‘యూనిఫాం’ ఘటనపై విచారణకు ఆదేశం
అనంతపురం ఎడ్యుకేషన్ : 2016–17 విద్యా సంవత్సరంలో ముదిగుబ్బ మండలంలోని విద్యార్థులకు యూనిఫాం పంపిణీ చేయని అంశం అనవసరంగా తమ మెడకు చుట్టుకునే ప్రమాదం ఉందని భావించిన ఎస్ఎస్ఏ అధికారులు తేరుకున్నారు. రాజకీయ ఒత్తిడి నేపథ్యంలో ‘సాక్షి’లో వచ్చిన కథనానికి రిజాయిండరీ ఇచ్చేసి చేతులు దులుపుకోవచ్చని భావించారు. అయితే ఇది కాస్తా జిల్లా కలెక్టర్‌తో పాటు, సర్వశిక్ష అభియాన్ రాష్ట్ర అధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో అనవసరంగా ఇబ్బందులు వస్తాయని భావించిన ఎస్ఎస్ఏ అధికారులు యూనిఫాం సరఫరా కాని వైనంపై విచారణకు ఆదేశించారు.
ఈ క్రమంలో ప్లానింగ్ కోఆర్డినేటర్ గోపాల్‌నాయక్‌ను విచారణ అధికారిగా నియమించారు. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని పీఓ సుబ్రమణ్యం ఆదేశించారు. కాగా...కొలతలు ఎక్కువ తక్కువగా ఉండటంతో ముదిగుబ్బ మండలం విద్యార్థులకు యూనిఫాం సరఫరా చేయలేకపోయామని చెప్పిన అధికారులు దీనిపై మళ్లీ ‘సాక్షి’లో కథనం కావడంతో కలవరపాటుకు గురయ్యారు. విచారణ చేయించి వాస్తవ విషయాలను కలెక్టర్, ఎస్పీడీ అధికారులకు నివేదిస్తామని ఎస్ఎస్ఏ అధికారులు చెబుతున్నారు.