
జైలు నుంచి బయట పడుతూనే డుప్రీ తన చిరకాల ప్రియురాలు సెల్మా పెర్కిన్స్ను పెళ్లాడాడు. మాసింగిల్పై మరో అత్యాచారం కేసు పెండింగులో ఉన్నందున అతడు ఇంకా జైలులోనే ఉన్నాడు. అయితే, 2006లో అతడు పెరోల్ పొంది బాహ్యప్రపంచంలో కొంతకాలం గడిపాడు. రెండో కేసులో డీఎన్ఏ పరీక్షలు తేలితే, దాని నుంచి కూడా తనకు విముక్తి దొరుకుతుందని మాసింగిల్ ఎదురు చూస్తున్నాడు.