ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్!
న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) అమలు అనంతరం తొలిసారి కేంద్ర బడ్జెట్‌ను వచ్చే ఏడాది ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టే అవకాశముంది. ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వానికి ఇదే చివరి పూర్తి స్థాయి బడ్జెట్ కావడంతో కొత్త ప్రజాకర్షక పథకాలు, ఆదాయపు పన్ను రేట్లలో మార్పులపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి జనవరి 30న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయని కేంద్ర ప్రభుత్వ అధికారి ఒకరు వెల్లడించారు. ఆర్థిక సర్వేను జనవరి 31న ప్రవేశపెట్టవచ్చని, ఆ తర్వాతి రోజు ఆర్థిక మంత్రి జైట్లీ బడ్జెట్‌ను సమర్పిస్తారని ఆయన చెప్పారు. బ్రిటిష్ కాలం నాటి సంప్రదాయాన్ని పక్కన పెట్టి ఈ ఏడాది నుంచి ఫిబ్రవరి 1నే కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న సంగతి తెలిసిందే. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభ తేదీ ఏప్రిల్ 1 నాటికి బడ్జెట్ ప్రతిపాదనలు అమల్లోకి వచ్చేలా కేంద్ర బడ్జెట్ సమర్పణను నెల రోజులు ముందుకు జరిపారు. దాదాపు శతాబ్దం పాటు కొనసాగిన రైల్వే బడ్జెట్‌ను.. ఈ ఏడాది నుంచి సాధారణ బడ్జెట్లో విలీనం చేశారు.
కొత్త పథకాలు ప్రవేశపెట్టే అవకాశం
2019 సాధారణ ఎన్నికలకు ముందు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి 2018–19 కేంద్ర బడ్జెట్ చివరి పూర్తి స్థాయి బడ్జెట్. ఇంతవరకూ అనుసరిస్తున్న సంప్రదాయం ప్రకారం ఎన్నికల సంవత్సరంలో పూర్తి స్థాయి బడ్జెట్ సమర్పణ ఉండదు. ప్రభుత్వ ఖర్చుల కోసం ఓటాన్ అకౌంట్‌ను ప్రవేశపెడతారు. అనంతరం అధికారంలోకి వచ్చిన కొత్త ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడుతుంది. ఈ నేపథ్యంలో 2018–19 బడ్జెట్లో పలు కొత్త పథకాల ప్రకటనలు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.
వేర్వేరుగా రాబడి లెక్కలు
జీఎస్టీ అమల్లోకి వచ్చాక ఇదే తొలి బడ్జెట్ కావడం మరొక కీలకాంశం. ఎక్సైజ్, సేవా పన్నుల్ని జీఎస్టీలో కలపడంతో.. రాబోయే బడ్జెట్ సమర్పణలో అనేక మార్పులు చేర్పులు ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్–జూన్ మధ్యలో ఎక్సైజ్, కస్టమ్స్, సేవా పన్నుల ద్వారా వచ్చిన ఆదాయాన్ని, జూలై–మార్చి మధ్య జీఎస్టీ, కస్టమ్స్ పన్నుల నుంచి వచ్చిన ఆదాయాన్ని వేర్వేరుగా పొందుపర్చవచ్చని సమాచారం. వ్యక్తిగత ఆదాయ పన్ను, కార్పొరేట్, కస్టమ్స్ పన్నుల్లో మార్పుల ప్రతిపాదనలు, కొత్త ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల ప్రకటనలు మాత్రమే రాబోయే బడ్జెట్లో కీలకం కానున్నాయి.
జనవరి 5 వరకూ శీతాకాల సమావేశాలే..
శీతాకాల సమావేశాలు, బడ్జెట్ సమావేశాలకు మధ్య నెల రోజులు కూడా సమయం లేకపోవడంతో బడ్జెట్ కసరత్తుపై ఉత్కంఠ ఏర్పడింది. శీతాకాల సమావేశాలు డిసెంబర్ 15న ప్రారంభమై వచ్చే ఏడాది జనవరి 5తో ముగియనున్నాయి. 1976లో కూడా జనవరిలోనే శీతాకాల సమావేశాలు జరిగినా అప్పుడు ఫిబ్రవరి చివరి రోజున బడ్జెట్ సమర్పణతో రెండింటికి మధ్య నెలకుపైగా సమయముందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.