విదేశీ పెట్టుబడులకు ఆహ్వానం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ‘మేక్ ఇన్ ఇండియా’ కింద దేశ వ్యాప్తంగా కొత్తగా పరి శ్రమలను నెలకొల్పేందుకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను కేంద్రప్రభుత్వం ఆహ్వానిస్తోందని కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్, పరిశ్రమల శాఖ మంత్రి హర్సిమ్రత్ కౌర్ బాదల్ అన్నారు. ‘ముద్ర’ పథకం కింద చిన్నతరహా పరిశ్రమలను ప్రోత్సహించేందుకు కేంద్రం కొత్త పథకాలను అమలు చేస్తోందన్నారు. నాబార్డు ద్వారా ‘సెజ్’లు, చిన్నతరహా పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు రూ. 2,000 కోట్ల నిధులను జమ చేసిందన్నారు. నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం లక్కంపల్లిలో వంద ఎకరాల్లో రూ.120 కోట్ల అంచనాతో నిర్మించనున్న తెలంగాణ రాష్ట్రంలో తొలి ‘స్మార్ట్ ఆగ్రో ఫుడ్ పార్కు’ను సోమవారం కేంద్ర మంత్రి హర్సిమ్రత్ కౌర్ బాదల్ శంకుస్థాపన చేశారు..
కార్యక్రమంలో కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి సాధ్వీ నిరంజన్ జ్యోతి, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత, ఆర్మూరు ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కేంద్రమంత్రి హర్సిమ్రత్ కౌర్ బాదల్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రానికి ఈ ఏడాది 3 మెగాఫుడ్ పార్క్‌లను మం జూరు చేసినట్లు తెలిపారు. నల్లగొండలో రూ. 140 కోట్లు, మహబూబ్‌నగర్‌లో రూ.113 కోట్లతో మెగాఫుడ్ పార్క్‌లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వ్యవసాయ ఉత్పత్తుల నాణ్యతను కాపాడే మూడు ప్రైమరీ ప్రాసెసింగ్ యూనిట్లను కూడా రాష్ట్రానికి మంజూరు చేసినట్లు తెలిపారు. లక్కంపల్లి ‘సెజ్’ భూముల్లో రెండేళ్లలో పూర్తిస్థాయిలో అన్ని పరిశ్రమలను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ ప్రాజెక్టు పనుల పురోగతిపై నిజామాబాద్ ఎంపీ కవితను అడిగి తెలుసుకుంటానని చెప్పారు. లక్కంపల్లిలో పరిశ్రమలు నెలకొల్పడం ద్వారా సుమారుగా 12 వేల మందికి ఉద్యోగావకాశాలు కలుగుతాయ న్నారు. పసుపు పరిశోధన కేంద్రం ఏర్పాటు కు కేంద్రం సహకారం ఉంటుందన్నారు.