Union Minister sujana chowdary
-
నీటి భద్రతకు చట్టం కావాలి: సుజనా
సాక్షి, హైదరాబాద్: ఆహార భద్రతకు చట్టమున్నట్లే దేశంలోని రైతులు పంటలు పండించేందుకు నీరు అందుబాటులో ఉంచేలా ప్రత్యేక చట్టం అవసరమని కేంద్ర మంత్రి సుజనాచౌదరి అన్నారు. రైతులు తమ శ్రమ శక్తికి, పంటలు పండించే భూమికి తగిన విలువ సంపాదించుకునే ఆలోచన చేయాలని, ఇందుకోసం వారు ఆర్థిక వ్యవహారాలనూ ఆకళింపు చేసుకునేందుకు ప్రయత్నించాలన్నారు. గురువారం హైదరాబాద్‌లో ప్రారంభమైన ‘రూరల్ ఇన్నోవేటర్స్ స్టార్టప్ కాన్క్లేవ్’లో ఆయన మాట్లాడుతూ... రైతులు తమ శ్రమ, పంటలు పండించే నేల నుంచి అత్యధిక విలువను పొందడంలో విఫలమవుతున్నారని, వారికి కాస్ట్ అకౌంటెన్సీ, లాభ నష్టాలను ఎలా లెక్కిస్తారో.. వేటిని పెట్టుబడులుగా పరిగణిస్తారో తెలియ జేయాల్సిన అవసరముందన్నారు. దీంతోపాటే కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు రైతుల కోసం చేపట్టే కార్యక్రమాలను వివరించి, వారికి సాయపడేలా స్వచ్ఛంద కార్యకర్తలను సిద్ధం చేయాలన్నారు. ఆటోడెస్క్‌తో ఒప్పందం... గ్రామీణ సృజనలను వాణిజ్య స్థాయికి తీసుకొచ్చేందుకు వీలుగా ఎన్ఐఆర్డీ...అంతర్జాతీయ సంస్థ ఆటోడెస్క్‌తో అవగాహన ఒప్పం దం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా డిజైనింగ్, ప్రొటో టైపింగ్ లకు ఉపయోగపడే ఆటోడెస్క్ సాఫ్ట్‌వేర్‌ను ఎన్ఐఆర్డీకి ఉచితంగా అందజేస్తామని ఆటోడెస్క్ ససై్టనబిలిటీ ఫౌండేషన్ అధికారి జేక్ లేస్ తెలిపారు. గ్రామీణ స్థాయి ఇన్నోవేటర్స్, స్టార్టప్ కంపెనీలు వీటిద్వారా మెరుగైన ఉత్పత్తులను సిద్ధం చేయవచ్చన్నారు. సామాజిక ప్రభావం చూపగల ఆవిష్కరణలు, సేవల విషయంలో తాము ప్రపంచవ్యాప్తంగా అనేక స్టార్టప్ కంపెనీలకు చేయూత అందిస్తున్నామన్నారు. ఏటా దాదాపు 1.5 లక్షల డాలర్ల విలువైన సాఫ్ట్వేర్ ఉత్పత్తులను స్వచ్ఛంద సంస్థలు, స్టార్టప్స్, ఇన్నొవేటర్లకు ఉచితంగా అందజేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఎన్ఐఆర్డీ డైరెక్టర్ జనరల్ డబ్ల్యూ.ఆర్.రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సుజనాకు సుప్రీంలో చుక్కెదురు
* ‘మారిషస్’ రుణ బకాయిల కేసులో సుప్రీంను ఆశ్రయించిన సుజనా * పిటిషన్‌ను తోసిపుచ్చిన అత్యున్నత న్యాయస్థానం * ఇక మారిషస్ బ్యాంకుకు రూ.106 కోట్లు చెల్లించాల్సిందే! సాక్షి, న్యూఢిల్లీ: టీడీపీ ఎంపీ, కేంద్ర మంత్రి సుజనా చౌదరికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. మారిషస్ బ్యాంకు రుణ బకాయిల కేసులో ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది. మారిషస్ బ్యాంకుకు రూ.106 కోట్లు చెల్లించాలంటూ యూకే కోర్టు ఇచ్చిన డిక్రీ(తీర్పు)ని అమలుచేయొద్దని, తమకు వ్యతిరేకంగా హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేయాలని కోరుతూ సుజనా చౌదరికి చెందిన సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ శుక్రవారం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను న్యాయమూర్తులు జస్టిస్ కురియన్ జోసెఫ్, జస్టిస్ నారీమన్‌లతో కూడిన ధర్మాసనం తోసిపుచ్చింది. విచారణకు సుజనా గ్రూపు తరఫున సీనియర్ న్యాయవాది ఎం.ఎన్.రావు, మారిషస్ కమర్షియల్ బ్యాంకు(ఎంసీబీ) తరఫున సీనియర్ న్యాయవాదులు ధ్రువ్ మెహతా, వసీం బేగ్ హాజరయ్యారు. ఇదీ వివాదం సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ తమ అనుబంధ కంపెనీని హేస్టియా హోల్డింగ్స్ లిమిటెడ్ పేరుతో మారిషస్ దేశంలో ఏర్పా టు చేసింది. 2010లో మారిషస్ కమర్షియల్ బ్యాంకు(ఎంసీబీ) నుంచి హేస్టియా రూ.100 కోట్ల మేర రుణం తీసుకుంది. ఈ లావాదేవీలో సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ హామీదారుగా ఉంది. రుణానికి సంబంధించి ఎంసీబీకి, హేస్టియాకు మధ్య రాతపూర్వక ఒప్పందం కూడా జరిగింది. ఇంగ్లండ్ చట్టాలకు లోబడి దీనిని అమలు చేస్తున్నట్లు ఆ ఒప్పందంలో పేర్కొన్నారు. అయితే 2012 నుంచి హేస్టియా కంపెనీ బకాయిలు చెల్లించడం మానేసింది. బకాయిల విషయంలో స్పందించాలంటూ ఎంసీబీ లేఖలు రాసినా ఫలితం లేదు. ఈ నేపథ్యంలో గతంలో చేసుకున్న ఒప్పందానికి సవరణలు చేయాలంటూ హేస్టియా కోరడంతో ఎంసీబీ అంగీకరించింది. కానీ ఆ తర్వాత కూడా బకాయిలు చెల్లించకుండా ఒప్పందానికి మరోసారి సవరణలు చేయించింది. ఇదే సమయంలో ఎంసీబీ అధికారులు హేస్టియా డెరైక్టర్‌గా ఉన్న సుజనాచౌదరితో సంప్రదింపులు జరిపినా వ్యవహారం కొలిక్కిరాలేదు. దీంతో బకాయిలు చెల్లించేలా ఆదేశాలివ్వాలంటూ లండన్ కోర్టును ఎంసీబీ ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో ఇంగ్లిష్ కోర్టుల న్యాయపరిధిని సవాలు చేస్తూ హేస్టియా, సుజనా యూనివర్సల్ కంపెనీలు లండన్‌లోని క్వీన్స్ బెంచ్ కమర్షియల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం.. ఇక్కడి చట్టాలకు లోబడి చేసుకున్న ఒప్పందాల్లో జోక్యం చేసుకునే అధికారం ఇంగ్లండ్ కోర్టులకు ఉందని తేల్చిచెప్పింది. అంతేకాక వడ్డీ సహా రూ.105 కోట్లను, ఖర్చులు కింద మరో రూ.72 లక్షలను ఎంసీబీకి చెల్లించాలని ఆదేశించింది. ఈ తీర్పును సైతం హేస్టియా, సుజనా కంపెనీలు పట్టించుకోలేదు. దీంతో ఎంసీబీ హైదరాబాద్‌లోని సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించి లండన్ కోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని కోరింది. సిటీ సివిల్ కోర్టులో ఎంసీబీకి అనుకూలంగా తీర్పు వెలువడింది. దీనిపై హైకోర్టును ఆశ్రయించిగా అక్కడ కూడా ఇదే తీర్పు వచ్చింది. తాజాగా హైకోర్టు తీర్పుపై హేస్టియా సంస్థ శుక్రవారం స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయగా సుప్రీం కోర్టు కొట్టివేసింది. దీంతో మారిషస్ బ్యాంకుకు సుజనా సంస్థ రూ.106 కోట్లను చెల్లించక తప్పని పరిస్థితి ఏర్పడింది. -
పేరు.. ఊరు మార్చుకున్న ‘సుజన’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కేంద్ర మంత్రి సుజనా చౌదరికి చెందిన సుజన గ్రూపు కంపెనీల పేర్లు మారాయి. వీటితో పాటు కంపెనీ నమోదిత కార్యాలయాలను కూడా మారుస్తున్నారు. దీనికి సంబంధించి ఆయా కంపెనీల బోర్డులు మంగళవారం నిర్ణయం తీసుకున్నాయి. దీని ప్రకారం సుజన మెటల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌ను ఎస్ఎంపీఎల్గా మార్చి, కంపెనీ కార్యాలయాన్ని హైదరాబాద్ నుంచి మహారాష్ట్రకు తరలిస్తున్నారు. మారిషస్ బ్యాంకు నుంచి అప్పు తీసుకుని ఎగ్గొట్టి, వివాదంలో చిక్కుకున్న సుుజన యూనివర్సల్ ఇండస్ట్రీస్ పేరును ఎస్యూఐఎల్గా మార్చి, కంపెనీ కార్యాలయాన్ని హైదరాబాద్ నుంచి తమిళనాడుకు మారుస్తున్నారు. సుజన టవర్స్ లిమిటెడ్‌ను ఎస్టీఎల్గా మార్చి, కంపెనీ కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మరో చోటకి మార్చడానికి బోర్డు ఆమోదం తెలిపింది. -
మహిళలకు రిజర్వేషన్లు అవసరం లేదు
కేంద్ర మంత్రి సుజనాచౌదరి వ్యాఖ్య విజయవాడ(లబ్బీపేట)/గుంటూరు రూరల్ : మహిళలకు రిజర్వేషన్లు అవసరం లేదని, రిజర్వేషన్ పేరుతో కుర్చీపై స్టాంప్ వేసి మహిళలను కూర్చోపెట్టడం తప్పని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి వై.సుజనాచౌదరి వ్యాఖ్యానించారు. అన్ని రంగాల్లో మహిళలు రాణిస్తుంటే రిజర్వేషన్లు ఎందుకని, వాటికి తాను వ్యతిరేకినని ఆయన పేర్కొన్నారు. విజయవాడలోని మున్సిపల్ ఎంప్లాయీస్ కాలనీలో ఏర్పాటుచేసిన కాన్ఫెడరేషన్ ఆఫ్ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఆఫ్ ఇండియా ఏపీ చాప్టర్ కార్యాలయాన్ని శనివారం కేంద్ర మంత్రి సుజనాచౌదరి ప్రారంభించారు. -
డ్యాన్స్ చేయడానికి లేమిక్కడ
కేంద్రమంత్రి సుజనా చౌదరి వ్యాఖ్య సాక్షి, న్యూఢిల్లీ: తాము అధికారంలో ఉన్నది విపక్షం డెరైక్షన్‌లో డ్యాన్స్‌లు చేయడానికి కాదని కేంద్రమంత్రి సుజనా చౌదరి వ్యాఖ్యానించారు. విపక్షం చెప్పినట్టు నడుచుకోవడానికి ప్రజలు తీర్పు ఇవ్వలేదని, ప్రజాతీర్పు మేరకు ఐదేళ్లు నడుచుకోవాలన్నారు. ఏపీకి ప్రత్యేకహోదా డిమాండ్ విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటంపై స్పందిస్తూ కేంద్రమంత్రి ఢిల్లీలో శుక్రవారం ఇలా మాట్లాడారు. రాష్ట్ర విభజన చట్టంలోని అంశాలతో పాటు చట్టంలోలేని వాటిని సాధించడానికి ప్రభుత్వం కృషి చేస్తుండగా, విపక్ష పార్టీ స్కూల్లో అల్లరి పిల్లల్లా వ్యవహరిస్తోందన్నారు.షెడ్యూల్ 9, 10 లోని ఆస్తుల విషయాన్ని వచ్చే నెల 15వ తేదీ లోపు ఒక కొలిక్కి తెస్తామన్నారు. -
సామాజిక సేవ అదృష్టం
కేంద్ర మంత్రి సుజనాచౌదరి నరసింగపాలెం (ఆగిరిపల్లి) : సామాజిక సేవ చేయాలంటే అదృష్టం ఉండాలని కేంద్ర మంత్రి సుజనాచౌదరి అన్నారు. ఆగిరిపల్లి మండలం నరసింగపాలెం శివారు తోటపల్లిలోని హీల్ ప్యారడైజ్‌లో సిద్థార్థ కళాశాల పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా వైద్య శిబిరాన్ని శనివారం ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించి మాట్లాడారు. అనాథల సేవకు హీల్ సంస్థను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ప్రభుత్వాలతోపాటు తమ సుజనా ఫౌండేషన్ ద్వారా కూడా సహకారం అందిస్తానని చెప్పారు. విద్యార్థులతో కలిసి అల్పాహారం తీసుకున్నారు. వృత్తివిద్యా కేంద్రాన్ని ప్రారంభించారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ పీహెచ్సీ వైద్యుడిని వారానికి ఒకసారి హీల్‌కు వచ్చి వైద్య పరీక్షలు చేసేలా కృషి చేస్తానన్నారు. సంస్థకు తన వంతు సాయంగా రూ.లక్ష చెక్కును సంస్థ చైర్మన్ పిన్నమనేని ధనప్రకాశ్కు అందజేశారు. ఏలూరు ఎంపీ మాగంటి వెంకటేశ్వరరావు (బాబు) తన వంతు సాయంగా రూ.1 లక్షను అందజేస్తున్నట్లు ప్రకటించారు. టీడీపీ వైద్యవిభాగం నాయకులు సీఎల్ వెంకట్రావు రూ.లక్షను అందజేశారు. వైద్యశిబిరంలో వెయ్యి మందికి పైగా రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్, నూజివీడు టీడీపీ ఇన్చార్జి ముద్దరబోయిన వెంకటేశ్వరరావు, కాపా శ్రీనివాసరావు, తోటపల్లి సర్పంచి ఆరేపల్లి శ్రీనివాసరావు, హీల్ నిర్వాహకులు మలినేని రంగప్రసాద్, వైద్యులు అమ్మన్నా, సూరపనేని శరత్, కోనేరు విజయ్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. కామినేనికి ఆర్ఎంపీల వినతిపత్రం నరసింగపాలెం (ఆగిరిపల్లి): తమకు ప్రభుత్వ గుర్తింపు వచ్చేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఆరోగ్యశాఖా మంత్రి కామినేని శ్రీనివాస్‌కు ఆర్ఎంపీలు శనివారం వినతిపత్రాన్ని అందజేశారు. టీఎల్సీపీయూ జాతీయ అధ్యక్షులు సీఎల్ వెంకట్రావు, రాష్ట్ర అధ్యక్షులు జీఎన్జీ మూర్తి, మండల అధ్యక్షులు కె.రవిశంకర్ తదితరులు మంత్రిని కలిశారు. మంత్రి మాట్లాడుతూ ఆర్ఎంపీల ప్రభుత్వ గుర్తింపుపై రెండు రోజల క్రితం జీవో విడుదలైందని, మ్యానిఫెస్టో ప్రకారం వీరికి పరీక్షలను నిర్వహించి గుర్తింపు పత్రాలు ఇస్తామని తెలిపారు. సుజనా చౌద రి దృష్టికి కొల్లేరు సమస్యలు కైకలూరు : కొల్లేరు సమస్యలను కేంద్ర మంత్రి సుజనా చౌదరి దృష్టికి తీసుకెళ్లామని మాజీ ఎమ్మెల్యే, కైకలూరు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి జయమంగళ వెంకటరమణ తెలిపారు. విలేకరులతో ఆయన మాట్లాడుతూ విజయవాడలో సుజనాచౌదరిని కలిశానని చెప్పారు. కొల్లేరు ఆపరేషన్ సమయంలో ధ్వంసం చేసిన 7,500 ఎకరాల భూములను తిరిగి పంపిణీ చేయాలని, కైకలూరు నియోజవర్గానికి సాగు, తాగు నీటికి చర్యలు తీసుకోవాలని కోరామని వివరించారు. -
సమన్వయంతో సమగ్రాభివృద్ధి
శాస్త్ర సాంకేతిక పరిశోధన సంస్థ అవశ్యం పరిశ్రమల స్థాపనకు ఎమ్మెల్యేలు శ్రద్ధ తీసుకోవాలి కేంద్ర మంత్రి సుజనా చౌదరి విజయవాడ : అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేయాలని కేంద్ర శాస్త్ర సాంకేతిక సహాయ మంత్రి వై.సుజనాచౌదరి అన్నారు. బుధవారం మధ్యాహ్నం జిల్లా అభివృద్ధిపై అధికారులు, ప్రజాప్రతినిధులతో సబ్-కలెక్టర్ కార్యాలయంలో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. కేంద్ర మంత్రి మాట్లాడుతూ కొత్తగా ఏర్పడిన మన రాష్ట్రంలో సాంకేతిక పరిశోధన సంస్థ ఒక్కటి కూడా లేకపోవటం దురదృష్టకరమన్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో శాస్త్ర సాంకేతిక పరిశోధన సంస్థ ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. జిల్లాలో పరిశ్రమల స్థాపనకు ఆయా నియోజకవర్గాల శాసనసభ్యులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం అవసరమైన నిధులను మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు. పరిశ్రమల స్థాపనతో ఆయా ప్రాంతాల్లోని నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉందని, దీర్ఘకాలిక ప్రయోజనాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆలోచనమేరకు పరిశ్రమలు ఉండాలని మంత్రి సూచించారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడుకొని వాటిని ఆర్థికాభివృద్ధి కేంద్రాలు, ఆదాయ వనరుల కేంద్రాలుగా తీర్చిదిద్దాలని సుజనా సూచించారు. దుర్గగుడి ఫ్లైఓవర్‌కు ఈ నెలలోనే శంకుస్థాపన... రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ దుర్గగుడి ఫ్లైఓవర్ నిర్మాణానికి తక్కువ సమయంలో డీపీఆర్ అనుమతులు పొంది ఈ నెలలోనే శంకుస్థాపనకు సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. ఇబ్రహీంపట్నం ట్రక్ టెర్మినల్‌ను సద్వినియోగం చేసుకుని ఏ విధంగా ట్రాఫిక్ తగ్గించవచ్చో పరిశీలించాలని సీఆర్డీఏ కమిషనర్‌కు సూచించారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లాలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేచురోపతి యోగా ఏర్పాటుకు అవసరమైన 20 ఎకరాల భూమిని సమకూరిస్తే కేంద్ర నిధులతో ఏర్పాటు చేసుకోవచ్చని చెప్పారు. రాష్ట్ర బీసీ సంక్షేమం, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ మచిలీపట్నంలో గోల్డు కవరింగు పరిశ్రమలకు సాంకేతికపరమైన తోడ్పాటు అందిస్తే చైనా మార్కెట్‌ను మించి అభివృద్ధి సాధించవచ్చని సూచించారు. బందరు ఎంపీ కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ స్నోబార్ డ్రైవింగ్ ఇన్స్టిట్యూట్ మచిలీపట్నంలో ఏర్పాటు చేస్తే పర్యాటక రంగంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందన్నారు. విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్రం నుంచి రాష్ట్రానికి కష్టసమయంలో రూ.8,500 కోట్లు తీసుకు రావటంలో కేంద్ర మంత్రి సుజనా చౌదరి కృషి చేశారని అభినందించారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ గద్దె అనూరాధ మాట్లాడుతూ నగరంలో అందుబాటులో ఉన్న జిల్లా పరిషత్ భూమిని వినియోగించుకోవాలని మంత్రిని కోరారు. సమావేశంలో ఏలూరు ఎంపీ మాగంటి వెంకటేశ్వరరావు (బాబు), ఎమ్మెల్యేలు గద్దె రామ్మెహన్, బొండా ఉమామహేశ్వరరావు, జలీల్‌ఖాన్, బోడే ప్రసాద్, వల్లభనేని వంశీ, శ్రీరాం తాతయ్య, తంగిరాల సౌమ్య, ఎమ్మెల్సీలు బొడ్డు నాగేశ్వరరావు, ఎ.రామకృష్ణ పలు ప్రధాన సమస్యలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ గంధం చంద్రుడు, అభివృద్ధి కార్యక్రమాలపై నివేదికను అందజేశారు. నగర మేయర్ కోనేరు శ్రీధర్, సీఆర్డీఏ కమిషనర్ ఎన్.శ్రీకాంత్, నగరపాలక సంస్థ కమిషనర్ వీరపాండియన్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.