కనుల పండువగా ఊంజలసేవ
– మూలబృందావనానికి పంచామృతాభిషేకం
– ఉరుకుంద భక్తులతో శ్రీమఠం కిటకిట
– అలరించిన సంగీత, నాట్య ప్రదర్శన
మంత్రాలయం : శ్రీ రాఘవేంద్రస్వామి 345 సప్తరాత్రోత్సవాల్లో భాగంగా సోమవారం ప్రహ్లాదరాయలకు ఊంజలసేవను అత్యంత వైభవంగా నిర్వహించారు. ముందుగా పీఠాధిపతి సుభుదేంద్రతీర్థులు రాయరు మూలబృందావనానికి మహా పంచామృతాభిషేకం, విశేష పుష్పాలంకరణ గావించారు. అనంతరం పూర్వపు పీఠాధిపతి సుజ్ఞానేంద్రతీర్థుల ఆరాధన నిర్వహించారు. పీఠాధిపతి వారి మృత్తిక బృందావనానికి అభిషేకం, హస్తోదకం, పుష్పార్చన, హారతులు పట్టారు. అనంతరం మూల, జయ, దిగ్విజయ రాముల పూజలో తరించారు. రాత్రి ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలను అశ్వవాహనంపై ఆశీనులను చేసి ఊంజల సేవ నిర్వహించారు.
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు :
డోలోత్సవ మండపంలో హైదరాబాద్కు చెందిన శేషులత కోసరు, యోగీంద్ర మండపంలో బెంగళూరు కృష్ణప్ప జోగి దాసవాణి భక్తులకు వీనుల విందు చేశాయి. విజయవాడ రోహిత కూచిపూడి నాట్య భంగిమలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఏఏవో మాధవశెట్టి, మేనేజర్ శ్రీనివాసరావు, జోనల్ మేనేజర్ శ్రీపతి ఆచార్, అసిస్టెంట్ మేనేజర్ ఐపీ నరసింహమూర్తి, ధార్మిక సహాయక అధికారి వ్యాసరాజాచార్, ద్వారపాలక అనంతస్వామి పాల్గొన్నారు.
నేడు సర్వ సమర్పణోత్సవం :
రాయరు సప్తరాత్రోత్సవాల ముగింపు సందర్భంగా మంగళవారం సర్వ సమర్పణోత్సవం నిర్వహిస్తారు. ఉదయం మండలంలోని నవ మంత్రాలయం (తుంగభద్ర)లో రథయాత్ర ఉంటుంది. పీఠాధిపతి అక్కడికి చేరుకుని రాఘవేంద్రుల మృత్తిక బృందావనానికి పంచామృతాభిషేకం, విశేషాలంకరణ, పూజలు, హారతులు పడతారు. చెక్క రథంపై రాయరును పురవీధుల్లో ఊరేగిస్తారు. రాత్రి శ్రీమఠంలో సర్వ సమర్పణోత్సవంలో భాగంగా పంచవాహనాలపై ప్రహ్లాదరాయలకు రథయాత్ర గావిస్తారు.