ఛత్తీస్‌గఢ్ విద్యుత్ చాలా చౌక!
యూనిట్ రూ. 3.90కే లభిస్తుందని డిస్కంల అంచనాలు
ఏడాదికి విద్యుత్ కొనుగోలు వ్యయం రూ. 2,528 కోట్లు
ఛత్తీస్‌గఢ్ ఈఆర్సీ ఖరారు చేసిన తాత్కాలిక ధరే దీనికి ప్రామాణికం
వార్షిక ఆదాయ అవసరాల(ఏఆర్ఆర్) నివేదికలో డిస్కంల లెక్కలు
ఇంకా వాస్తవ ధరను ఖరారు చేయని ఛత్తీస్‌గఢ్ ఈఆర్సీ
సాక్షి, హైదరాబాద్: చౌక ధరకే ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్ లభించ నుందని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (టీఎస్ఈఆర్సీ)కి రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు అంచనాలను సమర్పిం చాయి. ఛత్తీస్‌గఢ్ విద్యుత్ యూనిట్ లభ్యత ధర ప్రాథమికంగా రూ.3.90 ఉండనుందని తాజాగా ఈఆర్సీకి సమర్పించిన వార్షిక ఆదాయ అవసరాల నివేదిక(ఏఆర్ఆర్) 2017-18లో పేర్కొన్నాయి. ఛత్తీస్‌గఢ్‌లోని మార్వా థర్మల్ విద్యుత్ ప్లాంట్ నుంచి 1,000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం 2015 సెప్టెంబర్ 22న దీర్ఘకాలిక ఒప్పందం (పీపీఏ) కుదుర్చుకున్న విషయం తెలిసిందే. వాస్తవానికి ఈ విద్యుత్‌కు సంబంధించిన తుది ధరను ఛత్తీస్‌గఢ్ ఈఆర్సీ ఖరారు చేయాల్సి ఉండగా, ఇంత వరకు కాలేదు. అయితే, 2016-17లో ఈ విద్యుత్‌ను రూ.3.90కు యూనిట్ చొప్పున విక్రయించాలని ఛత్తీస్‌గఢ్ ఈఆర్సీ ఏడాది కింద తాత్కాలిక ధరను ఖరారు చేసింది. ఇదే ధరను 2017-18 కోసం తెలంగాణ డిస్కంలు టీఎస్ ఈఆర్సీకి ప్రతిపాదించారుు. అరుుతే, 2017-18కి సంబంధించిన ధరను ఛత్తీస్‌గఢ్ ఈఆర్సీ ఖరారు చేయకపోవడం గమనార్హం. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి ఛత్తీస్‌గఢ్ విద్యుత్ రాష్ట్రానికి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆలోగా ఛత్తీస్‌గఢ్ విద్యుత్ అసలు ధరలపై స్పష్టత వచ్చే అవకాశముంది.
అసలు ధర ఎంత?
ఖరీదైన ఛత్తీస్‌గఢ్ విద్యుత్ రాష్ట్రానికి గుదిబండగా మారనుందని విద్యుత్‌రంగ నిపుణుల అభ్యంతరాల నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్ విద్యుత్ ధరలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పన్నులు, సుంకాలు, వివిధ దశల్లోని ట్రాన్సమిషన్ చార్జీలు కలుపుకుని ఛత్తీస్‌గఢ్ విద్యుత్ రాష్ట్రానికి వచ్చే సరికి వ్యయం యూనిట్‌కు రూ.5.50 వరకు పెరుగుతుందని నిపుణులు అంచనా వేశారు. దీంతో ఈ విద్యుత్ వల్ల రాష్ట్రంపై ఏటా రూ.వెయి కోట్ల అదనపు భారం పడుతుందని హెచ్చరించారు. ఛత్తీస్‌గఢ్ విద్యుత్ ధరలు తగ్గించేందుకు పీపీఏలో కొన్ని సవరణలు చేయాలని టీఎస్ఈఆర్సీ సైతం డిస్కంలకు సూచించింది. పీపీఏలో సవరణల విషయంలో ఛత్తీస్‌గఢ్, రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఇంకా సంప్రదింపులు కొనసాగుతున్నాయి. ఛత్తీస్‌గఢ్ పీపీఏను టీఎస్ఈఆర్సీ ఆమోదించిన తర్వాతే విద్యుత్‌ను రాష్ట్ర డిస్కంలు కొనుగోలు చేయాల్సి ఉండనుంది. అయితే, ఛత్తీస్‌గఢ్ విద్యుత్‌కు సంబంధించిన తుది ధరను ఆ రాష్ట్ర ఈఆర్సీ ఖరారు చేయాల్సి ఉంది. ఆ ధరలతోనే మన డిస్కంలు విద్యుత్‌ను కొనుగోలు చేయాల్సి ఉండనుంది.
ఏడాదికి వ్యయం రూ.2,528 కోట్లు
మార్వా థర్మల్ విద్యుత్ కేంద్రాల నుంచి 2017-18 లో రాష్ట్రానికి 6,482.4 మిలియన్ యూనిట్ల విద్యుత్ లభ్యత ఉండనుందని, ఈ విద్యుత్ కొనుగోలు వ్యయం రూ.2,528 కోట్లు కానుందని డిస్కంల అంచనాలు పేర్కొంటున్నాయి. యూనిట్‌కు రూ.3.90 లెక్కన కొనుగోలు చేస్తేనే ఈ మేరకు వ్యయం కానుంది. వాస్తవ ధర ఇంత కంటే ఎక్కువ ఉంటే వందల కోట్ల రూపాయల అదనపు భారం పడే అవకాశముంది.