వినియోగదారులకు ఆర్‌కామ్ బంపర్ ఆఫర్!
న్యూఢిల్లీ : ఓ వైపు అన్న ముఖేష్ అంబానీ టెలికాం రంగంలో దూసుకెళ్తుండగా.. తమ్ముడు సైతం అన్నకు బలమైన పోటీని ఇస్తున్నారు. వినియోగదారుల కోసం కొత్త కొత్త ఆఫర్లను ప్రకటిస్తున్నారు. అనిల్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ కమ్యూనికేషన్స్(ఆర్‌కామ్) రూ. 149కే అపరిమిత కాలింగ్ ప్లాన్‌ను మంగళవారం లాంచ్ చేసింది. దేశవ్యాప్తంగా ఏ టెలికాం నెట్‌వర్క్‌కైనా, ఏ మొబైల్ నుంచైనా అపరిమిత కాలింగ్ టాక్ టైమ్ సద్వినియోగం చేసుకునేలా ఈ ప్లాన్ దోహదం చేయనుంది. ఎక్కువ దూరం చేసే కాల్స్‌కు కూడా ఈ ఫ్లాన్ ఉపయోగపడనుంది. దీనికోసం వినియోగదారులు నెలకు రూ.149 చెల్లిస్తే చాలని కంపెనీ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది.
2జీ, 3జీ, 4జీ టెక్నాలజీ ప్లాట్‌ఫామ్స్‌లో అన్ని నెట్‌వర్క్‌లకు ఈ ప్లాన్ అందుబాటులో ఉంటుంది. 2జీ, 3జీ, 4జీ హ్యాండ్సెట్ ఓనర్లను టార్గెట్‌గా చేసుకుని ప్రవేశపెట్టిన ఈ ఆఫర్ ద్వారా, వారిని ఆర్‌కామ్ నెట్‌వర్క్‌లోకి మరల్చడానికి ఈ ప్లాన్ దోహదం చేయనున్నట్టు కంపెనీ తెలిపింది. ఈ ప్లాన్‌పై 300 ఎంబీ డేటా వాడకాన్ని కూడా సద్వినియోగం చేసుకోవచ్చని పేర్కొంది. ఇప్పటికీ భారత్‌లో వందల లక్షల మంది 2జీ హ్యాండ్సెట్ ఓనర్లు ఉన్నారని ఆర్‌కామ్ చెప్పింది. యూజర్లను యూనిట్ రేట్ చార్జింగ్ విధానం నుంచి సింగిల్ రీచార్జ్‌తో, అపరిమిత వాడక పద్ధతిలోకి టెలికాం మార్కెట్‌ను తీసుకురావడానికి తమ కొత్త అన్లిమిటెడ్ ప్లాన్ సహకరించనుందని ఆర్‌కామ్ కన్సూమర్ బిజినెస్ సీఈవో, రిలయన్స్ కమ్యూనికేషన్స్ కో-సీఈవో గుర్దీప్ సింగ్ చెప్పారు. లక్షల కొలదీ భారతీయులు తమ అన్లిమిటెడ్ ప్లాన్‌తో లబ్దిపొందనున్నట్టు ఆశాభావం వ్యక్తంచేశారు.