నగరం.. నరకం
బురద గుంటలు... రోడ్లపై ప్రవహిస్తున్న మురుగునీరు... దుర్వాసనల మధ్య దుర్భర జీవనం... ఇదేదో మారుమూల గ్రామంలో పరిస్థితి అనుకొనేరు సుమా...! ఇది కరీంనగర్ జిల్లా కేంద్రం సుందర స్వరూపం! అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పుణ్యమా అని గత ఎనిమిదేళ్లుగా కరీంనగర్ ప్రజలు అనుభవిస్తున్న ప్రత్యక్ష నరకానికి సజీవ తార్కాణం!
కరీంనగర్: 2005లో కరీంనగర్ నగరపాలక సంస్థగా ఏర్పడ్డ తర్వాత యూజీడీ మంజూరైంది. రూ.76.50 కోట్ల అంచనా వ్యయంతో పనులు చేపట్టేందుకు ప్రతిపాదనలు చేశారు. మే 23, 2007న పరిపాలనా అనుమతి రాగా, ఆగస్టు 8, 2007న సాంకేతిక అనుమతి లభించింది. దీంతో మార్చి 27, 2008లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ప్రముఖ నిర్మాణ సంస్థ రాంకీ కంపెనీ ఈ కాంట్రాక్ట్‌ను సొంతం చేసుకుంది. 303 కిలోమీటర్ల యూజీడీ నిర్మాణ పనులను సబ్ కాంట్రాక్టర్‌కు అప్పగించింది. ఇక అప్పటి నుంచి ప్రజలకు కష్టాలు మొదలయ్యాయి. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం కారణంగా ఎనిమిదేళ్లుగా నత్తకు నడక నేర్పినట్లు పనులు కొనసా...గుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు జరిగిన పనులు, ప్రస్తుతం కొనసాగుతున్న పనుల తీరును చూస్తే.. మరో రెండు సంవత్సరాలు గడిచినా పూర్తయ్యేలా కనిపించడం లేదు.
ఇష్టారాజ్యంగా పనులు
యూజీడీ నిర్మాణ పనుల్లో మొదటి నుంచీ నాణ్యత కొరవడిందనే ఆరోపణలు ఉన్నాయి. పనుల్లో ఎక్కడా నిబంధనలు పాటించడం లేదు. పైపులైన్ల కింద ఇసుక వేయడం లేదు. చాంబర్ల నిర్మాణంలో నాణ్యత కరువైంది. తూతూమంత్రంగా పనులు నిర్వహిస్తున్నారు. పర్యవేక్షించాల్సిన ప్రజారోగ్యశాఖ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడం ప్రజల కు శాపంగా మారింది. పైప్‌లైన్ కోసం తవ్విన రోడ్ల ను నామమాత్రంగా పూడ్చడంతో పనులు జరిగిన ప్రాంతాలన్నీ గుంతలమయంగా మారాయి. ప్యాచ్‌వర్క్ అయితే పైపై పూతలతో మమ అనిపించారు. దీంతో కొద్దిరోజులకే ఆ పూత లేచిపోయి గుంతలు ఏర్పడుతున్నాయి. మట్టిని రోడ్డుపైనే వదిలివేయడం తో నడక కూడా నరకప్రాయంగా మారింది. ఇక సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ (ఎస్టీపీ) పనులు 80 శాత మే పూర్తయ్యాయి. యూజీడీ పనులు 303 కిలోమీటర్లకు 288 కిలోమీటర్లు పూర్తయ్యాయి. ఇంకా 15 కిలోమీటర్లు పైపులైన్ మిగిలి ఉంది. రూ.126.5కోట్లు ఖర్చుచేసి యూజీడీ పనులు పూర్తిచేసినా అది పనికి వస్తుందో.. మట్టిలో కలిసిపోతుందోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పనుల పూర్తికి మరో రూ.50 కోట్లు
అధ్వాన్నంగా జరుగుతున్న పనులను నిలిపివేయాలని సంవత్సరం క్రితం వరకు స్థానిక ప్రజాప్రతి నిదులు నెత్తినోరు బాదుకున్నారు. ఇప్పటి వరకు చేసిన ఖర్చంతా మట్టిపాలేనని, ఇప్పటికైనా పనులు ఆపాలని ప్రభుత్వానికి విన్నవించారు. మొదట మంజూరు చేసిన రూ.76.50 కోట్లు నిధుల్లో అప్పటికే రూ.60 కోట్ల పైచిలుకు కాంట్రాక్టర్ బిల్లులు పొందా రు. ఇక మిగిలిన పనికి నిధులు సరిపోవని కాంట్రాక్టర్ సైతం చేతులెత్తేశారు. యూజీడీ గండం తప్పిం దని అందరూ అనుకుంటున్న సమయంలో గతేడాది ఆగష్టు 5న సీఎం కేసీఆర్ కరీంనగర్ పర్యటనలో యూజీడీ మళ్లీ తెరపైకి వచ్చింది. రూ.50 కోట్లు మంజూరు చేస్తూ పనులు పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. ఈసారి ఆర్అండ్బీ ప్రధాన రహదారుల్లో 14.5 కిలోమీటర్ల పనులు ప్రారంభించారు. రోడ్లన్నీ ఛిద్రం చేసేశారు. పనులు పూర్తయిన చోట కూడా ప్యాచ్‌వర్క్‌ల పనులు చేపట్టలేకపోయారు. దీంతో తారురోడ్లు కాస్తా బొందలమయంగా తయారయ్యాయి. గుంతలు గుదిబండగా మారి వాహనదారులకు ఇబ్బందులు మొదలయ్యాయి.
హౌసింగ్ బోర్డులో నరకయాతన
నగరంలోని హౌసింగ్‌బోర్డు కాలనీలో జరుగుతున్న పనులతో ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. సబ్‌స్టేషన్ నుంచి 300 మీటర్ల పైపులైన్ కోసం నాలుగు నెలలుగా పనులు చేస్తున్నారు. పనులను క్రమపద్ధతిలో చేయకపోవడంతో చినుకు పడితే చిత్తడిగా మారుతోంది. బురుదతో ఇంట్లో నుంచి బయటకు రాని పరిస్థితి నెలకొంది. కాలినడకే కష్టంగా మారడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. పనులు పూర్తిచేయాలని నెత్తినోరు బాదుకున్నా పట్టించుకున్న నాథుడు కరువయ్యాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సెప్టెంబర్‌లోగా పనులు పూర్తి :
భద్రయ్య, ప్రజారోగ్యశాఖ ఈఈ
యూజీడీ పనులు సెప్టెంబర్‌లోగా పూర్తిచేయాలని కాంట్రాక్టర్‌కు ఆదేశించాం. ప్యాచ్‌వర్క్‌ల కోసం రూ.90 లక్షలు కేటాయించాం. సీసీ, బీటీ రోడ్ల ప్యాచ్వర్క్లన్నీ పూర్తిచేస్తాం. యూజీడీ కాంట్రాక్టర్ 25 కిలోమీటర్ల ప్యాచ్‌వర్క్ పూర్తిచేయాల్సి ఉంది. హౌసింగ్‌బోర్డులో పనులు ఆలస్యంగా ప్రారంభించడం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయి. సీవరేజ్ ట్యాంకు పనులు పూర్తి చేసి దశలవారీగా ఇండ్ల నుంచి యూజీడీ కనెక్షన్లు ఇస్తాం.