హోరెత్తిన జనగర్జన
సమైక్య నినాదాలతో చిత్తూరు మార్మోగింది.రాష్ట్ర విభజన ప్రక్రియకు నిరసనగా శనివారం నిర్వహించిన సమైక్య జనగర్జన హోరెత్తింది. అన్ని వర్గాల ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. నగర వీధులన్నీ సమైక్యవాదులతో కిక్కిరిసి పోయాయి. ఉద్యమాన్ని ప్రతిబింబించేలా విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటుచేశారు. ఎండను సైతం లెక్కచేయక గంటల తరబడి జనం ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఉద్యమ తీవ్రతను ఢిల్లీ పెద్దలకు తెలియజేస్తామని వక్తలు స్పష్టం చేశారు.
చిత్తూరు (కలెక్టరేట్),న్యూస్‌లైన్: రాష్ట్ర విభజనను నిరసిస్తూ చిత్తూరులో శనివారం జరిగిన జనగర్జనకు అశేషంగా జనం తరలివచ్చారు. చిత్తూరు నగరం సమైక్య నినాదాలతో మార్మోగింది. సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎస్‌ఆర్‌పీవీ జిల్లా చైర్మన్, స్థానిక ఎమ్మెల్యే సీకేబాబు అధ్యక్షత వహించారు. గౌరవ అతిథిగా చిత్తూరు ఎంపీ శివప్రసాద్ హాజరయ్యారు. జనగర్జనకు అన్ని వర్గాల ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చి తమ సమైక్యగళాన్ని ఢిల్లీ పెద్దలకు వినిపించారు.
ఉద్యమస్ఫూర్తి ప్రతిబిం బించేలా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటుచేశారు. ఎండను సైతం లెక్కచేయని సమైక్యవాదులు గంటల తరబడి కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక పీసీఆర్ ఉన్నత పాఠశాల సర్కిల్లోని పూలే విగ్రహం వద్ద జనగర్జన జరిగింది. వీఆర్వోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భక్తవత్సలంనాయుడు, విద్యార్థి జేఏసీ రాష్ట్ర కన్వీనర్ కృష్ణయాదవ్‌తో పాటు జిల్లా అధికారులు, అన్ని వర్గాలకు చెందిన జేఏసీ నాయకులు పాల్గొన్నారు. ముందుగా తెలుగుతల్లి, శ్రీపొట్టి శ్రీరాముల చిత్రపటాలకు పూలమాలలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
సమైక్యాంధ్ర కోసం ఆశువులు బాసిన వారికి రెండు నిమిషాల పాటు మౌనం పాటించి నివాళులర్పించారు. జిల్లా అధికారుల జేఏసీ, సాస్ జేఏసీ, రెవెన్యూ, ఆర్టీసీ, విద్యాశాఖ, ప్రైవేటు పాఠశాలలు, నాల్గొవ తరగతి, కార్మిక, కర్షక, విద్యుత్, న్యాయవాదుల, విద్యార్థి జేఏసీ నాయకులు సభావేదికపై సమైక్య అభివాదం చేశారు. తెలుగువారి సమైక్యతను చాటేందుకు వివిధ విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులు వేదికపై చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
జిల్లా అధికారులు, రవాణా శాఖ ఉద్యోగులు, అన్ని వర్గాల జేఏసీ కన్వీనర్లు నల్లటోపీలు ధరించారు. ఏపీఎంఐపీ ఉద్యోగులు చేతపట్టిన గొడుగులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సీకేబాబు, గెజిటెడ్ జేఏసీ చైర్మన్ వెంకటసుబ్బారెడ్డి, సాస్ జేఏసీ చైర్మన్ ప్రతాప్‌రెడ్డి, రవాణా శాఖ ఉప కమిషనర్ బసిరెడ్డి ప్రజల చేత సమైక్య నినాదాలు చేయించారు. కార్యక్రమానికి హాజరైన వారికి తాగునీటిని అందించారు. విద్యార్థులకు మజ్జిగ పాకెట్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. జనగర్జనకు మహిళలు, వ్యాపారులు స్వచ్ఛందంగా తరలివచ్చారు.