60 బిలియన్ డాలర్లకి ఎఫ్‌డీఐలు!
న్యూఢిల్లీ: దేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) ఈ ఏడాది 60 బిలియన్ డాలర్లకు చేరవచ్చని యునెటైడ్ నేషన్స్ ఆర్థికవేత్త నగేశ్ కుమార్ అంచనా వేశారు. యునెటైడ్ నేషన్స్ ఎకనమిక్ అండ్ సోషియల్ కమిషన్ ఫర్ ఆసియా అండ్ పసిఫిక్ (యూఎన్ఈఎస్సీఏపీ) సంస్థ ద క్షిణాసియా కార్యాలయం హెడ్‌గా ఉన్న ఈయన యునెటైడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ (యూఎన్‌సీటీఏడీ) నివేదిక విడుదల సందర్భంగా మాట్లాడారు.
సంస్కరణలకు అనువుగా ప్రభుత్వం అనుసరిస్తున్న విధాన చర్యలు, పాలసీల ఏర్పాటు వంటి తదితర చర్యలు ఎఫ్‌డీఐల పెరుగుదలకు దోహదపడనున్నాయని పేర్కొన్నారు. ‘గతేడాది దేశంలో ఎఫ్‌డీఐలు 28 శాతం వృద్ధితో 44.20 బిలియన్ డాలర్లకి ఎగశాయి. ప్రస్తుత ఏడాది ఎఫ్‌డీఐలు 60 బిలియన్ డాలర్ల మార్క్‌ను అధిగమించవచ్చు’ అని అభిప్రాయపడ్డారు. గతేడాది భారత్ ఎఫ్‌డీఐల ఆక ర్షణలో ఆసియా ప్రాంతలో నాలుగో స్థానంలో, ప్రపంచంలో పదవ స్థానంలో నిలిచిందని తెలిపారు.