ఐక్యతా పరుగు
కదంతొక్కిన సమైక్యవాదులు
సాక్షి నెట్వర్క: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ సీమాంధ్ర వ్యాప్తంగా ఆదివారం ‘సమైక్య పరుగు’ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేలాదిగా ఉద్యోగులు, విద్యార్థులు, పాల్గొన్నారు. విభజన బిల్లును అడ్డుకోని ప్రజాప్రతినిధులకు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తామని హెచ్చరించారు. కృష్ణా జిల్లా విజయవాడలో నిర్వహించిన 5కే రన్ లో ఏపీఎన్జీవో అధ్యక్షుడు పి.అశోక్‌బాబు , ఎంపీ లగడపాటి రాజగోపాల్ తదితరులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ, రాజమండ్రి, అమలాపురంలలో సమైక్యరన్ నిర్వహించారు. అనంతపురం కలెక్టరేట్ ఆవరణలో కేంద్ర మంత్రుల ఫొటోల ఫ్లెక్సీలను టమాటాలతో కొట్టిన ఉద్యోగులు వాటిని తగులబెట్టి నిరసన వ్యక్తం చేశారు. గుంటూరులో నిర్వహించిన సమైక్య నడక(10కె) కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రజలు వేలాదిగా పాల్గొన్నారు.
ఒంగోలులో నిర్వహించిన పరుగులో ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి జ్యోతిని పట్టుకొని ముందుకు కదలగా విద్యార్థులు, ఉద్యోగులు, వివిధ పార్టీల నాయకులు అనుసరించారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రంలోనూ సమైక్య రన్ నిర్వహించారు. కర్నూలులో నిర్వహించిన 5కే రన్ లో మంత్రి టి.జి.వెంకటేష్, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. విజయనగరంలోని అయోధ్యా మైదానం నుంచి జిల్లా పోలీస్ కార్యాలయం వరకు వేలాది మంది సమైక్యవాదులు రన్లో పాల్గొన్నారు. పార్వతీపురం పట్టణం బెలగాంలో, సాలూరులో ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సమైక్యాంధ్ర పరుగు నిర్వహించారు. ఎన్జీవోలు, సమైక్యాంధ్ర పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో శ్రీకాకుళంలో సమైక్య రన్ నిర్వహించారు. విశాఖ సాగరతీరంలో వేల సంఖ్యలో విద్యార్థులు, ఉద్యోగులతో సమైక్య నడక కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఏయూలో సీమాంధ్ర కేంద్ర మంత్రుల దిష్టిబొమ్మల్ని దహనం చేశారు. సమైక్యాంధ్ర పొలిటికల్ జేఏసీ నేతృత్వంలో జీవోఎం సభ్యుడు జైరాం రమేష్ దిష్టిబొమ్మను దహనం చేశారు. చిత్తూరు జిల్లాలో తిరుపతి, చిత్తూరు, మదనపల్లె పట్టణాల్లో ఎన్జీవో జేఏసీల ఆధ్వర్యంలో సమైక్యాంధ్ర రన్ నిర్వహించారు. రెవెన్యూ, మున్సిపల్, వాణిజ్యపన్నులు, ఖజానా, రవాణాశాఖల ఉద్యోగులు, విద్యార్థులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరు, తాడేపల్లిగూడెం, తణుకు, భీమవరం, పాలకొల్లు, నర్సాపురం, కొవ్వూరు పట్టణాలు సమైక్య నినాదాలతో మార్మోగాయి. మునిసిపల్ ఉద్యోగులు, సమైక్యాంధ్ర జేఏసీ, విద్యాసంస్థల జేఏసీ, సమైక్యవాదులు, వ్యాపారులు పెద్దఎత్తున రన్లో పాల్గొని సమైక్యవాదాన్ని చాటారు. ఆకివీడు, కొయ్యగూడెం తదితర మండల కేంద్రాల్లోను సమైక్య పరుగు నిర్వహించారు. వైఎస్సార్ జిల్లా కడప మున్సిపల్ స్టేడియం నుంచి అప్సర సర్కిల్, ఆర్టీసీ బస్టాండు, కోటిరెడ్డి సర్కిల్, ఎన్టీఆర్ సర్కిల్ మీదుగా ఏడురోడ్ల కూడలి వరకు నిర్వహించిన ‘సమైక్య రన్’లో వేలాది మంది విద్యార్థులు, ఎన్జీవోలు, ఉద్యోగులు, వివిధ ప్రజాసంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. దారిపొడవునా సమైక్యోద్యమ గీతాలు, నినాదాలతో హోరెత్తించారు. ప్రొద్దుటూరులో బార్ అసోషియేషన్, ఎన్జీఓల ఆధ్వర్యంలో సమైక్యరన్ జరిగింది.