విద్యుత్ బిల్లుపై వెనక్కి తగ్గేదేలే...
సాక్షి, న్యూఢిల్లీ: విద్యుత్ పంపిణీ రంగాన్ని సమూలంగా మార్చేసే విద్యుత్ చట్టసవరణ బిల్లును ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపసంహరించుకోబోమని కేంద్ర విద్యుత్ మంత్రి ఆర్కే సింగ్ స్పష్టం చేశారు. కేంద్రం తీసుకువచ్చిన విద్యుత్ సంస్కరణలపై తెలంగాణ సహా పలు రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న సమయంలో ఆర్కే సింగ్ తమ వైఖరిని మళ్లీ వెల్లడించారు. విద్యుత్తు సంస్కరణలపై ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఆర్కే సింగ్, విద్యుత్ రంగంలో కేసీఆర్ ఏకఛత్రాధిపత్యాన్ని కోరుకుంటున్నారని, అందుకే ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నారన్నారని మండిపడ్డారు. ప్రస్తుతం విద్యుత్ రంగంలో ఉన్న ఏకఛత్రాధిపత్యాన్ని అడ్డుకునేందుకు విద్యుత్తు చట్టసవరణ బిల్లు ఉపయోగపడు తుందని తెలిపారు.
బుధవారం ఢిల్లీలోని నేషనల్ మీడియా సెంటర్లో జరిగిన ఒక కార్యక్రమం అనంతరం కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ మీడియాతో మాట్లాడుతూ గత నెల లోక్‌సభలో కేంద్రం ప్రవేశపెట్టిన విద్యుత్తు చట్టసవరణ బిల్లులో పొందుపరి చిన అంశాలన్నీ ప్రజలకు ప్రయోజనం కలి గించేవే అని పేర్కొన్నారు. ఈ బిల్లు ద్వారా విద్యుత్ పంపిణీ విషయంలో పోటీతత్వం పెరుగుతుందని, తద్వారా ప్రజలకు తక్కువ ధరల్లోనే మెరుగైన సేవలు అందుతాయని వెల్లడించారు. అంతేగాక విద్యుత్ చట్ట సవరణ బిల్లు ద్వారా ప్రస్తుతం పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే విద్యుత్ సబ్సిడీలను ఏరకంగానూ అడ్డుకోవడం లేదని ఆర్కే సింగ్ స్పష్టత ఇచ్చారు. నూతన బిల్లు ప్రకారం రాష్ట్రప్రభుత్వాలు కేవలం రైతులకు మాత్రమే కాకుండా, తాము ఇవ్వాలని భావించిన ఏ వర్గానికి అయినా ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు ఎలాంటి అడ్డంకులు లేవని పేర్కొన్నారు. ఉచిత విద్యుత్‌తోపాటు సబ్సిడీల విషయంలో కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది, అభ్యంతరంలేదని ఆర్కేసింగ్ వెల్లడించారు.
ఇదీ చదవండి: విద్యుత్తు సామర్థ్యం పెంపునకు కమిటీలు ఏర్పాటు చేయాలి