మహాకవి.. కాళోజీ !
ఇందూరు : కాళోజీ నారాయణరావు భారతదేశానికి పెద్ద కవిగానే కాకుండా సైద్ధాంతికంగా ఉదారవాది, ప్రజాస్వామ్య వాదిగా ఎన్నో పోరాటాలు చేశారని జిల్లా పరిషత్ ముఖ్యకార్య నిర్వహణ అధికారి(సీఈఓ) రాజారాం అన్నారు. మంగళవారం జడ్పీ సమావేశమందిరంలో కాళోజీ జయంతిని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన సీఈఓ జ్యోతి ప్రజ్వలన చేశారు. కాళోజీ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడ అన్యాయం జరిగినా కాళోజీ దానిని వ్యతిరేకిస్తూ పోరాటం చేశారని, తనలాగే అన్యాయాన్ని ఎదురించిన వారిని ఆదరించేవారన్నారు. 1914 సంవత్సరంలో జన్మించిన ఆయన పదహారేళ్లలోనే కవిత్వం రాశారని తెలిపారు. కాళోజీ ధ్యాస, శ్వాస మొత్తం అట్టడుగు వర్గాల ప్రజల శ్రేయస్సును కోరుకునేదన్నారు. మోసం చేసిన వారిని విడిచిపెట్టే మనస్తత్వం కాదన్నారు. అందులో మోసం చేసిన వాడు మనవాడైతే సహించేవారు కాదన్నారు.
కాళోజీ జీవితంలో ఉద్యమం ఒక భాగంగా మారి, తరువాత ఉద్యమమే జీవితంగా మారిపోయిందన్నారు. నిజాం రాజ్యాన్ని ప్రతిఘటించడం దగ్గర నుంచి నక్సలైట్లపై హింసను ఖండించే వరకు ఆయన చివరివరకూ పోరాటం చేస్తూనే ఉన్నారన్నారు. ఆర్య సమాజ్ కార్యకలాపాలు, గ్రంథాలయ ఉద్యమం, ఆంధ్ర మహాసభ, హైదరాబాద్ విమోచన ఉద్యమం, ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాటం, పౌరహక్కులు, తెలంగాణ ఉద్యమం ఇలా ఎలాంటి న్యాయపోరాట ఉద్యమానికైనా కాళోజీ రెండు చేతులతో ఆహ్వానం పలికి ఉద్యమకారుడిగానే కాకుండా కవిగా, కథకుడిగా ఉద్యమాలకు ఆలంబనయ్యారని కొనియాడారు.
ఈ క్రమంలో ఎన్నో సార్లు జైలు జీవితాన్ని సైతం అనుభవించారన్నారు. ప్రజలపై అణచివేత ఛాయలు ఎక్కడ కనిపించినా ధిక్కరించడం ఆయనకు ముందునుంచి అలవాటుగా మారిందని, అదే ఆయుధంగా మలుచుకున్నారని అన్నారు. తెలంగాణ ప్రజాకవిగా గుర్తింపు పొంది కవి సంఘానికి అధ్యక్షపాత్ర పోషించిన మొదటి వ్యక్తిగా చరిత్రలోకెక్కారని, అందుకే ఆయన మన మధ్య లేకున్నా ఎందరో మందికి ఆదర్శప్రాయుడిగా, స్పూర్తి ప్రదాతగా నిలిచారన్నారు. ఆయన బతికున్న సమయంలో తాను చనిపోతే దేహాన్ని ఒక మెడికల్ కళాశాలకు అప్పగిస్తున్నట్లు నిర్ణయం తీసుకున్న గొప్ప వ్యక్తిగా భారతదేశ చరిత్రపుటలోక్లి ఎక్కారని కొనియాడారు. ఆయన ఆశయాలను మనమందరం నిజం చేయాల్సిన అవసరం చాలా ఉందన్నారు.