అవాంఛనీయ మానవుడు
ఏప్రిల్ 20 హిట్లర్ పుట్టినరోజు
రంగులూ, బ్రష్లూ, కాన్వాస్‌లతో కళాత్మక జీవితం గడపాలనుకున్నాడతడు. కానీ చరిత్రలో కొన్ని పేజీలని రక్తవర్ణంతో, నిజానికి రక్తంతోనే తడిపాడు. అతడే అడాల్ఫ్ హిట్లర్. అతని జీవితమే పెద్ద నైరూప్య చిత్రం. చిత్రకారునిగా స్థిరపడాలని కలగన్నాడు. పరిస్థితులు అతడిని జర్మన్ సైనికులతో కలసి కవాతు చేయించాయి. అతడి కలని ఒక వికృత చిత్రంగా మార్చేశాయి. మొదటి ప్రపంచ యుద్ధం విసిరిన చేదు ఫలితాలు జీర్ణించుకోలేక రోగిగా మారినవాడు హిట్లర్ (ఏప్రిల్ 20, 1889- ఏప్రిల్ 30, 1945).
హిట్లర్ ఆస్ట్రియాలోని బ్రాన్వాలో పుట్టాడు. తండ్రి ఎలోయిస్ షికెల్బర్ కస్టమ్స్ అధికారి. ముక్కోపి. మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. అతడికి ఇంకో కొడుకు కూడా ఉండేవాడు. అంటే హిట్లర్‌కు వరసకు అన్న. చెడు వర్తనతో జైలు పాలయ్యాడు. హిట్లర్ అలా కాకూడదనీ, కస్టమ్స్లోనే మంచి ఉద్యోగం చేయాలనీ తండ్రి కోరిక. కొడుకు దారి తప్పకుండా ఉండటానికి మార్గం దండించడమేనని నమ్మాడు. తండ్రి దాష్టీకం నుంచి ఎలోయిస్ మూడో భార్య క్లారా పొయెల్జ్ హిట్లర్‌ను కాపాడింది.
1907లో హిట్లర్ ఇల్లు వదిలి నాటి ఆస్ట్రియా రాజధాని వియన్నా వచ్చేశాడు. చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ, హాస్టల్స్‌లో ఉంటూ బతికాడు. మరుసటి సంవ త్సరమే తల్లి క్యాన్సర్‌తో కన్నుమూసింది. ఆమె మృతదేహాన్ని కన్నార్పకుండా ఎంతోసేపు చూస్తూ గడిపాడట హిట్లర్. తరువాత మరణ శయ్య మీద తల్లిని ఊహించుకుంటూ ఒక స్కెచ్ గీశాడట. వియన్నీస్ అకాడమీ ఆఫ్ ఆర్ట్స్‌లో చదువుకోవాలన్నది హిట్లర్ కోరిక. సంస్థ పరిశీలన కోసం పంపిన చిత్రాలు అద్భుతంగా ఉన్నా, ప్రాథమిక పాఠశాలకు సంబంధించిన టీసీ లేదంటూ దరఖాస్తును తిరస్కరించారు.
1914లో మ్యూనిచ్ వెళ్లిపోయాడు. అప్పుడే యుద్ధం వచ్చింది. ఆస్ట్రియా తరఫున బవేరి యన్ ఇన్ఫాంట్రీలో చేరడానికి ప్రయత్నించాడు. ఆయుధం కూడా మోయలేనంత బలహీనంగా ఉన్నాడని సైన్యంలో అవకాశం ఇవ్వలేదు. కానీ డిస్పాచ్ రన్నర్‌గా అవకాశం ఇచ్చారు. గ్రేట్‌వార్‌లో అతడు ఎంతో ధైర్యసాహసాలు ప్రదర్శించాడు. ఐరన్ క్రాస్‌ను కూడా పొందాడు. జర్మనీ ఓడి పోయింది. అప్పుడు వియన్నాలో ఉన్న పరి స్థితులు హిట్లర్ కళాతృష్ణను హరించేశాయని పిస్తుంది. అతడి దృష్టి రాజకీయాల మీదకు మళ్లింది.
యుద్ధంలో జర్మనీ ఓడిపోయిందన్న నిజాన్ని హిట్లర్ జీర్ణించుకోలేకపోయాడు. అప్పుడే క్రిస్టియన్ సోషలిస్టు పార్టీ ప్రాచుర్యం లోకి వచ్చింది. వియన్నా మేయర్ కార్ల్ ల్యూర్ ఆ పార్టీవాడే. వక్తృత్వ కళలో హిట్లర్ ఓనమాలు నేర్చుకున్నది కార్ల్ల్యూర్ ఉపన్యాసాలు వినే. రాజకీయవేత్తకు ఉండవలసిన ప్రధాన లక్షణం వక్తృత్వం. హిట్లర్ అందులో పండిపోయాడు. పూనకంతో, వీరావేశంతో, నిప్పులు కురిసినట్టుండే అతడి ఉపన్యాసం విన్న తరువాత ప్రజలు అతడేం చేయమంటే అది చేయడానికి సిద్ధపడేవారు.
హిట్లర్ యూదులను తీవ్రంగా ద్వేషించాడు. అతడి నాయకత్వంలో ఏర్పాటైన కాన్సెంట్రేషన్ క్యాంపుల్లో ప్రాణాలు కోల్పోయిన వారంతా యూదులే. రెండో ప్రపంచ యుద్ధం ముగిసింది. హిట్లర్ బంకర్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు. యూదులు విడుదలయ్యారు. స్వేచ్ఛాజీవితంలో కూడా ఆ జ్ఞాపకాలతో పడలేక ఆత్మహత్యలు చేసుకున్న యూదులున్నారు. కానీ హిట్లర్‌కు యూదులంటే అంత ద్వేషం ఎందుకు? తన తండ్రి ఒక యూదు కుటుంబపు అక్రమ సంతానం అన్న సత్యం అతడికి రుచించేది కాదట. జర్మనీ... వెన్నుపోటుతో యుద్ధంలో ఓడిపోయిందని హిట్లర్ నమ్మకం.
ఆ వెన్నుపోటు వర్గాలలో యూదులు కూడా ఉన్నారని నమ్మేవాడు. కానీ ఆ యుద్ధంలో కొన్నివేల మంది యూదులు జర్మనీ తరఫున యుద్ధం చేస్తూ కన్ను మూశారు. ఎంతో సాహసం ప్రదర్శించినందుకు ఇచ్చే ఐరన్ క్రాస్ హిట్లర్‌కు దక్కడానికి కారణం- ఒక యూదు సైనికాధికారి చేసిన సిఫారసే. హిట్లర్ కుటుంబ పేదరికం కారణంగా ఒక యూదు వైద్యుడు డబ్బు తీసుకోకుండా సేవలు అందించేవాడు.
అతడిని ‘నోబెల్ జ్యూ’ అని కీర్తించేవాడు హిట్లర్. కానీ తన తల్లికి వైద్యం చేసిన యూదు వైద్యుణ్ని మాత్రం తల్లి మరణానికి కారకుడని నమ్మి ద్వేషం పెంచు కున్నాడు. కాన్సెంట్రేషన్ క్యాంపులకు యూదుల్ని తరలించే ముందు వారందరినీ తీసుకు వెళ్లవచ్చునని హిట్లర్ అమెరికా, బ్రిటన్ తదితర దేశాలకు అవకాశం ఇచ్చాడు. కానీ వారు నిరాకరించారు. ఇది చరిత్రలో వెలుగు చూడని సత్యం. దాదాపు ఏడున్నర లక్షల మంది యూదులు నాజీ శిబిరాలలో రాక్షసంగా మరణించారు.
దీనికి పూర్తి భిన్నమైన కోణం కూడా హిట్లర్‌లో కనిపిస్తుంది. తల్లిని గాఢంగా ప్రేమిం చాడు. ఆమె మరణించాక ఎక్కడికి వెళ్లినా ఆమె ఫొటోను దగ్గరే ఉంచుకునేవాడట. ధూమపానా నికి వ్యతిరేకంగా సామాజికోద్యమాన్ని నడిపిన మొదటి వ్యక్తి హిట్లరే. అతడు శాకాహారి. జంతు హింసకు వ్యతిరేకంగా చట్టాలు కూడా చేశాడు.
హిట్లర్ అధికారంలోకి రావడం ఒక ప్రత్యేక చారిత్రక నేపథ్యంలో జరిగింది. అతడు జర్మనీ నియంత అయ్యాడు. పోలెండ్ మీద యుద్ధం ప్రకటించి రెండో ప్రపంచయుద్ధానికి తెర తీశాడు. ప్రపంచ చరిత్ర తట్టుకోలేనంత అవాంఛనీయ మానవుడు హిట్లర్. అతడి ప్రతి కూల ప్రభంజనంలో చరిత్ర పుటలు కకావికలై పోయాయి. ప్రపంచ రాజకీయ నాటకంలో ఇంతకు మించిన ప్రతినాయక పాత్రను అతడికి ముందు, అతడి తరువాత చరిత్ర చూడలేదు కూడా. విరుద్ధ భావాలు ఉన్నా, వికృత చర్యలకు చిరునామాగా మిగిలిపోయాడు హిట్లర్!!
- డా॥గోపరాజు నారాయణరావు