ఐక్యరాజ్య సమితి అధ్యక్షునికి ఫోన్ చేసిన ఇమ్రాన్
వాషింగ్టన్ : పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్, ఐక్యరాజ్యసమితి అధ్యక్షుడు ఆంటోనియో గట్టర్స్‌కు ఫోన్ చేసి కశ్మీర్ విషయం గురించి మాట్లాడినట్లు తెలిసింది. ఈ విషయ గురించి స్వయంగా ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ అధికార ప్రతినిధి స్టీఫెన్ డుజార్రిక్ పీటీఐకు వెల్లడించారు. స్టీఫెన్, పీటీఐతో మాట్లాడుతూ పలు దేశాల అధిపతులు, ప్రధానులు, అధ్యక్షులు యూఎన్ అధ్యక్షుడితో మాట్లాడటం చాలా సాధరణం. అందులో భాగంగానే ఇమ్రాన్, ఆంటోనియోకు ఫోన్ చేశారన్నారు. ఈ సందర్భంగా ఇమ్రాన్‌కు కశ్మీర్‌పై తమ వైఖరేంటో చెప్పామన్నారు స్టీఫెన్. అయితే ఇమ్రాన్ కశ్మీర్ అంశం లేవనెత్తిన అనంతరం ఇరువురు మధ్య జరిగిన సంభాషణ వివరాలను మాత్రం ఆయన వెల్లడించలేదు. అంతేకాక కశ్మీర్ అంశం గురించి ఐక్యరాజ్య సమితి మిలిటరీ అబ్సర్వర్ గ్రూపు(యూన్ఎమ్ఓజీఐపీ) తరఫున పరిశీలకుల బృందం పని చేస్తోందని స్టీఫెన్ తెలిపారు.
కొన్ని రోజులుగా కశ్మీర్ వ్యవహారంతో పాటు మరి కొన్ని సందర్భాల్లో పాకిస్థాన్ తీరుపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పాక్ తీరును విమర్శిస్తూ ‘మీ పని మీరు చూసుకుంటే మంచిదం’టూ భారత్ తీవ్ర స్థాయిలో జవాబిచ్చింది. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ ఆంటోనియోతో మాట్లాడటం ప్రాధాన్యత సంతరించుకుంది. కశ్మీర్ అంశం పరిశీలన గురించి ఐక్యరాజ్యసమితి 1949లో మిలిటరీ అబ్సర్వర్ గ్రూపును ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఇందులో 118 మంది ఐక్యరాజ్యసమితి సిబ్బంది పనిచేస్తున్నారు. 1971 ఇండియా-పాక్ యుద్ధం, అదే ఏడాది ఇరు దేశాల మధ్య జరిగిన కాల్పుల విరమణ ఒప్పందం నుంచి ఈ సంస్థ ఇరు దేశాల మధ్య జరుగుతున్న పరిణామాలను పర్యవేక్షించి వాటిని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్‌కు నివేదిస్తోంది.