టీచర్లకు టోపీ !
గుంటూరు ఎడ్యుకేషన్ : ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ వృత్తిని చేపట్టాలని రెండేళ్ళుగా ఎదురుచూసిన నిరుద్యోగుల ఆశలు ఎక్కువ కాలం నిలువలేదు. పాఠశాలల్లో పోస్టింగ్స్ పొందిన ఉపాధ్యాయులకు జూన్ నెల జీతంలో సగం కోత పడనుండగా, డీఈవో పూల్లో ఉంచిన వారికి అసలు జీతమే విడుదల కాని పరిస్థితి ఏర్పడింది. డీఎస్సీలో ఉపాధ్యాయులుగా ఎంపికైన వారందరికీ జూన్ 1వ తేదీన పోస్టింగ్స్ ఇవ్వడంతో పాటు అదే రోజు నుంచి వేతన చెల్లింపు పరిధిలోకి వస్తారని ప్రకటించిన ప్రభుత్వం వారిని మోసగించింది.
డీఎస్సీ-2014లో ప్రతిభ ఆధారంగా అర్హత సాధించిన అభ్యర్థులతో ఈనెల 1వ తేదీన సీఎం చంద్రబాబు విజయవాడలో నిబద్ధత ప్రమాణం సైతం చేయించారు. జిల్లాలో డీఎస్సీ ద్వారా వివిధ కేటగిరీల్లో 890 మంది నియామకం పొందగా, వారిలో 300 మందికి పోస్టింగ్స్ కల్పించలేదు. ఉపాధ్యాయులుగా ఎంపికైన వారందరికీ ఈనెల 3వ తేదీ నుంచి శిక్షణ కల్పించిన ప్రభుత్వం 13న పాఠశాలల్లో పోస్టింగ్స్ కల్పించింది. వారందరినీ జూన్ ఒకటో తేదీ నుంచి విధుల్లో చేరినట్లుగా పరిగణించాల్సి ఉండగా, విధుల్లో చేరి రోజు నుంచే విద్యాశాఖ అధికారికంగా హాజరు నమోదు చేయడంతో జూన్ నెలకు సగం జీతమే చెల్లించనున్నారు.
వారికి జీతాలు నిల్..
పాఠశాలల్లో ఖాళీలు లేకపోవడంతో డీఈవో పూల్లో ఉంచిన 300 మంది అభ్యర్థులకుజీతాలు విడుదలయ్యే పరిస్థితి లేదు. పాఠశాలల్లో చేరి ఉపాధ్యాయులుగా నమోదైతేనే వారి వివరాలు ట్రెజరీకి పంపడం జరుగుతుంది. డీఈవోకు అటాచ్ చేసినప్పటికీ పాఠశాలల్లో నియామకం పొందని కారణంగా 300 మంది అభ్యర్థులకు జీతాల చెల్లింపులపై ఎలాంటి ఉత్తర్వులు విడుదల కాలేదు. డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయులుగా ఎంపికయ్యామనే ఆనందం మినహా, జీతాలు పొందే పరిస్థితి లేకపోయింది. దీంతో ఉపాధ్యాయులుగా ఎంపికైన వారు సగం జీతం పొందుతుండగా, పోస్టింగ్స్ అందుకుని పాఠశాలలకు కేటాయించని అభ్యర్థులకు అసలు జీతమే చెల్లించని పరిస్థితి నెలకొంది.
ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం
జిల్లాలో డీఎస్సీ-2014 ద్వారా నియామకం పొందిన ఉపాధ్యాయులకు వారు విధుల్లో చేరిన జూన్ 13వ తేదీ నుంచే వేతనాల లెక్కింపు జరుగుతుంది. డీఈవో పూల్లో ఉంచిన అభ్యర్థులకు వేతనాలు చెల్లింపు విషయమై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం.
- కేవీ శ్రీనివాసులు రెడ్డి, జిల్లా విద్యాశాఖాధికారి