భవిష్యత్ అభివృద్ధికి బాటలు: ఫ్యాప్సీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కేంద్ర బడ్జెట్ భవిష్యత్ అభివృద్ధికి బాటలు పరిచేలా ఉందని ఫ్యాప్సీ అభిప్రాయపడింది. 10కిగాను 8 మార్కులు ఇస్తున్నట్టు ఫ్యాప్సీ ప్రెసిడెంట్ శివ్‌కుమార్ రుంగ్టా శనివారమిక్కడ మీడియాకు తెలిపారు. సంతులిత బడ్జెట్‌గా ఆయన అభివర్ణించారు. ఇన్ఫ్రా రంగానికి అదనంగా రూ.70 వేల కోట్లు కేటాయించారు. అలాగే చిన్న వ్యాపారులకు రుణాలిచ్చేందుకు రూ.20 వేల కోట్లతో ముద్ర బ్యాంకు, రూ.3 వేల కోట్లతో క్రెడిట్ గ్యారంటీ కార్పస్ ఏర్పాటుతో వాణిజ్య, వ్యాపార పరంగా అన్ని రంగాల్లోనూ అభివృద్ధి సాధ్యపడుతుందని అన్నారు.
స్టార్టప్‌లను వెన్నుతట్టేలా రూ.1,000 కోట్లు కేటాయించడం ఆహ్వానించతగ్గదని సీనియర్ వైస్ ప్రెసిడెంట్ వెన్నం అనిల్ రెడ్డి చెప్పారు. ఎక్సైజ్ డ్యూటీ తగ్గిస్తారని ఎదురు చూసిన పరిశ్రమకు నిరాశ కలిగించారని అన్నారు. వ్యవసాయ రుణాలకు రూ.8.5 లక్షల కోట్లు కేటాయించారు. వ్యవసాయ రంగానికి అతిపెద్ద బూస్ట్ అని వైస్ ప్రెసిడెంట్ రవీంద్ర మోడి తెలిపారు. గార్ అమలు వాయిదా వల్ల భారత్‌కు పెట్టుబడులు పెరుగుతాయని ఫ్యాప్సీ మాజీ ప్రెసిడెంట్ శ్రీనివాస్ అయ్యదేవర అభిప్రాయపడ్డారు. విదేశీ పెట్టుబడిదారుల భయాలను తొలగించడంలో ఇది కీలక నిర్ణయమన్నారు. ద్రవ్యోల్బణం కట్టడికి మానిటరీ పాలసీ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారని, కమిటీ రాకతో ఆర్బీఐ గవర్నర్ అధికారాలు తగ్గే అవకాశం ఉందని అన్నారు.