సొంతూరులో మోదీకి ఎదురుదెబ్బ.. కాంగ్రెస్ రెపరెపలు!
అహ్మదాబాద్: గుజరాత్లో తనకు తిరుగులేదని మరోసారి బీజేపీ నిరూపించుకున్నా.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సొంత నియోజకవర్గంలో మాత్రం ఓటమిపాలైంది. ప్రధాని మోదీ సొంతూరు వాద్నగర్ ఉన్న ఉన్జా నియోజకవర్గంలో కమలం ఓటమిపాలైంది. బీజేపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే పటేల్ నారాయణ్‌భాయ్ లల్లూదాస్‌ను కాంగ్రెస్ అభ్యర్థి ఆశా పటేల్ సుమారు 19,500 ఓట్ల మెజారిటితో ఓడించారు. పటీదార్ (పటేల్) సామాజికవర్గం ప్రాబల్యం అధికంగా ఉన్న ఈ నియోజకవర్గంలో ఆశా పటేల్‌కు 81,797 ఓట్లు రాగా, ఆమె ప్రత్యర్థి లల్లూదాస్కు 62,268 ఓట్లు వచ్చాయి.
2012లో లల్లూదాస్ 25వేల ఓట్ల మెజారిటీతో ఆశాపటేల్పై విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఉన్జా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి.. ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మోదీ సొంతూరు వాద్‌నగర్‌కు సమీపంలోని ఉమియా మాతా ఆలయాన్ని దర్శించుకున్నారు. ఇక్కడి ప్రజలను దృష్టిలో ఉంచుకొని ఎన్నికలకు కొన్నివారాలముందే ప్రముఖ పుణ్యక్షేత్రం హరిద్వార్‌లో ఉమియా ధామ్ ఆశ్రమాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు.