‘గాలి నీటి’తో పంటల సాగు!
నేల, నీరు కాలకూట విషమైపోయినప్పుడు ఆరోగ్యదాయకమైన ఆహారం పండించేదెలా? పెరూ దేశంలోని బుజమ ప్రాంత రైతులను, వినియోగదారులకు ఎదురైన పెద్ద సవాలు ఇది. ఈ జటిల సమస్యకు అక్కడి యూనివర్సిటీ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (యూటెక్) విద్యార్థులు చక్కని పరిష్కారం కనుగొన్నారు. గనుల వ్యర్థజలాలు కలవడంతో రిమక్ నదిలో నీరు భార ఖనిజాలతో విషతుల్యమైపోయాయి. ఆ నీటితో సాగయ్యే ఆహారం తిన్న ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించే ప్రయత్నంలో యూటెక్ విద్యార్థులు శుద్ధమైన నీటిని వాతావరణం నుంచే ఒడిసిపట్టే ప్రక్రియను దేశీయ పరిజ్ఞానంతోనే కనుగొన్నారు. అక్కడ వీచే గాలిలో 98% తేమ ఉంటుంది.
ఆ తేమను శుద్ధమైన నీరుగా మార్చే డీహ్యుమిడిఫయర్లను రూపొందించారు. యూనివర్సిటీ వద్ద ఎత్తయిన బిల్ బోర్డును నిర్మించి.. అందులో డీహ్యుమిడిఫయర్లను అమర్చారు. అది ఒడిసిపట్టే శుద్ధమైన నీటిని తాగు నీటిగా వాడటంతోపాటు.. ఆ నీటితో విజయవంతంగా ఆకుకూరలు పండించారు. హైడ్రోపోనిక్ పద్ధతిలో ద్రవరూప పోషకాలతో సలాడ్స్‌లో వాడే లెట్యూస్ మొక్కలు పెంచారు. పొడవాటి 48 పీవీసీ పైపులను తీసుకొని, ఒక్కోదానికి 51 బెజ్జాలు పెట్టి.. వాటిలో తడవకు 2,448 లెట్యూస్ మొక్కలను పెంచి అటుగా వెళ్లే వారికి ఉచితంగా పంచారు. కష్టకాలంలో ఇలా కూడా ఆరోగ్యదాయకమైన పంటలు పండించే వీలుందని వారికి పచ్చని మొక్కలందిస్తూ తెలియ చెప్తున్నారు. అన్నట్టు.. శుద్ధమైన నీటిని ఒడిసిపట్టే మొట్టమొదటి బిల్‌బోర్డు ఇదేనట. విద్యార్థులు చూపిన పచ్చని బాట బాగుంది కదూ..!