Union Sports Minister sarbananda sonowal
-
న్యాయం చేయండి!
►'రియో’ తుది బెర్త్ కోసం ట్రయల్స్ నిర్వహించండి ► 'ఢిల్లీ హైకోర్టులో రెజ్లర్ ► 'సుశీల్ పిటిషన్ దాఖలు ► నేడు విచారణకు వచ్చే అవకాశం న్యూఢిల్లీ: అంతా అనుకున్నట్టే జరుగుతోంది. భారత రెజ్లింగ్‌లో ‘రియో’ బెర్త్ రగడ తారాస్థాయికి చేరుకుంది. రియో ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు చివరి ప్రయత్నంగా స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. రియో ఒలింపిక్స్ సన్నాహక శిబిరంలో తన పేరును చేర్చకపోవడం... ట్రయల్స్ నిర్వహించేందుకు భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) సుముఖంగా లేకపోవడం... ఈ వివాదంలో తాము కూడా జోక్యం చేసుకోలేమని కేంద్ర క్రీడల మంత్రి స్పష్టం చేయడం... తప్పనిసరి పరిస్థితుల్లో ఈ డబుల్ ఒలింపిక్ పతక విజేత తనకు న్యాయం చేయాలని కోరుతూ సోమవారం ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. సుశీల్ పిటిషన్ మంగళవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. ‘నాకు ఇంకో ప్రత్యామ్నాయం లేదు. అందుకే కోర్టును ఆశ్రయించాను. నిబంధనల ప్రకారం ఒలింపిక్ బెర్త్ అనేది దేశానికి చెందుతుంది తప్ప వ్యక్తికి కాదు. 74 కేజీల విభాగంలో మరో భారత రెజ్లర్ నర్సింగ్ యాదవ్‌తో ట్రయల్స్ ఏర్పాటు చేయాలని కోరుతున్నాను’ అని సుశీల్ కుమార్ మరోసారి విన్నవించాడు. ఇప్పటికే సుశీల్ తనకు న్యాయం చేయాలని కోరుతూ ప్రధానమంత్రి కార్యాలయం, కేంద్ర క్రీడా శాఖ, భారత ఒలింపిక్ సంఘం, రెజ్లింగ్ సమాఖ్య ప్రతినిధులకు అభ్యర్థన చేశాడు. అయితే ఇప్పటివరకు సుశీల్‌కు ఎవ్వరి నుంచి కూడా సానుకూల స్పందన రాలేదు. దాంతో న్యాయస్థానంలోనే తేల్చుకోవాలని బీజింగ్, లండన్ ఒలింపిక్స్ క్రీడల్లో కాంస్య, రజత పతకాలు సాధించిన సుశీల్ నిర్ణయించుకున్నాడు. రెజ్లింగ్ సమాఖ్యపై విమర్శలు... గాయం కారణంగా గత ఏడాది సెప్టెంబరులో లాస్వేగాస్లో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో సుశీల్ కుమార్ పాల్గొనలేకపోయాడు. దాంతో 74 కేజీల విభాగంలో ముంబై రెజ్లర్ నర్సింగ్ యాదవ్ బరిలోకి దిగి కాంస్య పతకం సాధించి భారత్‌కు రియో ఒలింపిక్స్ బెర్త్‌ను ఖరారు చేశాడు. అప్పుడే 74 కేజీ విభాగంలో బెర్త్ సాధించిన నర్సింగ్ యాదవ్‌నే ఒలింపిక్స్‌కు పంపిస్తామని భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) ప్రకటించి ఉంటే వివాదం ఉండేది కాదు. కానీ డబ్ల్యూఎఫ్ఐ మౌనంగా ఉండటంతో గాయం నుంచి తేరుకున్న సుశీల్ ఒలింపిక్స్ సన్నాహాల్లో మునిగిపోయాడు. టార్గెట్ ఒలింపిక్ పోడియం (టాప్) పథకం కింద కేంద్ర క్రీడాశాఖ ఇప్పటికే సుశీల్ కుమార్ శిక్షణపై రూ. 75 లక్షలు వెచ్చించింది. మరోవైపు ఇవేమీ పట్టించుకోని రెజ్లింగ్ సమాఖ్య తీరా ఒలింపిక్స్‌కు తుది ఎంట్రీలు ఖరారు చేసే సమయానికి నర్సింగ్ యాదవ్‌వైపు మొగ్గు చూపుతుండటంతో ఢిల్లీకి చెందిన సుశీల్ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. భారత రెజ్లర్లు మొత్తం ఎనిమిది కేటగిరీలలో ఒలింపిక్ బెర్త్‌లు సాధించారు. ఒకవేళ 74 కేజీల విభాగంలో ట్రయల్స్ నిర్వహిస్తే... మిగతా ఏడు బెర్త్‌ల కోసం కూడా ట్రయల్స్ ఏర్పాటు చేయాలనే డిమాండ్ వస్తుందని రెజ్లింగ్ సమాఖ్య ఆందోళనతో ఉంది. ట్రయల్స్ నిర్వహించాలా వద్దా అనే విషయాన్ని తేల్చేందుకు మంగళవారం రెజ్లింగ్ సమాఖ్య సమావేశం అయ్యే అవకాశం ఉంది. జోక్యం చేసుకోం: క్రీడల మంత్రి మరోవైపు సుశీల్-నర్సింగ్ యాదవ్ వివాదంలో జోక్యం చేసుకోబోమని కేంద్ర క్రీడల మంత్రి శర్బానంద సోనోవాల్ స్పష్టం చేశారు. ఈ విషయంలో స్వతంత్ర సంస్థ అయిన భారత రెజ్లింగ్ సమాఖ్యనే తుది నిర్ణయం తీసుకోవాలని ఆయన తెలిపారు. ‘ఈ వివాదంతో ప్రభుత్వానికి సంబంధం లేదు. రెజ్లింగ్ సమాఖ్యనే తుది నిర్ణయం తీసుకోవాలి. వారి నిర్ణయాన్ని మేము సమర్థిస్తాం’ అని సోనోవాల్ అన్నారు. -
దక్షిణాసియా క్రీడల మస్కట్‌గా టిఖోర్
ఫిబ్రవరి 6 నుంచి 16 వరకు క్రీడలు గువాహటి, షిల్లాంగ్ ఆతిథ్యం గువాహటి: వచ్చే ఏడాది ఫిబ్రవరి 6 నుంచి 16 వరకు జరిగే దక్షిణాసియా క్రీడల మస్కట్, లోగోలను కేంద్ర క్రీడా మంత్రి శర్బానంద సోనోవాల్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అస్సాం ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్, మేఘాలయ క్రీడా మంత్రి జెనిత్ సంగ్మా పాల్గొన్నారు. పోటీలు గువాహటి (అస్సాం), షిల్లాంగ్ (మేఘాలయ) నగరాల్లో జరుగుతాయి. మస్కట్‌గా ‘టిఖోర్’ (ఒంటి కొమ్ముతో ఉండే ఖడ్గమృగం)ను ఎంపిక చేశారు. లోగోలో పోటీల్లో పాల్గొనే దేశాల సంఖ్యను సూచిస్తూ ఎనిమిది పూరేకులను పొందుపరిచారు. ఓవరాల్‌గా ఎనిమిది దేశాలకు చెందిన 4500 మంది అథ్లెట్లు, అధికారులు ఇందులో పాల్గొనే అవకాశం ఉంది. పది రోజుల పాటు 23 ఈవెంట్స్‌లో పోటీలు జరుగుతాయి. చివరిసారి దక్షిణాసియా క్రీడలు 2010లో బంగ్లాదేశ్‌లోని ఢాకాలో జరిగాయి. భారత్ 90 స్వర్ణాలు, 55 రజతాలు, 30 కాంస్య పతకాలతో కలిపి ఓవరాల్‌గా 175 పతకాలు సాధించి అగ్రస్థానంలో నిలిచింది. -
పాక్‌తో సిరీస్‌కు సోనోవాల్ మద్దతు
కోల్‌కతా : భారత్, పాకిస్తాన్ క్రికెట్ సిరీస్‌కు కేంద్ర క్రీడా శాఖ మంత్రి శర్బానంద సోనోవాల్ మద్దతు పలికారు. ఇరు దేశాల మధ్య క్రీడలు స్నేహ సంబంధాలను పెంపొందిస్తాయని అన్నారు. ‘ఓ క్రీడా మంత్రిగా నా ప్రధాన ఉద్దేశం క్రీడల అభివృద్ధికి తోడ్పటమే. పాక్‌తో సంబంధాలు మరింత మెరుగుపరుచుకునేందుకు ఇరు దేశాల మధ్య క్రికెట్ సిరీస్ జరిగితేనే బావుంటుంది. అయితే పరిష్కారం కావాల్సిన సమస్యలు కూడా ఉన్నాయి’ అని మంత్రి అన్నారు.