డీఎన్ఏ.. అంతరిక్షంలోనూ చెక్కుచెదరదు!
లండన్: జీవుల జన్యు సమాచారాన్ని నిక్షిప్తం చేసుకుని ఉండే ‘డీఎన్ఏ’ జన్యు పదార్థం అంతరిక్షంలోని తీవ్ర ప్రతికూల వాతావరణంలోనూ చెక్కు చెదరదట. గురుత్వాకర్షణ లేమి పరిస్థితులకు గురై, అంతరిక్షం నుంచి తిరిగి భూమికి వచ్చినా దానిలోని జన్యు సమాచారం నిక్షేపంగా ఉంటుందట. స్విట్జర్లాండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ జూరిచ్ శాస్త్రవేత్తలు ఇటీవల నిర్వహించిన ప్రయోగంలో ఈ విషయం వెల్లడైంది.
రోదసిలోని ప్రతికూల పరిస్థితులను డీఎన్ఏ తట్టుకుంటుందా? అన్న కోణంలో పరిశోధనలు చేస్తున్న వీరు.. ‘టెక్సస్-49’ రాకెట్‌ను ప్రయోగించారు. ఈ రాకెట్ పైభాగంలో బయటి కవచంలో బ్యాక్టీరియా, ప్లవకాలకు చెందిన డీఎన్ఏను అమర్చి పంపారు. రాకెట్ నింగికి వెళ్లేటప్పుడు వెయ్యి డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత బయటి కవచాన్ని తాకింది. పేలోడ్ రోదసికి వెళ్లాక గురుత్వాకర్షణలేమికి గురైంది.
తిరిగి అత్యధిక వేడిని, పీడనాన్ని తట్టుకుంటూ భూవాతావరణంలోకి ప్రవేశించింది. చివరగా భూమికి చేరిన పేలోడ్‌లోని డీఎన్ఏ నమూనాలను పరీక్షించగా, సగం నమూనాలు చెక్కుచెదరకుండా ఉన్నట్లు గుర్తించారు. దీంతో.. జీవుల పుట్టుకకు అత్యవసరమైన ప్రాథమిక అణువులు, నీరు మన భూమిపైకి ఉల్కలు, తోకచుక్కల ద్వారానే చేరి ఉంటాయన్న వాదనకు మరింత బలం చేకూరింది.