Union Minister Birender Singh
-
మెకాన్ తుది నివేదిక తరువాతే ఉక్కు ఫ్యాక్టరీపై ప్రకటన
సాక్షి, న్యూఢిల్లీ: మెకాన్ సంస్థ ముసాయిదా నివేదిన సమర్పించిన తరువాతే వైఎస్సార్ జిల్లాలో ఉక్కు కార్మాగారం ఏర్పాటుపై తదుపరి ప్రకటన చేయగలుగుతామని, అప్పటి వరకు ఎలాంటి నిర్దిష్ట ప్రకటన చేయలేమని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి బీరేంద్ర సింగ్ స్పష్టం చేశారు. టీడీపీ ఎంపీలు గురువారం కూడా కేంద్ర మంత్రిని కలసి ప్లాంట్ ఏర్పాటుకు అవసరమైన భూమి, ముడిసరుకు సరఫరాపై వివరించారు. అనంతరం కేంద్ర మంత్రి ఒక్కరే విడిగా మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రాయితీలపై మెకాన్‌కు పూర్తి సమాచారం ఇవ్వాలని టీడీపీ ఎంపీలకు సూచించానన్నారు. సదురు సంస్థ ముసాయిదా నివేదిక సమర్పించిన అనంతరం టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశమై చర్చించాక తదుపరి ప్రకటన చేయగలుగుతామన్నారు. ప్లాంట్ ఏర్పాటుపై నాలుగేళ్లుగా కేంద్రం ఉద్దేశపూర్వకంగా కాలయాపన చేస్తోందన్న టీడీపీ విమర్శలను ఆయన కొట్టిపారేశారు. ఉద్దేశపూర్వకంగా కాలయాపన చేయాలనుకుంటే ఇన్నిసార్లు కమిటీలు నియమించి ప్లాంట్ ఏర్పాటుకు అవసరమైన అవకాశాలపై ఎందుకు అధ్యయనం జరిపిస్తామని ఆయన ప్రశ్నించారు. ‘1966లో మా రాష్ట్రం (హరియాణా) ఏర్పడింది. ఇప్పటికి కూడా మా రాష్ట్ర విభజన సమస్యలు పరిష్కారం కాలేదు. అలాంటిది నాలుగేళ్లకే ఏపీ సమస్యలు పరిష్కరించలేదని చెప్పడం సరైందికాదు’ అని కేంద్ర మంత్రి అన్నారు. టీడీపీ ఎంపీల అభ్యర్థన మేరకు ఎంపీ రమేశ్‌తో కేంద్ర మంత్రి ఫోన్లో మాట్లాడి దీక్ష విరమించాలని సూచించారు. అంతకుముందు టీడీపీ ఎంపీలు మీడియాతో మాట్లాడుతూ.. ప్లాంట్ ఏర్పాటుకు అవసరమైన భూమిని ఎకరం రూ. నాలుగు లక్షలకు ఇస్తామని, రైల్వేలైన్‌కు అయ్యే ఖర్చులు భరిస్తామని కేంద్ర మంత్రికి చెప్పామన్నారు. ఈ వివరాలను రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మెకాన్‌కు ఇవ్వాలని ఆయన సూచించారన్నారు. కేంద్రం ఉద్దేశపూర్వకంగా ఈ విషయంలో కాలయాపన చేస్తోందని విమర్శించారు. 24 గంటల్లో మెకాన్‌కు వివరాలిస్తామని చెప్పారు. మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీని కలిసేందుకు అపాయింట్మెంట్ కావాలని కోరగా ఆయన తిరస్కరించారంటూ టీడీపీ ఎంపీలు పేర్కొన్నారు. అయితే ప్రధాని గురువారం ఉత్తరప్రదేశ్ పర్యటనకు వెళ్లారు. -
బరువు తగ్గాలి.. దీక్షలు చేద్దాం
సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, అమరావతి: ‘‘ఐదు కేజీలు బరువు తగ్గాలనుకుంటున్నాను. ఒక వారం రోజులైతే నేను దీక్ష చేస్తా’’ ఇది ఓ టీడీపీ ఎంపీ మాట. దీక్షలు, హామీల సాధనపై ఆ పార్టీ నేతల చిత్తశుద్ధిని బయట పెట్టిన వ్యాఖ్య. కడుపుకాలిన ప్రజలు ఓ పక్కన కష్టాలకోర్చుకుని దీక్షలు చేస్తుంటే.. కడుపు నిండిన టీడీపీ నేతల వెటకారాన్ని బయటపెట్టిన సందర్భం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన వాటిని సాధించకుండా టీడీపీ ఎంపీలు చేస్తున్న కపటనాటకాలు ఢిల్లీ వేదికగా బహిర్గతమయ్యాయి. హామీల సాధన పేరుతో చేస్తున్న డ్రామాలు, దొంగ దీక్షలు చివరికి వారి నోటివెంటే చెప్పుకున్నారు. టీడీపీ ఎంపీల సంభాషణల వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. కడప ఉక్కు కర్మాగారం ఏర్పాటుపై కేంద్రం నుంచి స్పష్టమైన హామీ సాధన కోసం ఢిల్లీలో పోరాటం చేస్తాం, కేంద్ర మంత్రి వద్ద ధర్నా చేస్తాం అంటూ ఆ పార్టీ ఎంపీలు గత రెండు రోజులుగా ఢిల్లీలో నడుపుతున్న వ్యవహారం బూటకమని తేలిపోయింది. బుధవారం కేంద్ర మంత్రి బీరేంద్ర సింగ్‌తో సమావేశమైనా స్పష్టమైన హామీ సాధించలేకపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై కేంద్రానికి ఇవ్వాల్సిన సమాచారంపై చర్చించేందుకంటూ టీడీపీ ఎంపీలు దివాకర్‌రెడ్డి, మురళీమోహన్, కనకమేడల రవీంద్రకుమార్, రామ్మోహన్నాయుడు, కేశినేని నాని, అవంతి శ్రీనివాస్ తదితరులు గురువారం ఢిల్లీలోని ఏపీ భవన్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మురళీమోహన్ మాట్లాడుతూ.. ‘ఐదు కేజీలు బరువు తగ్గాలనుకుంటున్నాను. ఒక వారం రోజులైతే నేను దీక్ష చేస్తా’ అని అన్నారు. ఈ క్రమంలో దివాకర్‌రెడ్డి కల్పించుకొని ‘ఈయన్ను పెడదాం..డన్’ అన్నారు. ఇంతలో ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ కల్పించుకొని.. ‘ఆయన్న మొదటి రోజే రామ్మనోహర్ లోహియా ఆస్పత్రికి తీసుకెళ్లాం (గత పార్లమెంటు సమావేశాల్లో దీక్ష పేరుతో చేసిన డ్రామా ఉదంతాన్ని ఉటంకిస్తూ). అలాంటిది మీరెందుకు ఆయన్ను అంటారు’ అని అన్నారు. వెంటనే ఎంపీ రామ్మోహన్నాయుడు స్పందిస్తూ.. ‘అదేకదా’ అని అనగానే ఎంపీలందరూ నవ్వుకున్నారు. ఈ క్రమంలో ఎంపీ అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ..‘జోనూ లేదు.. గీనూ లేదు’ అంటూ విశాఖ రైల్వే జోన్ సాధనలో ఏ మాత్రం చిత్తశుద్ధి లేనితనాన్ని నిరూపించుకున్నారు. రాష్ట్ర ప్రయోజనాలపై కపట నాటకాలా?? కడప ఉక్కు ఫ్యాక్టరీ సాధనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో ఆ పార్టీ ఎంపీలు ఆడుతున్న నాటకం బయటపడటంతో ప్రజలు మండిపడుతున్నారు. టీడీపీ ఎంపీల వెటకారపు మాటలపై నెటిజన్లు ధ్వజమెత్తుతున్నారు. రాష్ట్ర ప్రజల జీవన్మరణ సమస్యలపై టీడీపీ నేతల నీతి, నిజాయితీ ఇదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దొంగ దీక్షలు చేసి అసలు ఉద్యమాన్ని నిర్వీర్యం చేయాలని చూస్తున్నారని, కపట నాటకాలతో రాష్ట్ర ప్రయోజనాలను తుంగలో తొక్కుతున్నారని ఆవేదన చెందుతున్నారు. ఓట్ల కోసమే దీక్షల డ్రామా మొదలుపెట్టారని భావిస్తున్నారు. గారడీలో చంద్రబాబు దిట్ట: విజయసాయిరెడ్డి సీఎం చంద్రబాబు ఇంద్రజాల దిగ్గజం పీసీ సర్కార్‌ను మించిన వాడని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. చంద్రబాబు జిమ్మిక్కులపై ఆయన ట్విటర్లో మండిపడ్డారు. గాల్లో అసెంబ్లీని నిర్మించి కార్యకలాపాలు కొనసాగిస్తారని, అంకెల్లోనే అభివృద్ధి చూపుతారని, చెట్లు లేకుండానే ఆంధ్రప్రదేశ్‌ను హరితవనం చేస్తారని, ప్రసంగాల్లోనే యువతకు ఉపాధి, ఉద్యోగాలు చూపిస్తారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు అవినీతి, అన్యాయ పాలనలో రాష్ట్రం దశాబ్దాల వెనక్కి పోయిందన్నారు. ప్రజల సంక్షేమాన్ని, ఆకాంక్షలను గాలికొదిలేశారని మండిపడ్డారు. -
బయ్యారం స్టీల్ ప్లాంట్‌పై త్వరలోనే నిర్ణయం
న్యూఢిల్లీ: విభజన చట్ట ప్రకారం తెలంగాణలో బయ్యారం స్టీల్ ప్లాంట్ ఏర్పాటు విషయంలో త్వరలోనే సానుకూల నిర్ణయం తీసుకుంటామని కేంద్ర గనుల శాఖ మంత్రి బీరేంద్ర సింగ్ చౌదరి తెలిపారు. స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై మంత్రి కేటీఆర్ సోమవారం బీరేంద్ర సింగ్‌తో ఢిల్లీలో సమావేశమై చర్చించారు. విభజన చట్ట ప్రకారం స్టీల్ ప్లాంట్ ఏర్పాటు వల్ల యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు వస్తాయని కేంద్ర మంత్రికి వివరించారు. విభజన జరిగి మూడేళ్ల పూర్తైనా స్టీల్ ప్లాంట్ ఏర్పాటు విషయంలో ఇంత వరకు పురోగతి లేదన్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని బైలడైల ఐరన్‌ఓర్ మైన్స్‌కు లింక్ చేస్తూనైనా ప్లాంట్ ఏర్పాటు చేయాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. అనంతరం కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. గతంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు సాధ్యం కాదని సెయిల్ కమిటీ నివేదిక ఇచ్చిందన్నారు. అనంతరం తాను ఉక్కు శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయడానికి టాస్క్‌ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేశానాని తెలిపారు. ఈ కమిటీ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు సానుకూలంగా నివేదిక ఇచ్చే అవకాశం ఉందన్నారు. కమిటీ తుది నివేదిక అందాక హైదరాబాద్‌లో ప్రత్యేకంగా సమావేశమై రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.