సామాజిక సేవ అదృష్టం
కేంద్ర మంత్రి సుజనాచౌదరి
నరసింగపాలెం (ఆగిరిపల్లి) : సామాజిక సేవ చేయాలంటే అదృష్టం ఉండాలని కేంద్ర మంత్రి సుజనాచౌదరి అన్నారు. ఆగిరిపల్లి మండలం నరసింగపాలెం శివారు తోటపల్లిలోని హీల్ ప్యారడైజ్‌లో సిద్థార్థ కళాశాల పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా వైద్య శిబిరాన్ని శనివారం ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించి మాట్లాడారు. అనాథల సేవకు హీల్ సంస్థను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ప్రభుత్వాలతోపాటు తమ సుజనా ఫౌండేషన్ ద్వారా కూడా సహకారం అందిస్తానని చెప్పారు. విద్యార్థులతో కలిసి అల్పాహారం తీసుకున్నారు. వృత్తివిద్యా కేంద్రాన్ని ప్రారంభించారు.
రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ పీహెచ్‌సీ వైద్యుడిని వారానికి ఒకసారి హీల్‌కు వచ్చి వైద్య పరీక్షలు చేసేలా కృషి చేస్తానన్నారు. సంస్థకు తన వంతు సాయంగా రూ.లక్ష చెక్కును సంస్థ చైర్మన్ పిన్నమనేని ధనప్రకాశ్‌కు అందజేశారు. ఏలూరు ఎంపీ మాగంటి వెంకటేశ్వరరావు (బాబు) తన వంతు సాయంగా రూ.1 లక్షను అందజేస్తున్నట్లు ప్రకటించారు. టీడీపీ వైద్యవిభాగం నాయకులు సీఎల్ వెంకట్రావు రూ.లక్షను అందజేశారు.
వైద్యశిబిరంలో వెయ్యి మందికి పైగా రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్, నూజివీడు టీడీపీ ఇన్‌చార్జి ముద్దరబోయిన వెంకటేశ్వరరావు, కాపా శ్రీనివాసరావు, తోటపల్లి సర్పంచి ఆరేపల్లి శ్రీనివాసరావు, హీల్ నిర్వాహకులు మలినేని రంగప్రసాద్, వైద్యులు అమ్మన్నా, సూరపనేని శరత్, కోనేరు విజయ్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.
కామినేనికి ఆర్‌ఎంపీల వినతిపత్రం
నరసింగపాలెం (ఆగిరిపల్లి): తమకు ప్రభుత్వ గుర్తింపు వచ్చేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఆరోగ్యశాఖా మంత్రి కామినేని శ్రీనివాస్‌కు ఆర్‌ఎంపీలు శనివారం వినతిపత్రాన్ని అందజేశారు. టీఎల్‌సీపీయూ జాతీయ అధ్యక్షులు సీఎల్ వెంకట్రావు, రాష్ట్ర అధ్యక్షులు జీఎన్‌జీ మూర్తి, మండల అధ్యక్షులు కె.రవిశంకర్ తదితరులు మంత్రిని కలిశారు. మంత్రి మాట్లాడుతూ ఆర్‌ఎంపీల ప్రభుత్వ గుర్తింపుపై రెండు రోజల క్రితం జీవో విడుదలైందని, మ్యానిఫెస్టో ప్రకారం వీరికి పరీక్షలను నిర్వహించి గుర్తింపు పత్రాలు ఇస్తామని తెలిపారు.
సుజనా చౌద రి దృష్టికి కొల్లేరు సమస్యలు
కైకలూరు : కొల్లేరు సమస్యలను కేంద్ర మంత్రి సుజనా చౌదరి దృష్టికి తీసుకెళ్లామని మాజీ ఎమ్మెల్యే, కైకలూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి జయమంగళ వెంకటరమణ తెలిపారు. విలేకరులతో ఆయన మాట్లాడుతూ విజయవాడలో సుజనాచౌదరిని కలిశానని చెప్పారు. కొల్లేరు ఆపరేషన్ సమయంలో ధ్వంసం చేసిన 7,500 ఎకరాల భూములను తిరిగి పంపిణీ చేయాలని, కైకలూరు నియోజవర్గానికి సాగు, తాగు నీటికి చర్యలు తీసుకోవాలని కోరామని వివరించారు.