కార్పొరేషన్ సాధనే లక్ష్యం
గళం విప్పుతున్న ఆటోడ్రైవర్లు
నేడు ప్రపంచ ఆటోడ్రైవర్ల దినోత్సవం
ఏనుగులగడ్డలో భారీ బహిరంగ సభ
జిల్లాలో 50 వేల కుటుంబాలు
హాజరుకానున్న మంత్రి ఈటల రాజేందర్
సాక్షి, హన్మకొండ :
ఆటోడ్రైవర్ల సంక్షేమానికి ప్రత్యేక కారొ్పరేషన్ సాధనే లక్ష్యంగా తెలంగాణ ఆటోడ్రైవర్ల యూనియన్ గళం విప్పుతోంది. తెలంగాణ రాష్ట్ర సాధనలో అలుపెరుగని పోరాటం చేసిన ఆటోడ్రైవర్ల సంక్షేమం, అభివృద్ధి కోసం రాష్ట్రస్థాయిలో ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో సోమవారం హన్మకొండలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ప్రపంచ ఆటోడ్రైవర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ బహిరంగ సభ ఏర్పాటుచేశారు. తాము నిత్యం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపించాల్సిందిగా ఆటోడ్రైవర్లు ఈ సభ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయనున్నారు.
వేలాది మందికి ఉపాధి
ఆటోలు నడపడం ద్వారా పెద్దసంఖ్యలో నిరుద్యోగులకు ఉపాధి లభిస్తోంది. పట్నం, పల్లె అనే తేడా లేకుండా అన్ని చోట్ల వేలాది మంది యువకులు ఆటోడ్రైవర్ వృత్తిని నమ్ముకుని జీవిస్తున్నారు. ప్రైవేట్ సెక్టార్లో ఈ వృత్తిని నమ్ముకునేవారి సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. ఇంతకాలం అసంఘటిత రంగంలో కార్మికులుగా ఆటోడ్రైవర్లు కొనసాగారు. అయితే, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ ప్రస్థానంలో తొలిసారిగా ఆటోడ్రైవర్లు సంఘటిత శక్తిగా మారారు. 2011లో జరిగిన సకల జనుల సమ్మెలో వేలాది మంది ఆటోడ్రైవర్లు మహార్యాలీ నిర్వహించి సమ్మె సైరన్ మోగించారు. ఉద్యమం జరిగిన రోజుల్లో ఆటోడ్రైవర్లు చేసిన త్యాగాలను గుర్తించిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు రవాణా పన్ను నుంచి మినహాయింపునిచ్చి వారిని ఆదుకున్నారు. అయితే, ఇంకా పలు సమస్యలు ఎదుర్కొంటున్న వారు తమ గళం విప్పుతున్నారు. ఇందులో భాగంగానే సోమవారం ఉదయం 11:30 గంటలకు తెలంగాణ ఆటోడ్రైవర్ల యూనియన్(టాడూ) ఆధ్వర్యాన హన్మకొండలోని ప్రొఫెసర్ జయశంకర్ ప్రాంగణం(ఏనుగులగడ్డ) వద్ద భారీ బహిరంగ సభ ఏర్పాటుచేశారు. ఈ సభకు రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్‌తో పాటు జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, రాజకీయనాయకులు హాజరుకానున్నారు.
ఆటోడ్రైవర్ల డిమాండ్లు
రాష్ట్ర స్థాయిలో రూ.వెయ్యి కోట్లతో ప్రత్యేక ఆటో కార్పొరేషన్ ఏర్పాటుచేయాలి.
అర్హులైన ఆటోడ్రైవర్లకు డబుల్ బెడ్రూం ఇళ్ల పథకం వర్తింపచేయాలి.
ఐదేళ్ల సీనియారిటీ లైసెన్స్ బ్యాడ్జీ ఉన్న ఆటోడ్రైవర్ చనిపోతే రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి.
50 ఏళ్లు నిండిన ఆటోడ్రైవర్లకు రూ.5వేల పింఛన్ ఇవ్వడంతో పాటు ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యాలు కల్పించాలి.
ఆటో ఇన్సురెన్స్‌పై 50 శాతం రాయితీ ఇవ్వాలి.
వడ్డీ లేకుండా ఆటోడ్రైవర్లకు బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించాలి.
ఆటోడ్రైవర్లపై భౌతికదాడులు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.
డీజిల్, పెట్రోల్, స్పేర్పార్ట్స్లలో కల్తీలను అరికట్టాలి.
ప్రైవేట్ ఫైనాన్షియర్ల ఆధ్వర్యంలో డ్రైవర్లను వేధించే సీజర్ల దాడులను అరికట్టాలి.
ఓవర్‌లోడ్ పేరుకు ఆటోడ్రైవర్లు ఒక్కరినే బాధ్యలు చేయడం సరికాదు.
డ్రైవర్ల జీవితంలో వెలుగు
పరిస్థితుల కారణంగానే జీవనోపాధిగా ఎక్కువ మంది ఆటో డ్రైవర్ వృత్తిని ఎంచుకుంటున్నారు. సరైన ఉపాధి మార్గాలు కరువై వేలాది మంది ఈ వృత్తిలో కొనసాగుతున్నారు. ఆటోడ్రైవర్లు ఇటు సంఘటిత రంగం, అటు సంఘటిత రంగానికి మధ్యస్థంగా ఉన్నారు. దీంతో ఆటోడ్రైవర్ల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ ఆటోడ్రైవర్ల సంఘం ఏర్పాటు చేశాం. టాడు వేదికగా ఆటోడ్రైవర్ల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం. ప్రస్తుతం ఆటోడ్రైవర్లకు ప్రమాదబీమా సౌకర్యం కల్పించడబడింది. ఇదే ఊపులో రూ. 1000 కోట్లతో ఆటోడ్రైవర్ కార్పొరేషన్ స్థాపన కోసం కృషి చేస్తాం.
– గుడిమళ్ల రవికుమార్, ‘టాడు’ గౌరవ అధ్యక్షుడు