Overall development
-
హామీలు మాఫీ!
జూలై నాటికి జిల్లాలో 35 టీఎంసీల నీరు నిల్వ చేస్తామమని హామీ అతీగతీలేని అపెరల్, టెక్స్టైల్, ఫుడ్ పార్క్ ఉక్కు పరిశ్రమ ఊసే లేదు పెండింగ్ పనులు ఎక్కడివక్కడే రూ.93 కోట్ల పరిహారం కోసం రైతన్నల ఎదురు చూపు ‘నీరు-చెట్టు’లో పాల్గొనడానికి నేడు జిల్లాకు వస్తున్న సీఎం సాక్షి ప్రతినిధి, కడప : ‘జిల్లాను సమగ్రాభివృద్ధి చేస్తాం. ఉక్కు పరిశ్రమ నెలకొల్పుతాం. ఇక్కడి పండ్ల తోటల్ని దృష్టిలో ఉంచుకొని మెగా ఫుడ్‌పార్క్ ఏర్పాటు చేస్తాం. టెర్మినల్ మార్కెట్, రాజంపేటలో హార్టికల్చర్ యూనివర్శిటీ ఏర్పాటు చేస్తాం. చేనేతల కోసం మైలవరంలో టెక్స్టైల్స్ పార్క్, ప్రొద్దుటూరులో అఫెరల్ పార్క్ ప్రారంభిస్తాం. తాళ్లపాక అన్నమయ్య, ఒంటిమిట్ట, పెద్దదర్గా, దేవుని కడప, గండికోటలను కలుపుతూ ఫిలిగ్రిమ్ సర్క్యూట్ ఏర్పాటు చేస్తాం. సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి, జూలై నాటికి గండికోట, మైలవరం ప్రాజెక్టుల్లో 35 టీఎంసీల నీరు నిల్వ చేస్తాం. ఇందుకు అవసరమైతే కాలువ గట్లపై నిద్రిస్తా. కడప-ైచె న్నై రహదారిని నాలుగు లైన్లుగా విస్తరించడంతో పాటు ఏపిఐఐసీ భూముల్లో పరిశ్రమలు నెలకొల్పుతాం. కడపలో ఉర్దూ యూనివర్సిటీ నెలకొల్పుతాం. రూ.50 కోట్లతో ఒంటిమిట్ట దేవాలయాన్ని అభివృద్ధి చేస్తాం. రూ.34 కోట్లతో సోమశిల బ్యాక్ వాటర్‌ను ఒంటిమిట్ట చెరువుకు తెస్తాం.’ -ఇవన్నీ ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లాకు ప్రకటించిన వరాలు ముఖ్యమంత్రి ప్రకటించిన హామీలు ఆచరణలో ఒక్కటంటే ఒక్కటి కూడ అమలుకు నోచుకోలేదు. ఇప్పటికే మూడు పర్యాయాలు జిల్లాలో పర్యటించిన సీఎం.. వరుసగా హామీలు గుప్పిస్తూ వెళ్తున్నారే కానీ వాటిని నెరవేర్చడంపై దృష్టి సారించడం లేదు. అన్ని హంగులతో ఏర్పాటైన విమానాశ్రయం ప్రారంభోత్సవానికి మీనమేషాలు లెక్కిస్తున్నారు. జిల్లా పట్ల రాజకీయ వివక్ష కారణంగానే ప్రభుత్వ వైఖరి అలా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. మూడు దశాబ్దాలకు పైగా వివక్షకు గురైన జిల్లాకు మరోమారు ‘చంద్ర’గ్రహణం పట్టింది. పారిశ్రామిక ప్రగతికి అవసరమైన మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నా నిష్ర్పయోజనమే అవుతోంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఇప్పటి ప్రభుత్వం వైఎస్సార్ జిల్లాను అప్రాధాన్యత జాబితాలో చేర్చారనే అభిప్రాయం జిల్లా వాసుల్లో వ్యక్తమవుతోంది. ప్రభుత్వ తీరు, జిల్లాలో పాలన యంత్రాంగం వైఖరే ఇందుకు నిదర్శనం. రూ.99 కోట్ల పరిహారం కోసం ఎదురు చూపులు జిల్లాలోని రైతాంగానికి వివిధ రూపాల్లో రూ. 99 కోట్లు పరిహారం అందాల్సి ఉంది. ఆ పరిహారం కోసం 2011 నుంచి కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. 2011లో ఇన్పుట్ సబ్సిడీ రూ.2.69 కోట్లు, 2012-13 గాను రూ.2.17 కోట్లు అందాల్సి ఉంది. పంటల బీమా పథకం ద్వారా 2012 ఖరీఫ్‌కుగాను రూ.30 కోట్లు, రబీ సీజన్‌కు రూ.8.72 కోట్లు, 2013 ఖరీఫ్ సీజన్‌కు రూ.52.33 కోట్లు, రబీ సీజన్‌కు రూ.3.22 కోట్లు మొత్తం రూ.99.08 కోట్లు జిల్లాకు పరిహారం అందాల్సి ఉంది. పాలకుల నిర్లక్ష్యం కారణంగా ప్రీమియం చెల్లించిన రైతులు పరిహారం కోసం ఎదురు చూస్తున్నారు. ఓవైపు ఉన్న భూముల్లో పరిశ్రమలు నెలకొల్పే పరిస్థితి లేకపోయినా మూడు లక్షల ఎకరాల భూసేకరణ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే పరిశ్రమల కోసం సుమారు ఏడు వేల ఎకరాలు సిద్ధం చేశారు. గండికోటకు జూలైలో నీరు వచ్చేనా? జూలై నాటికి గండికోట, మైలవరంలో 35 టీఎంసీల నీరు నిల్వ చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు ఫిబ్రవరి 27న గండికోట ప్రాజెక్టు సందర్శించిన సమయంలో ప్రకటించారు. కాలువ గట్లపై నిద్రించి అయినా పనులు పూర్తి చేయించి నీరు తీసుకువస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించడంతో జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేశారు. టీడీపీ నేతలైతే.. అప్పుడే నీళ్లు వచ్చినట్లుగా సంబరపడిపోయారు. 95 శాతం పనులు పూర్తి అయిన జీఎన్ఎస్ఎస్ ఫేజ్-1 ఫలితమివ్వబోతోందని జిల్లావాసులు ఆశించారు. అయితే ఇందుకు బడ్జెట్లో రూ.169 కోట్లు మాత్రమే కేటాయించడంతో జిల్లా వాసుల ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా గంపెడు మట్టి తీసింది లేదు. నీళ్లొచ్చే కాలువలో అడ్డంకులను తొలగించింది లేదు. కనీసం ఒక్కసారి కూడా సమీక్ష నిర్వహించలేదు. జిల్లాలో మైనర్ , మీడియం ఇరిగేషన్ పరిధిలో 1.71 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంటే ఒక్క ఎకరాకు నీరు అందలేదు. ‘నీరు-చెట్టు’ కార్యక్రమంలో పాల్గొనడానికి నేడు కమలాపురం వస్తున్న సీఎం.. ఇప్పుడైనా ఈ హామీలపై దృష్టి సారించాలని జిల్లా వాసులు కోరుతున్నారు. సీఎం పర్యటన ఇలా.. కడప సెవెన్‌రోడ్స్ : రాష్ర్ట ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శుక్రవారం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 8 గంటలకు చిత్తూరు జిల్లా మదనపల్లె నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 10.30 గంటలకు వీరపునాయునిపల్లె మండలం సర్వరాయసాగర్‌కు చేరుకుంటారు. 10.45 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు రిజర్వాయర్‌ను పరిశీలించి.. ఇరిగేషన్ అధికారులు, ఏజెన్సీ ప్రతినిధులతో సమావేశమవుతారు. అక్కడ ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను తిలకిస్తారు. అనంతరం ఆయకట్టు రైతులతో మాట్లాడతారు. మధ్యాహ్నం 1 గంట నుంచి 1.30 గంటల వరకు లంచ్ బ్రేక్. 1.30 గంటలకు హెలికాఫ్టర్ లేదా రోడ్డు మార్గంలో బయలుదేరి 2 గంటలకు కమలాపురం మండలం చదిపిరాళ్ల గ్రామం చేరుకుంటారు. మధ్యాహ్నం 3 గంటల వరకు గ్రామంలోని చెరువులో పూడికతీత పనులను పరిశీలిస్తారు. 3 గంటలకు అక్కడి నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి 3.15 గంటలకు కమలాపురం చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన ‘నీరు-చెట్టు’ అవగాహన సదస్సులో పాల్గొంటారు. అక్కడి నుంచి సాయంత్రం 5 గంటలకు బయలుదేరి 5.15 గంటలకు కడప విమానాశ్రయం చేరుకుంటారు. 5.30 గంటలకు కడప ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక ఎయిర్ క్రాఫ్ట్‌లో హైదరాబాద్ వెళ్తారని డీఆర్వో సులోచన ఒక ప్రకటనలో తెలిపారు. -
సమన్వయంతో సమగ్రాభివృద్ధి
శాస్త్ర సాంకేతిక పరిశోధన సంస్థ అవశ్యం పరిశ్రమల స్థాపనకు ఎమ్మెల్యేలు శ్రద్ధ తీసుకోవాలి కేంద్ర మంత్రి సుజనా చౌదరి విజయవాడ : అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేయాలని కేంద్ర శాస్త్ర సాంకేతిక సహాయ మంత్రి వై.సుజనాచౌదరి అన్నారు. బుధవారం మధ్యాహ్నం జిల్లా అభివృద్ధిపై అధికారులు, ప్రజాప్రతినిధులతో సబ్-కలెక్టర్ కార్యాలయంలో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. కేంద్ర మంత్రి మాట్లాడుతూ కొత్తగా ఏర్పడిన మన రాష్ట్రంలో సాంకేతిక పరిశోధన సంస్థ ఒక్కటి కూడా లేకపోవటం దురదృష్టకరమన్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో శాస్త్ర సాంకేతిక పరిశోధన సంస్థ ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. జిల్లాలో పరిశ్రమల స్థాపనకు ఆయా నియోజకవర్గాల శాసనసభ్యులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం అవసరమైన నిధులను మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు. పరిశ్రమల స్థాపనతో ఆయా ప్రాంతాల్లోని నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉందని, దీర్ఘకాలిక ప్రయోజనాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆలోచనమేరకు పరిశ్రమలు ఉండాలని మంత్రి సూచించారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడుకొని వాటిని ఆర్థికాభివృద్ధి కేంద్రాలు, ఆదాయ వనరుల కేంద్రాలుగా తీర్చిదిద్దాలని సుజనా సూచించారు. దుర్గగుడి ఫ్లైఓవర్‌కు ఈ నెలలోనే శంకుస్థాపన... రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ దుర్గగుడి ఫ్లైఓవర్ నిర్మాణానికి తక్కువ సమయంలో డీపీఆర్ అనుమతులు పొంది ఈ నెలలోనే శంకుస్థాపనకు సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. ఇబ్రహీంపట్నం ట్రక్ టెర్మినల్‌ను సద్వినియోగం చేసుకుని ఏ విధంగా ట్రాఫిక్ తగ్గించవచ్చో పరిశీలించాలని సీఆర్డీఏ కమిషనర్‌కు సూచించారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లాలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేచురోపతి యోగా ఏర్పాటుకు అవసరమైన 20 ఎకరాల భూమిని సమకూరిస్తే కేంద్ర నిధులతో ఏర్పాటు చేసుకోవచ్చని చెప్పారు. రాష్ట్ర బీసీ సంక్షేమం, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ మచిలీపట్నంలో గోల్డు కవరింగు పరిశ్రమలకు సాంకేతికపరమైన తోడ్పాటు అందిస్తే చైనా మార్కెట్‌ను మించి అభివృద్ధి సాధించవచ్చని సూచించారు. బందరు ఎంపీ కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ స్నోబార్ డ్రైవింగ్ ఇన్స్టిట్యూట్ మచిలీపట్నంలో ఏర్పాటు చేస్తే పర్యాటక రంగంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందన్నారు. విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్రం నుంచి రాష్ట్రానికి కష్టసమయంలో రూ.8,500 కోట్లు తీసుకు రావటంలో కేంద్ర మంత్రి సుజనా చౌదరి కృషి చేశారని అభినందించారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ గద్దె అనూరాధ మాట్లాడుతూ నగరంలో అందుబాటులో ఉన్న జిల్లా పరిషత్ భూమిని వినియోగించుకోవాలని మంత్రిని కోరారు. సమావేశంలో ఏలూరు ఎంపీ మాగంటి వెంకటేశ్వరరావు (బాబు), ఎమ్మెల్యేలు గద్దె రామ్మెహన్, బొండా ఉమామహేశ్వరరావు, జలీల్‌ఖాన్, బోడే ప్రసాద్, వల్లభనేని వంశీ, శ్రీరాం తాతయ్య, తంగిరాల సౌమ్య, ఎమ్మెల్సీలు బొడ్డు నాగేశ్వరరావు, ఎ.రామకృష్ణ పలు ప్రధాన సమస్యలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ గంధం చంద్రుడు, అభివృద్ధి కార్యక్రమాలపై నివేదికను అందజేశారు. నగర మేయర్ కోనేరు శ్రీధర్, సీఆర్డీఏ కమిషనర్ ఎన్.శ్రీకాంత్, నగరపాలక సంస్థ కమిషనర్ వీరపాండియన్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
తెలంగాణ సమగ్రాభివృద్ధికి ప్రణాళిక!
ఐదేళ్లకు సరిపడా ప్రత్యేక ప్రణాళిక అమలు ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ మేధో మథనం. హైదరాబాద్: వచ్చే ఐదేళ్లలో తెలంగాణ రాష్ర్ట సమగ్రాభివృద్ధికి అమలు చేయాల్సిన ప్రణాళికపై ప్రభుత్వం దృష్టి సారించింది. కొత్త రాష్ట్రం.. కొత్త జీవితం.. కొత్త పంథాలో నడవడానికి వీలుగా అడుగులు వేస్తోంది. ప్రణాళికపై చర్చించడానికి ఈనెల 7వ తేదీన ప్రత్యేక సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు బుధవారం ఎంసీఆర్హెచ్ఆర్డీలో ప్రత్యేకంగా సమావేశమై ఉన్నతాధికారులతో మేధో మథనం చేశారు. తెలంగాణ సమగ్ర అభివృద్ధి కోసం ప్రణాళికలను రూపొందించాలని, 7న సమావేశం నిర్వహించాలని అధికారులకు సూచించారు. రాష్ట్రం మొత్తం ఒకే విధానం, ఒకే పద్ధతి కాకుండా ఆయా ప్రాంతాలు, జిల్లాలు, మండలాలు, గ్రామస్థాయి వరకు అభివృద్దికి ప్రణాళికలను రూపొందించాలని సీఎం సూచించారు. ఆంధ్రప్రదేశ్ దృక్పథంతో అమలవుతున్న పథకాలు, చట్టాలు, విధానాల్లో మార్పులను తీసుకువచ్చి తెలంగాణకు అనుగుణంగా మార్చాలని అధికారులకు చెప్పారు. భూ పంపిణీని సమర్థవంతంగా అమలు చేయడానికి 500 మంది అధికారులతో ప్రత్యేక బ్రిగేడ్‌ను ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. అవినీతిని జీరోస్థాయికి తీసుకురావాలన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు, జాయింట్ కలెక్టర్ల సం ఖ్య పెంపు, విద్య, వైద్యం, సంక్షేమంలాంటి అంశాలపై చర్చించారు. పునర్నిర్మాణానికి ఎంసీఆర్హెచ్ఆర్డీ వేదిక కావాలి గ్రామస్థాయి నుంచి ఉన్నతస్థాయి వరకు ఉండే ఉద్యోగులు, ఉన్నతాధికారులకు శిక్షణనిచ్చే మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (ఎంసీఆర్హెచ్ఆర్డీ) తెలంగాణ పునర్నిర్మాణానికి వేదిక కావాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆకాంక్షించారు. సర్పం చుల నుంచి ఐఏఎస్ అధికారుల వరకు ఇందులోనే శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. బుధవారం ఎంసీఆర్హెచ్ఆర్డీని కేసీఆర్ సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి పరిసరాలను పరిశీలించేందుకు అధికారులు వాహనాలను సిద్ధం చేసినా, వద్దని ప్రాంగణమంతా అరగంటపాటు కాలినడకనే తిరిగారు.