తెలంగాణ సమగ్రాభివృద్ధికి ప్రణాళిక!
ఐదేళ్లకు సరిపడా ప్రత్యేక ప్రణాళిక అమలు ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ మేధో మథనం.
హైదరాబాద్: వచ్చే ఐదేళ్లలో తెలంగాణ రాష్ర్ట సమగ్రాభివృద్ధికి అమలు చేయాల్సిన ప్రణాళికపై ప్రభుత్వం దృష్టి సారించింది. కొత్త రాష్ట్రం.. కొత్త జీవితం.. కొత్త పంథాలో నడవడానికి వీలుగా అడుగులు వేస్తోంది. ప్రణాళికపై చర్చించడానికి ఈనెల 7వ తేదీన ప్రత్యేక సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు బుధవారం ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో ప్రత్యేకంగా సమావేశమై ఉన్నతాధికారులతో మేధో మథనం చేశారు. తెలంగాణ సమగ్ర అభివృద్ధి కోసం ప్రణాళికలను రూపొందించాలని, 7న సమావేశం నిర్వహించాలని అధికారులకు సూచించారు. రాష్ట్రం మొత్తం ఒకే విధానం, ఒకే పద్ధతి కాకుండా ఆయా ప్రాంతాలు, జిల్లాలు, మండలాలు, గ్రామస్థాయి వరకు అభివృద్దికి ప్రణాళికలను రూపొందించాలని సీఎం సూచించారు. ఆంధ్రప్రదేశ్ దృక్పథంతో అమలవుతున్న పథకాలు, చట్టాలు, విధానాల్లో మార్పులను తీసుకువచ్చి తెలంగాణకు అనుగుణంగా మార్చాలని అధికారులకు చెప్పారు. భూ పంపిణీని సమర్థవంతంగా అమలు చేయడానికి 500 మంది అధికారులతో ప్రత్యేక బ్రిగేడ్‌ను ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. అవినీతిని జీరోస్థాయికి తీసుకురావాలన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు, జాయింట్ కలెక్టర్ల సం ఖ్య పెంపు, విద్య, వైద్యం, సంక్షేమంలాంటి అంశాలపై చర్చించారు.
పునర్నిర్మాణానికి ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ వేదిక కావాలి
గ్రామస్థాయి నుంచి ఉన్నతస్థాయి వరకు ఉండే ఉద్యోగులు, ఉన్నతాధికారులకు శిక్షణనిచ్చే మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ) తెలంగాణ పునర్నిర్మాణానికి వేదిక కావాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆకాంక్షించారు. సర్పం చుల నుంచి ఐఏఎస్ అధికారుల వరకు ఇందులోనే శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. బుధవారం ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీని కేసీఆర్ సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి పరిసరాలను పరిశీలించేందుకు అధికారులు వాహనాలను సిద్ధం చేసినా, వద్దని ప్రాంగణమంతా అరగంటపాటు కాలినడకనే తిరిగారు.