ఎన్టీఆర్ భవన్ వద్ద ‘తమ్ముళ్ల’ ఆందోళన
హైదరాబాద్: టీడీపీ-బీజేపీ పొత్తు టీడీపీలో చిచ్చు రేపుతోంది. ఈ పొత్తును తీవ్రంగా వ్యతి రేకిస్తూ తెలుగు తమ్ముళ్లు శనివారం సాయంత్రం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వద్ద ఆందోళనకు దిగారు. బీజేపీ తమపై సవతితల్లి ప్రేమ చూపిందని ఆగ్రహిస్తూ బైఠాయించారు. గెలిచే సీట్లను తమకివ్వకుండా ఒంటెత్తు పోకడ పోయిందన్నారు. నగరం నలుమూలల నుంచి వచ్చిన టీడీపీ కార్యకర్తలతో ట్రస్ట్ భవన్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. సీట్ల పంపకంపై జూబ్లీహిల్స్ రోడ్ నంబర్10లోని టీడీపీకి చెంది న కేంద్ర మంత్రి సుజనాచౌదరి కార్యాలయం లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, ఆ పార్టీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, టీడీపీ గ్రేటర్ అధ్యక్షుడు మాగంటి, సుజనాచౌదరి, ఎమ్మెల్యే వివేకానంద్ సమావేశమైనట్టు తెలుసుకున్న కార్యకర్తలు అక్కడికి కూడా వెళ్లి ఆందోళనకు దిగారు.
తమకు అన్యాయం జరిగిందంటూ బైఠాయించారు. పూలకుండీలు ఎత్తి పడేశారు. ఇంట్లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టీఆర్ఎస్కు బీజేపీ అమ్ముడుపోయిం దని నినాదాలు చేస్తూ నేతలను ఘెరావ్‌కు యత్నించారు. బీజేపీతో పొత్తు తెంచుకోకపోతే గ్రేటర్లో టీడీపీ ఒక్క సీటు కూడా గెలవలేదంటూ నినాదాలు చేశారు. వారి ఆందోళన మధ్యనే సుజనా చౌదరితో పాటు బీజేపీ, టీడీపీ నేతలు అక్కడినుంచి వెళ్లిపోయారు.
టీఆర్ఎస్కు బీజేపీ అమ్ముడుపోయిందని జూబ్లీహిల్స్ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు ఆకుల వెంకటేశ్వర్రావు ఆరోపించారు. జూబ్లీహిల్స్ టికెట్‌ను బీజేపీకి కేటాయించడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. అక్కడినుంచి రెబల్ గా పోటీ చేస్తానని హెచ్చరించారు. ఖైరతాబాద్ బీజేపీ ఎమ్మెల్యే చింతల సీఎం కేసీఆర్ వద్ద రూ.50 కోట్లు ముడుపులు తీసుకొని నగరమంతటా వారి పార్టీ తరఫున డమ్మీ అభ్యర్థులను పెట్టారని ఆరోపించారు. జంటనగరాల్లో టీడీపీ లేకుండా చేయడానికే బీజేపీ నేతలు కుట్ర పన్నుతున్నారన్నారు.