శాస్త్ర సాంకేతిక పరిశోధన సంస్థ అవశ్యం
పరిశ్రమల స్థాపనకు ఎమ్మెల్యేలు శ్రద్ధ తీసుకోవాలి
కేంద్ర మంత్రి సుజనా చౌదరి
విజయవాడ : అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేయాలని కేంద్ర శాస్త్ర సాంకేతిక సహాయ మంత్రి వై.సుజనాచౌదరి అన్నారు. బుధవారం మధ్యాహ్నం జిల్లా అభివృద్ధిపై అధికారులు, ప్రజాప్రతినిధులతో సబ్-కలెక్టర్ కార్యాలయంలో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. కేంద్ర మంత్రి మాట్లాడుతూ కొత్తగా ఏర్పడిన మన రాష్ట్రంలో సాంకేతిక పరిశోధన సంస్థ ఒక్కటి కూడా లేకపోవటం దురదృష్టకరమన్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో శాస్త్ర సాంకేతిక పరిశోధన సంస్థ ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
జిల్లాలో పరిశ్రమల స్థాపనకు ఆయా నియోజకవర్గాల శాసనసభ్యులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం అవసరమైన నిధులను మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు. పరిశ్రమల స్థాపనతో ఆయా ప్రాంతాల్లోని నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉందని, దీర్ఘకాలిక ప్రయోజనాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆలోచనమేరకు పరిశ్రమలు ఉండాలని మంత్రి సూచించారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడుకొని వాటిని ఆర్థికాభివృద్ధి కేంద్రాలు, ఆదాయ వనరుల కేంద్రాలుగా తీర్చిదిద్దాలని సుజనా సూచించారు.
దుర్గగుడి ఫ్లైఓవర్‌కు ఈ నెలలోనే శంకుస్థాపన...
రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ దుర్గగుడి ఫ్లైఓవర్ నిర్మాణానికి తక్కువ సమయంలో డీపీఆర్ అనుమతులు పొంది ఈ నెలలోనే శంకుస్థాపనకు సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. ఇబ్రహీంపట్నం ట్రక్ టెర్మినల్‌ను సద్వినియోగం చేసుకుని ఏ విధంగా ట్రాఫిక్ తగ్గించవచ్చో పరిశీలించాలని సీఆర్‌డీఏ కమిషనర్‌కు సూచించారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లాలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నేచురోపతి యోగా ఏర్పాటుకు అవసరమైన 20 ఎకరాల భూమిని సమకూరిస్తే కేంద్ర నిధులతో ఏర్పాటు చేసుకోవచ్చని చెప్పారు.
రాష్ట్ర బీసీ సంక్షేమం, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ మచిలీపట్నంలో గోల్డు కవరింగు పరిశ్రమలకు సాంకేతికపరమైన తోడ్పాటు అందిస్తే చైనా మార్కెట్‌ను మించి అభివృద్ధి సాధించవచ్చని సూచించారు. బందరు ఎంపీ కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ స్నోబార్ డ్రైవింగ్ ఇన్‌స్టిట్యూట్ మచిలీపట్నంలో ఏర్పాటు చేస్తే పర్యాటక రంగంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందన్నారు. విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్రం నుంచి రాష్ట్రానికి కష్టసమయంలో రూ.8,500 కోట్లు తీసుకు రావటంలో కేంద్ర మంత్రి సుజనా చౌదరి కృషి చేశారని అభినందించారు.
జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ మాట్లాడుతూ నగరంలో అందుబాటులో ఉన్న జిల్లా పరిషత్ భూమిని వినియోగించుకోవాలని మంత్రిని కోరారు. సమావేశంలో ఏలూరు ఎంపీ మాగంటి వెంకటేశ్వరరావు (బాబు), ఎమ్మెల్యేలు గద్దె రామ్మెహన్, బొండా ఉమామహేశ్వరరావు, జలీల్‌ఖాన్, బోడే ప్రసాద్, వల్లభనేని వంశీ, శ్రీరాం తాతయ్య, తంగిరాల సౌమ్య, ఎమ్మెల్సీలు బొడ్డు నాగేశ్వరరావు, ఎ.రామకృష్ణ పలు ప్రధాన సమస్యలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జ్ కలెక్టర్ గంధం చంద్రుడు, అభివృద్ధి కార్యక్రమాలపై నివేదికను అందజేశారు. నగర మేయర్ కోనేరు శ్రీధర్, సీఆర్‌డీఏ కమిషనర్ ఎన్.శ్రీకాంత్, నగరపాలక సంస్థ కమిషనర్ వీరపాండియన్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
సమన్వయంతో సమగ్రాభివృద్ధి
Published Thu, Apr 9 2015 3:32 AM | Last Updated on Sun, Sep 3 2017 12:02 AM
Advertisement