ఢిల్లీకి చేరిన కారు పార్కింగ్ గొడవ
నగరంలో నైజీరియన్ దేశస్తుడిపై దాడి
కేసు నమోదు.. ఒకరి అరెస్టు
ఘటనపై ప్రభుత్వాన్ని నివేదిక కోరిన కేంద్ర మంత్రి సుష్మ
బంజారాహిల్స్: ఇంటి ముందు అక్రమంగా కారు పార్కింగ్ చేయడమే కాకుండా తీయమని అడిగినందుకు వాగ్వాదానికి దిగిన నైజీరియన్ దేశస్తుడి ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు అబ్దుల్ గఫూర్‌పై కేసు నమో దు చేశారు. బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నెం. 10లోని సింగాడికుంటలో నైజీరియాకు చెందిన డమిలోలా ఖాజీం(26) అద్దెకు ఉంటూ నిజాం కాలేజీలో చదువుతున్నాడు. ఇదే ప్రాంతంలో నివసిస్తున్న అబ్దుల్ గఫూర్ ఇంటి ముందు ఈ నెల 25వ తేదీ మధ్యాహ్నం ఖాజీం తన కారును (ఎంహెచ్ 02 ఏఎల్ 7491) పార్కింగ్ చేశాడు. అయితే తన ఇంటి ముందు కారును ఎందుకు పార్కింగ్ చేశావంటూ గఫూర్ ప్రశ్నించాడు. దీంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి ఉద్రిక్తతకు దారితీసింది. అదే సమయంలో స్థానికంగా నివసించే అయిదారుగురు యువకులు అక్కడికి చేరుకున్నారు. ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే నైజీరియన్ విద్యార్థి ఖాజీంపై దాడి జరిగింది. తలకు తీవ్ర గాయాలు కావడంతో ఆయనను సమీపంలోని సెంచరీ ఆస్పత్రికి తరలించారు. ఈ వ్యవహారంలో బస్తీ పెద్దలు కూర్చొని సమస్యను సద్దుమణిగేలా చేశారు.
అయితే శుక్రవారం వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. అసోసియేషన్ ఆఫ్ నైజీరియన్స్ తెలంగాణ చాప్టర్ అధ్యక్షుడు ఓమో బోవాలే సివెన్ గిడియోన్ రంగప్రవేశం చేసి బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్తో కేసు వ్యవహారం మాట్లాడారు. అంతే కాదు ఈ దాడి విషయం శుక్రవారం ఢిల్లీదాకా వెళ్లింది. కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్ ఈ కేసు విషయంపై మాట్లాడాల్సిన పరిస్థితి రావడంతో దాడి ఘటన పెద్దదైంది. ఈ నేపథ్యంలోనే దాడికి పాల్పడ్డాడంటూ గఫూర్‌పై పోలీసులు ఐపీసీ సెక్షన్ 324కింద అరెస్టు చేశారు. పార్కింగ్ విషయంలో గొడవ జరిగిందంటూ నైజీరియన్ తమకు ఫిర్యాదు చేశాడని పోలీసులు తెలిపారు. అయితే తాను వాగ్వాదానికి దిగిన మాట వాస్తవమేనని దాడికి పాల్పడలేదని గఫూర్ తెలిపాడు. బంజారాహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
రాష్ర్ట ప్రభుత్వాన్ని నివేదిక కోరిన సుష్మాస్వరాజ్
న్యూఢిల్లీ: హైదరాబాద్‌లో నైజీరియన్‌పై దాడి జరిగిన ఘటనపై తెలంగాణ ప్రభుత్వాన్ని భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ నివేదిక కోరారు. బుధవారం హైదరాబాద్‌లో పార్కింగ్ విషయంలో 23 ఏళ్ల నైజీరియన్ యువకుడిపై స్థానిక యువకుడు దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటనకు కొద్ది రోజుల ముందే ఢిల్లీలోని వసంత్‌కుంజ్ ప్రాంతంలో ఓ కాంగో యువకుడిని స్థానికులు చిన్న వివాదానికే చంపారు. భారతదేశంలో చదువుకునే వేలమంది ఆఫ్రికన్ విద్యార్థులకు పూర్తి రక్షణ కల్పించకపోవడంతో ఆ దేశాల రాయబారులు అసహనానికి లోనవుతున్నారు. ఈ నేపథ్యంలోనే నివేదిక కోరినట్లు తెలిసింది.