అమెరికా స్కాంలో ముగ్గురు భారతీయులు
న్యూయార్క్: ఆరోగ్యబీమా కుంభకోణంలో ప్రమేయం ఉందని ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు భారతీయులను అమెరికా ఫెడరల్ జ్యూరీ దోషులుగా నిర్ధారించింది. 2008 జూలై నుంచి 2011 సెప్టెంబర్ మధ్యకాలంలో చోటుచేసుకున్న సుమారు 15మిలియన్ డాలర్ల కుంభకోణంలో వైద్యవృత్తిలో ఉన్న షహజాద్ మీర్జా, జిగర్ పటేల్ అనేవ్యక్తులతోపాటు వైద్యుడిగా ప్రాక్టీస్ చేయడానికి తగిన లెసైన్స్‌లేని శ్రీనివాస్‌రెడ్డి అనే వ్యక్తులకు ప్రమేయం ఉన్నట్టు నిర్ధారణ అయిందని సహాయ అటార్నీ జనరల్ డేవిడ్ ఓనిల్ తెలిపారు. ఆరోగ్యబీమా సంస్థకు వీరు తప్పుడు క్లెయిమ్‌లు సమర్పించారన్నారు. వీరిలో శ్రీనివాసరెడ్డి రోగుల ఇళ్లకు వెళ్లి వైద్యం అందించినట్టు తప్పుడు క్లెయిమ్‌లు సమర్పించారన్నారు. పటేల్, మీర్జాలు వైద్యసేవలు అందించకుండానే తప్పుడు క్లెయిమ్‌లతో నిధులు రాబట్టుకునేవారని, ఇందులో పటేల్ ఎంఐ హెల్త్‌కేర్ అనే తన సంస్థద్వారా మోసాలకు పాల్పడ్డారని డేవిడ్ ఓనిల్ వివరించారు.