విభజన ఆపితేనే ఉద్యమానికి విరామం
కర్నూలు(విద్య), న్యూస్‌లైన్: రాష్ట్ర విభజనపై కేంద్రం తన నిర్ణయాన్ని మార్చుకుంటేనే ఉద్యమానికి విరామం ప్రకటిస్తామని సమైక్యవాదులు పేర్కొన్నారు. 44 రోజులుగా సీమాంధ్రలో ఆందోళనలు కొనసాగుతున్నా కేంద్రానికి చీమ కుట్టినట్లయినా లేదని మండిపడ్డారు. కేంద్రం దిగొచ్చే వరకు ఆందోళనలు ఆపేది లేదని, జీతాలు, జీవితాలు త్యాగం చేసైనా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుకుంటామని వారు ప్రతినబూనారు. ఈ మేరకు శుక్రవారం ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల ఉద్యోగులు ర్యాలీలు, మానవహారాలు, రాస్తారోకోలు నిర్వహించి నిరసన తెలిపారు.
పెద్దాసుపత్రి వైద్యులు, సిబ్బంది రాస్తారోకో:
కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల మెడికల్ జేఏసీ ఆధ్వర్యంలో వైద్యులు, ఉద్యోగులు, సిబ్బంది శుక్రవారం ఎన్టీఆర్ సర్కిల్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. మానవహారంగా ఏర్పడి సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో వైద్యులు విజయశంకర్, శంకరశర్మ, మనోరాజు, రామకృష్ణానాయక్, ఆయుర్వేద వైద్యులు నాగరాజు, హోమియో వైద్యులు రాజారాం, ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జి. పుల్లారెడ్డి విద్యార్థుల భారీ ర్యాలీ:
నగర శివారులోని జి. పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో కళాశాల నుంచి రాజవిహార్ సెంటర్ వరకు వారు ర్యాలీ కొనసాగించారు.
శ్రీ చైతన్య, నారాయణ కళాశాలల మూసివేత:
ప్రైవేటు జూనియర్ కళాశాలల జేఏసీ ఆధ్వర్యంలో తరగతులు నిర్వహిస్తున్న శ్రీచైతన్య, నారాయణ జూనియర్ రెసిడెన్సియల్ కళాశాలలను మూ యించారు. డే స్కాలర్ మూసివేసినా రెసిడెన్సియల్ కళాశాలలు కొనసాగిస్తున్నారని తెలుసుకుని శుక్రవారం జేఏసీ నాయకులు అడ్డుకున్నారు. ఈ నెల 17 వరకు కళాశాలలు మూసివేయాల్సిందేనని చెప్పారు. కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ శేషిరెడ్డి, వైస్ చైర్మన్ చంద్రశేఖర్, సెక్రటరి పుల్యాల రామచంద్రారెడ్డి, మొయినుద్దీన్ పాల్గొన్నారు.