11న హైదరాబాద్‌లో సమైక్య సదస్సు
సాక్షి, హైదరాబాద్: సమైక్య రాష్ట్ర పరిరక్షణకై ఈ నెల 11న హైదరాబాద్‌లోని ఏపీఎన్జీవోస్ కార్యాలయంలో సదస్సు నిర్వహించనున్నట్టు సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ప్రకటించింది. సమైక్యవాదులంతా సదస్సులో పాల్గొని తమ అభిప్రాయాలు పంచుకోవాలని విజ్ఞప్తి చేసింది. వేదిక ప్రతినిధులు గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి తులసిరెడ్డి మాట్లాడుతూ ఈ నెల 12న ఏపీఎన్జీవోస్ నిర్వహించ తలపెట్టిన సమ్మెకు సంపూర్ణ తోడ్పాటు అందిస్తామన్నారు. సీమాంధ్ర కేంద్రమంత్రులందరూ వెంటనే రాజీనామా చేసి, ఉద్యమంలో పాల్గొనాలని డిమాండ్ చేశారు. రాజీనామాలు చేయని మంత్రుల ఇళ్ల వద్ద 13న ధర్నాలు చేపడతామని హెచ్చరించారు. జన చైతన్య వేదిక అధ్యక్షుడు వి. లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక వివిధ రంగాల వారితో జాయింట్ యాక్షన్ కమిటీలను నిర్మించి హైదరాబాద్‌లో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తుందని చెప్పారు.
ఏకే ఆంటోనీ కమిటీ తన నివేదికను ఇచ్చేవరకూ రాష్ట్ర విభజన ప్రక్రియను నిలుపుదల చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏపీఎన్జీవోస్ హైదరాబాద్‌లో చేపట్టదలచిన సమ్మెను భగ్నం చెయ్యడానికి విభజనవాదులు ప్రయత్నించడం అప్రజాస్వామికమన్నారు. ఏపీఎన్జీవోస్ అసోసియేషన్ హైదరాబాద్ శాఖ అధ్యక్షుడు పి.వి.వి సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్రం సమైక్యంగా లేకపోతే హైదరాబాద్‌లోని సీమాంధ్ర ఉద్యోగులు తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటారని, విద్యార్థులు ఉపాధి సౌకర్యాలను కోల్పోతారని చెప్పారు. త్వరలో రాష్ట్ర రాజధానిలో సమైక్యవాదాన్ని వినిపించడానికి భారీ బహిరంగసభ ఏర్పాటు చేస్తామన్నారు. సమావేశంలో సమితి నేతలు కుమార్‌చౌదరియాదవ్, రాజేంద్రప్రసాద్‌రెడ్డి, న్యాయవాదులు వి.రామకృష్ణ, పీఏ మెల్చిసెడక్, కృష్ణమోహన్, ఉద్యోగ సంఘాల నేతలు ఇ. శివకుమారి, కె. రమాదేవి, ఎం. శ్రీరామమూర్తి, బి. హైమ, కె. సుధాకర్‌రెడ్డి, పి.జి ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.