దాసరికి ‘అనంత’ నివాళి
అనంతపురం కల్చరల్ : దర్శకరత్న దాసరి నారాయణరావు మృతికి అనంత కళాకారులు, బలిజ సంఘం నేతలు ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం రాత్రి వేర్వేరు ప్రకటనల్లో దాసరి మృతి తీరని లోటని శ్రద్ధాంజలి ఘటించారు. అనంత వేదికగా జూన్లో నిర్వహించనున్న కేటీబీ (కాపు, తెలగ, బలిజ) సంక్షేమ సంఘం విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశానికి దాసరి నారాయణరావు రావడానికి అంగీకరించారనీ, ఇంతలో ఆయన అకాల మరణం తమను కలిచి వేసిందని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు జంగటి అమరనాథ్, రాయలసీమ బలిజ సంఘం అధ్యక్షుడు బళ్లారి వెంకట్రాముడు పేర్కొన్నారు. కాంగ్రెస్ తరఫున ఎన్నికల ప్రచారంలో జిల్లాకు వచ్చి ఎంతోమందిని ప్రభావితం చేశారని గుర్తు చేసుకున్నారు. రచయితగా, దర్శకునిగా, నటునిగా ఉన్నత స్థానాలను అధిరోహించిన దాసరినారాయణరావు సినీ పరిశ్రమ గర్వించదగ్గ వ్యక్తి అని, ఆయన లేని లోటును ఎవరూ పూడ్చలేరని లలితకళాపరిషత్ అధ్యక్ష కార్యదర్శులు మేడా సుబ్రమణ్యం, నారాయణస్వామి, గురుకృప సంగీత నృత్య కళానికేతన్ వ్యవస్థాపకులు పట్నం శివప్రసాద్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
మల్లేశ్వరయ్యకు ప్రత్యేక అనుబంధం
దాసరి నారాయణరావుతో జిల్లాకు చెందిన సీనియర్ రంగస్థల, సినీ నటుడు మల్లేశ్వరయ్యకు ప్రత్యేక అనుబంధం ఉంది. దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన ‘లంచావతరాం’ సినిమాలో మల్లేశ్వరయ్యకు సీఐడీ పాత్ర ఇచ్చారు. అదే విధంగా ‘అద్దాల మేడ’ చిత్రంలో కూడా చిన్న పాత్రలో నటించడానికి అవకాశం కల్పించారు. దాసరి నారాయణరావు మరణ వార్త వినగానే తాను దిగ్బ్రాంతి చెందినట్లు మల్లేశ్వరయ్య తెలిపారు. ఒక గొప్ప దర్శకుడు లేని లోటును తెలుగు చిత్ర రంగం ఎప్పటికీ పూడ్చుకోలేనిదన్నారు.