సుజనాకు సుప్రీంలో చుక్కెదురు | Sujana Chowdary reacts on Sakshi reports | Sakshi
Sakshi News home page

సుజనాకు సుప్రీంలో చుక్కెదురు

Published Sat, Mar 5 2016 3:03 AM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM

సుజనాకు సుప్రీంలో చుక్కెదురు - Sakshi

సుజనాకు సుప్రీంలో చుక్కెదురు

* ‘మారిషస్’ రుణ బకాయిల కేసులో సుప్రీంను ఆశ్రయించిన సుజనా
* పిటిషన్‌ను తోసిపుచ్చిన అత్యున్నత న్యాయస్థానం
* ఇక మారిషస్ బ్యాంకుకు రూ.106 కోట్లు చెల్లించాల్సిందే!

సాక్షి, న్యూఢిల్లీ: టీడీపీ ఎంపీ, కేంద్ర మంత్రి సుజనా చౌదరికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. మారిషస్ బ్యాంకు రుణ బకాయిల కేసులో ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది.

మారిషస్ బ్యాంకుకు రూ.106 కోట్లు చెల్లించాలంటూ యూకే కోర్టు ఇచ్చిన డిక్రీ(తీర్పు)ని అమలుచేయొద్దని, తమకు వ్యతిరేకంగా హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేయాలని కోరుతూ సుజనా చౌదరికి చెందిన సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ శుక్రవారం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను న్యాయమూర్తులు జస్టిస్ కురియన్ జోసెఫ్, జస్టిస్ నారీమన్‌లతో కూడిన ధర్మాసనం తోసిపుచ్చింది. విచారణకు సుజనా గ్రూపు తరఫున సీనియర్ న్యాయవాది ఎం.ఎన్.రావు, మారిషస్ కమర్షియల్ బ్యాంకు(ఎంసీబీ) తరఫున సీనియర్ న్యాయవాదులు ధ్రువ్ మెహతా, వసీం బేగ్ హాజరయ్యారు.
 
ఇదీ వివాదం
సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ తమ అనుబంధ కంపెనీని హేస్టియా హోల్డింగ్స్ లిమిటెడ్ పేరుతో మారిషస్ దేశంలో ఏర్పా టు చేసింది. 2010లో మారిషస్ కమర్షియల్ బ్యాంకు(ఎంసీబీ) నుంచి హేస్టియా రూ.100 కోట్ల మేర రుణం తీసుకుంది. ఈ లావాదేవీలో సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ హామీదారుగా ఉంది. రుణానికి సంబంధించి ఎంసీబీకి, హేస్టియాకు మధ్య రాతపూర్వక ఒప్పందం కూడా జరిగింది. ఇంగ్లండ్ చట్టాలకు లోబడి దీనిని అమలు చేస్తున్నట్లు ఆ ఒప్పందంలో పేర్కొన్నారు. అయితే 2012 నుంచి హేస్టియా కంపెనీ బకాయిలు చెల్లించడం మానేసింది.

బకాయిల విషయంలో స్పందించాలంటూ ఎంసీబీ లేఖలు రాసినా ఫలితం లేదు. ఈ నేపథ్యంలో గతంలో చేసుకున్న ఒప్పందానికి సవరణలు చేయాలంటూ హేస్టియా కోరడంతో ఎంసీబీ అంగీకరించింది. కానీ ఆ తర్వాత కూడా బకాయిలు చెల్లించకుండా ఒప్పందానికి మరోసారి సవరణలు చేయించింది. ఇదే సమయంలో ఎంసీబీ అధికారులు హేస్టియా డెరైక్టర్‌గా ఉన్న సుజనాచౌదరితో సంప్రదింపులు జరిపినా వ్యవహారం కొలిక్కిరాలేదు. దీంతో బకాయిలు చెల్లించేలా ఆదేశాలివ్వాలంటూ లండన్ కోర్టును ఎంసీబీ ఆశ్రయించింది.

ఈ నేపథ్యంలో ఇంగ్లిష్ కోర్టుల న్యాయపరిధిని సవాలు చేస్తూ హేస్టియా, సుజనా యూనివర్సల్ కంపెనీలు లండన్‌లోని క్వీన్స్ బెంచ్ కమర్షియల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం.. ఇక్కడి చట్టాలకు లోబడి చేసుకున్న ఒప్పందాల్లో జోక్యం చేసుకునే అధికారం ఇంగ్లండ్ కోర్టులకు ఉందని తేల్చిచెప్పింది. అంతేకాక వడ్డీ సహా రూ.105 కోట్లను, ఖర్చులు కింద మరో రూ.72 లక్షలను ఎంసీబీకి చెల్లించాలని ఆదేశించింది. ఈ తీర్పును సైతం హేస్టియా, సుజనా కంపెనీలు పట్టించుకోలేదు.

దీంతో ఎంసీబీ హైదరాబాద్‌లోని సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించి లండన్ కోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని కోరింది. సిటీ సివిల్ కోర్టులో ఎంసీబీకి అనుకూలంగా తీర్పు వెలువడింది. దీనిపై హైకోర్టును ఆశ్రయించిగా అక్కడ కూడా ఇదే తీర్పు వచ్చింది. తాజాగా హైకోర్టు తీర్పుపై హేస్టియా సంస్థ శుక్రవారం స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయగా సుప్రీం కోర్టు కొట్టివేసింది. దీంతో మారిషస్ బ్యాంకుకు సుజనా సంస్థ రూ.106 కోట్లను చెల్లించక తప్పని పరిస్థితి ఏర్పడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement