ఊప్రతి నలుగురిలో ఒకరికి..
మానసిక సమస్యలపై కేంద్ర మంత్రి ఫగ్గాన్ సింగ్
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో మానసిక వ్యాధులకు దారి తీస్తున్న పరిస్థితులు, రుగ్మతలకు చికిత్సలపై ప్రజల్లో అవగాహన కల్పించడం అత్యవసరమని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి ఫగ్గాన్ సింగ్ అన్నారు. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా సోమవారం ఢిల్లీలో ఏర్పాటుచేసిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దేశంలో ప్రతి నలుగురిలో ఒకరు తమ జీవితంలో ఒక్కసారైనా మానసిక రుగ్మతల బారిన పడుతున్నారన్నారు. మానసిన వ్యాధులతో బాధపడుతున్న వారిని సమాజం ఏకాకుల్ని చేయడం, వివక్ష చూపడంతో వారు చికిత్సకు దూరమవుతున్నారని తెలిపారు.
ఇలాంటి వ్యక్తుల విషయంలో సమాజం వైఖరి మారాలన్నారు. చికిత్స విషయంలో ఆరోగ్య వ్యవస్థను సున్నితంగా, ఆమోదయోగ్యంగా మార్చడంలో ఎదురయ్యే సవాళ్లను అందరూ కలసికట్టుగా అధిగమించాలన్నారు. భౌతికంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే పరిపూర్ణ ఆరోగ్యవంతులమవుతామని కేంద్ర సహాయ మంత్రి అనుప్రియ పటేల్ అన్నారు. దేశంలో దాదాపు ఏడు శాతం ప్రజలు మానసిక రుగ్మతలతో బాధపడుతున్నారని, సమస్య పరిష్కారానికి మానసిక నిపుణుల అవసరముందన్నారు. అందుకు జాతీయ మానసిక ఆరోగ్య పథకం కింద కేంద్రం నిధులు కేటాయిస్తోందని చెప్పారు.