'బీజేపీకి వ్యతిరేకంగా ఒక్కటవుదాం'
కోల్ కతా: జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించేందుకు సిద్ధమని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన ప్రకటనను పలు పార్టీలు స్వాగతించాయి. బీజేపీకి వ్యతిరేకంగా కూటమి ఏర్పాటులో క్రియాశీలక పాత్ర పోషించేందుకు సిద్ధమని మమతా బెనర్జీ ప్రకటించారు. బీజేపీ మత రాజకీయాలకు వ్యతిరేకంగా కలిసికట్టుగా పోరాడాలని ఆమె పిలుపునిచ్చారు. 'కలిసి కూర్చుని మాట్లాడుకుందామని అన్ని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నాను. కలిసికట్టుగా పోరాడదామన'ని ఆమె పేర్కొన్నారు.
మమతా బెనర్జీ ప్రకటనను కాంగ్రెస్, జేడీ(యూ), ఆమ్ ఆద్మీ పార్టీ స్వాగతించాయి. బీజేపీకి వ్యతిరేకంగా తృణమూల్ తో కలిసి పనిచేసేందుకు తమకు అభ్యంతరం లేదని ఏఐసీసీ సీనియర్ నేత ఒకరు చెప్పారు. తమ పార్టీ విధానానికి అనుగుణంగా దీనిపై హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందన్నారు. మమతా బెనర్జీ ప్రతిపాదనకు మద్దతిస్తున్నామని జేడీ(యూ) ప్రధాన కార్యదర్శి కేసీ త్యాగి తెలిపారు.