రిలయన్స్ జియో మరో సంచలన ఆఫర్!
న్యూఢిల్లీ : ఇప్పటికే టెలికాం కంపెనీల గుండెల్లో గుబులు పుట్టిస్తూ సంచలనమైన ఆఫర్లను తీసుకొచ్చిన రిలయన్స్ జియో, మరో కొత్త ఆఫర్‌తో మార్కెట్లోకి రాబోతుంది. 4జీ సామర్థ్యంతో ఫీచర్ ఫోన్లను లాంచ్ చేయాలని ప్లాన్స్ వేస్తోంది. కొత్త కేటగిరీ ప్రజలను సొంతంచేసుకుని, లక్షల కొలదీ కస్టమర్లను ఆకట్టుకోవడానికి ఫీచర్ ఫోన్ల లాంచింగ్ ఎంతో సహకరిస్తుందని ఈ టెలికాం వెంచర్ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ భావిస్తోంది. మార్కెట్లోకి తీసుకురాబోతున్న ఈ కొత్త తరం డివైజ్‌ల ధర కూడా చాలా చౌకగా రూ.1000గా ఉండనుందని తెలుస్తోంది.
ఈ డివైజ్‌లలో అపరిమితమైన వాయిస్ , వీడియో కాలింగ్, డిజిటల్ కంటెంట్ ఉంటాయని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ముఖేష్ అంబానీకి చెందినీ ఈ కంపెనీ, ఎల్టీఈ, వాయిస్ ఓవర్ ఎల్టీఈ టెక్నాలజీతో ఫీచర్లు ఫోన్లను తీసుకొస్తుందని, ఈ ఫోన్లు ఎక్కువగా కాల్స్ కోసం వాడే రూరల్, టైర్-2 మార్కెట్ల కస్టమర్లను ఆకట్టుకుంటాయని పేర్కొంటున్నాయి.
దేశంలోని అన్ని వర్గాల ప్రజలను తమ సొంతంచేసుకోవడమే జియో ఉద్దేశ్యమని, మొదటిసారి డేటా వాడే కస్టమర్లను టార్గెట్ చేసుకుని ఈ డివైజ్‌లు మార్కెట్లోకి వస్తున్నాయని పేర్కొన్నారు. ఇప్పటికీ భారత్‌లో 2జీ ఫీచర్ ఫోన్లకు అతిపెద్ద మార్కెట్ ఉంది. 1 బిలియన్ మొబైల్ ఫోన్ సబ్స్క్రైబర్లు కంటే ఎక్కువగా ఈ ఫీచర్ ఫోన్లనే వాడతున్నారు. కేవలం జియో మాత్రమే వాయిస్ ఓవర్ ఎల్టీఈ టెక్నాలజీని కాల్స్ చేసుకోవడానికి ఆఫర్ చేస్తోంది. ప్రస్తుతం ఈ టెక్నాలజీ కూడా కేవలం స్మార్ట్ఫోన్లకు మాత్రమే అందుబాటులో ఉంది.
కానీ రిలయన్స్ జియో తీసుకొచ్చే ఫీచర్ ఫోన్లోనూ ఇక ఈ టెక్నాలజీ అందుబాటులోకి రానుంది. రూ.1000, రూ.1500 ధరల్లో రెండు ఫీచర్ ఫోన్లను రిలయన్స్ అభివృద్ధి చేస్తుందని వాటిని, జనవరి-మార్చిలో లాంచ్ చేసే అవకాశాలున్నాయని మరో అధికారి చెప్పారు. స్మార్ట్ఫోన్ల మాదిరిగానే ఈ డివైజ్‌లు పనిచేయనున్నాయని, కేవలం టచ్ స్క్రీన్ మాత్రమే దీనిలో మిస్ అవుతామని పేర్కొన్నారు. ఒకవేళ జియో వాయిస్ ఓవర్ ఎల్టీఈ టెక్నాలజీతో ఫీచర్ ఫోన్లను తీసుకొస్తే, మార్కెట్లో ఇతర టెలికాం కంపెనీలన్నీ షేక్ అవుతాయని విశ్లేషకులంటున్నారు.