కశ్మీర్‌లోని పరిస్థితుల పర్యవేక్షణను భారత్, పాక్‌లలోని తమ సైనిక పరిశీలక బృందం (యూఎన్‌ఎంవోజీఐపీ) కొనసాగిస్తుందని తొలుత ప్రకటించిన ఐక్యరాజ్య సమితి.. దాన్ని సవరిస్తూ మరో ప్రకటన చేసింది. తమ పర్యవేక్షణ నియంత్రణ రేఖ (ఎల్‌వోసీ) వరకే పరిమితమని స్పష్టం చేసింది.
యూఎన్‌ఎంవోజీఐపీ ద్వారా కశ్మీర్‌లో తమ పర్యవేక్షణ కొనసాగిస్తామని బాన్ కీ మూన్ డిప్యూటీ అధికార ప్రతినిధి ఫర్హాన్ హాక్ మంగళవారం విలేకరులతో వెల్లడించిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన ఐరాస ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ అధికార ప్రతినిధి స్టీఫెన్ డుజర్రిక్.. తమ పర్యవేక్షణ ఎల్‌వోసీ వరకే పరిమితమని స్పష్టం చేశారు. ‘నియంత్రణ రేఖ వెంబడి జరగుతున్న కాల్పుల విరమణపై నివేదించడమే యూఎన్‌ఎంవోజీఐపీ పని. కశ్మీర్‌లో జరుగుతున్న ఘటనలు భారత్ అంతర్గత వ్యవహరానికి సంబంధించినవి. అవి యూఎన్‌ఎంవోజీఐపీ పరిధిలోకి రావు. ఎల్‌వోసీ వెంబడి జరిగే ఘటనలను గమనించడం, నివేదించడమే దాని పని. అంతేకాని జమ్యూకశ్మీర్ పరిస్థితిని పర్యవేక్షించడం కాదు’ అని స్పష్టం చేశారు.