‘సమైక్య’ పార్టీలకే ప్రజల మద్దతు: అశోక్బాబు
సాక్షి, హైదరాబాద్: సమైక్యవాదానికి కట్టుబడే పార్టీలకే వచ్చే ఎన్నికల్లో ప్రజల ఆదరణ, మద్దతు లభిస్తాయని ఏపీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్బాబు స్పష్టం చేశారు. సమై క్య ఉద్యమం రాజకీయాలకు అతీతంగా సాగుతోందన్నారు. సంఘం ప్రధాన కార్యదర్శి చంద్రశేఖరరెడ్డి, నగర శాఖ అధ్యక్షుడు సత్యనారాయణతో కలిసి శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి అవసరమైతే జగన్ను తప్పకుండా కలుస్తాం. దీనిపై జేఏసీ కార్యవర్గం నిర్ణయం తీసుకుంటుందని ఒక ప్రశ్నకు జవాబుగా అశోక్బాబు చెప్పారు. శనివారం విశాఖలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో భేటీ కానున్నామన్నారు. ఆదివారం కర్నూలులో జరగనున్న సభకు తరలిరావాలన్నారు.
సమ్మె కొనసాగిస్తాం
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసే వరకు సమ్మె కొనసాగించాలని ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గం తీర్మానం చేసింది. అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు అధ్యక్షతన శుక్రవారం హైదరాబాద్లో కార్యవర్గ సమావేశం జరిగింది. రాష్ట్ర కార్యవర్గంతో పాటు అన్ని జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు, వీఆర్వో, వీఆర్ఏ సంఘాల ప్రతినిధులూ ఇందులో పాల్గొన్నారు. సమావేశం అనంతరం తీర్మానాలను వెంకటేశ్వర్లు వెల్లడించారు. వాటిల్లో ముఖ్యమైనవి: ముఖ్యమైన విధులకు సిబ్బంది హాజరుకావాలని కలెక్టర్ల నుంచి తీవ్ర ఒత్తిడి వస్తోంది. అయినా విధుల్లో చేరే ప్రసక్తే లేదు. దసరా ఉత్సవాల్లోనూ పాల్గొనబోము జీతాలు రాక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఉద్యోగులకు బ్యాంకు రుణాలు ఇప్పించడానికి రెవెన్యూ అధికారులు సహకరించాలి.